సాక్షి, అమరావతి: ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌మయం. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ తన హవాను ప్రదర్శిస్తోంది. ఇందుకు విద్యా రంగం మినహాయింపు కాదు. ముఖ్యంగా కోవిడ్ కల్లోల పరిస్థితుల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యాప్స్, వెబ్‌సైట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్కూళ్లు, కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా ఇళ్లకే అతుక్కుపోయారు. దీంతో ఆయా విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ వేదికగా పాఠాలు బోధించాయి. అభ్యసనం మొదలుకుని.. పరీక్షల వరకు అన్నీ ఆన్‌లైన్ వేదికగానే సాగాయి.
ఈ నేపథ్యంలో దేశంలో ఆన్‌లైన్ చదువులపై ఆసక్తి చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేరుగా కాలేజీల్లో చదివే అవకాశాల్లేనివారితో పాటు ఉద్యోగాల్లో ఉన్నవారు, అదనపు విద్యార్హతలను సంపాదించుకోవాలనుకొనే వారు ఈ ఆన్‌లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతూ అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఆన్‌లైన్ విద్య అందరికీ మరింత అందుబాటులోకి వచ్చింది.
‘స్వయం’.. వందలాది కోర్సులు..
ఆన్‌లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఎడ్‌టెక్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ విద్యాసంస్థలు, వర్సిటీలు కూడా ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్’ (స్వయం – https://swayam.gov.in/) ఏర్పాటు చేసి వందలాది కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించి ఇదివరకు ఉన్న నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒకింత సడలించింది.
నిర్ణీత ప్రమాణాలతో ఆన్‌లైన్ కోర్సులను అందించేందుకు పలు సంస్థలకు అనుమతులు కూడా మంజూరు చేస్తోంది. యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. మరోవైపు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) కూడా https://nptel.ac.in/ ద్వారా ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులే కాకుండా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ కోర్సులను అభ్యసించేలా చర్యలు చేపట్టాయి.
ఆన్‌లైన్‌లోనే కాకుండా ఓడీఎల్ విధానంలోనూ..
కరోనాకు ముందు ఆన్‌లైన్ చదువులవైపు ఆసక్తి చూపినవారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కరోనా తర్వాత వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2021–2022లో ఆన్‌లైన్ కోర్సుల్లో చేరినవారి సంఖ్య 170 శాతం మేర పెరిగినట్లు యూజీసీ సహా పలు సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలోనూ ఆన్‌లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. ఆన్‌లైన్, ఓడీఎల్ మార్గాల్లో చదువులు కొనసాగిస్తున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఆ మేరకు సంస్థలు కూడా అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.
బిజినెస్ మేనేజ్‌మెంట్‌పైనే మోజు..
వివిధ వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు అందిస్తున్న ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు, వాటిలో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆన్‌లైన్, ఓడీఎల్ కోర్సులను అభ్యసించే వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. ఉన్నత విద్య విభాగం సర్వే గణాంకాలు పరిశీలిస్తే.. పురుషుల సంఖ్యలో సగం మంది మహిళలు మాత్రమే ఈ ఆన్‌లైన్, ఓడీఎల్ కోర్సుల్లో చేరుతున్నారు.
అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేవారిలో ఎక్కువ మంది బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెంట్రల్, స్టేట్, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి.
ఐఐటీలు వంటి జాతీయస్థాయి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆన్‌లైన్, ఓడీఎల్ కోర్సులు అందిస్తున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థులు కూడా వీటిని అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం.
ఆన్‌లైన్ చదువులపైనే ఆసక్తి
Published Mon, Feb 6 2023 5:16 AM | Last Updated on Mon, Feb 6 2023 5:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment