ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించండి | UGC Guidelines for Educational Institutions to start Online courses | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించండి

Published Thu, Jul 14 2022 4:32 AM | Last Updated on Thu, Jul 14 2022 3:07 PM

UGC Guidelines for Educational Institutions to start Online courses - Sakshi

సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ‘మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు’ (మూక్స్‌)కింద స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ యాస్పైరింగ్‌ మైండ్స్‌ (స్వయం) ద్వారా రూపకల్పన చేసిన కోర్సుల్లో 40 శాతం ఆన్‌లైన్లో అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సూచించింది. విద్యా సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు ఇవి అదనమని తెలిపింది. వీటి అమలుకు చర్యల నివేదికలను కూడా సమర్పించాలని తాజాగా పేర్కొంది. విద్యార్థులు డిజిటల్, ఆన్‌లైన్‌ వేదికలుగా చదువులు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూక్స్‌ వేదికను ఏర్పాటు చేసింది.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్రం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘స్వయం’ ద్వారా వివిధ ఆన్‌లైన్‌ కోర్సులకు రూపకల్పన చేసింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు అవి అందిస్తున్న కోర్సులకు అదనంగా ‘స్వయం’ ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులనూ అందించాలని 2021లోనే సూచించింది. కరోనా సమయంలో కొంతవరకు స్పందన వచ్చినా, ఆ తర్వాత అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. దీంతో ‘స్వయం’ కోర్సుల్లో కనీసం 40 శాతమైనా అందించాలని తాజాగా పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందుకోగలుగుతారని భావిస్తోంది.  

రెగ్యులర్‌ కోర్సులు చేస్తూనే డ్యూయెల్‌ డిగ్రీ కింద స్వయం కోర్సులకు అవకాశం కల్పించింది. ఈ కోర్సులకు యూజీసీ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్కును కూడా ఏర్పాటుచేసింది. ఈ కోర్సులు అభ్యసించే వారికి క్రెడిట్ల కేటాయింపుతో పాటు వాటిని వేర్వేరు కోర్సులు అభ్యసించే సంస్థలకు బదలాయించుకొనే వెసులుబాటు కూడా కల్పించింది. పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే క్రెడిట్‌ బదిలీ కోసం ‘స్వయం’ కోర్సులను ఆమోదించాయని, మిగిలిన వర్సిటీలు కూడా చర్యలు తీసుకోవాలని యూజీసీ తాజాగా పేర్కొంది.

ముందుగా వర్సిటీలు అకడమిక్‌ కౌన్సిళ్ల నుంచి ఆమోదం పొందాలని పేర్కొంది. క్రెడిట్ల కేటాయింపు, బదిలీని ఆయా విభాగాల హెడ్‌లు, డీన్‌లు ఆమోదించాలని తెలిపింది. ఈ ఆన్‌లైన్‌ కోర్సుల విధానంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఇలా డిజిటల్, ఆన్‌లైన్‌ బోధన వల్ల ప్రమాణాలు మెరుగుపడవని అభిప్రాయపడుతున్నారు. పైగా ఆన్‌లైన్‌ కోర్సుల్లో పర్యవేక్షణ కొరవడుతుందని, విద్యార్థుల  సామర్థ్యాలు, నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇలా ఆన్‌లైన్‌ బోధన వైపు వెళ్లడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement