గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు | Collapsing knowledge systems in Gaza | Sakshi
Sakshi News home page

గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు

Published Thu, May 16 2024 4:16 AM | Last Updated on Thu, May 16 2024 4:16 AM

Collapsing knowledge systems in Gaza

ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. 

గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.


గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్‌ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్‌ లక్ష్యాలలో అల్‌–అజహర్‌ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.

ఐయూజీ ప్రెసిడెంట్, వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సుఫియాన్‌ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్‌పై జరిగిన ఇజ్రాయెల్‌ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్‌ తాయెహ్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్‌ రెఫాత్‌ అలరీర్‌ మరొకరు.

పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్‌ నేషన్స్ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.

‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.

ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్‌ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్‌లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ టీచర్స్‌కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్‌ రాయల్‌ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్‌ ముహన్నద్‌ అయ్యాష్‌ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్‌) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.

‘ఎపిస్టెమిసైడ్‌’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్‌  బోవెంచురా డి సౌసా శాంటోస్‌ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.

1948లో ఇజ్రాయెల్‌కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్‌ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం.

 కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్‌లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. 

దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్‌ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.

లాస్‌ఏంజిల్స్‌లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్‌ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.

ఇజ్రాయెల్‌తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్‌ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్‌ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్‌–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.

ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.

- వ్యాసకర్త నార్తర్న్‌ బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
- అమర్‌జీత్‌ భుల్లర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement