అంతర్జాతీయ వర్సిటీల ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు | Free Online Courses of International Universities | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వర్సిటీల ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు

Published Thu, Apr 16 2020 5:13 AM | Last Updated on Thu, Apr 16 2020 5:13 AM

Free Online Courses of International Universities - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొనేందుకు ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు సహా పలు వర్సిటీలు ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, డ్యూక్, మిచిగాన్‌ సహా అంతర్జాతీయంగా ప్రముఖ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించేందుకు నిర్ణయించాయి. మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు (మూక్స్‌) విధానంలో అందించే ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు, క్రెడిట్లు అందిస్తాయి. ఈ క్రెడిట్లకు భవిష్యత్తులో ప్రాధాన్యం కూడా దక్కనుంది.

► స్టాన్‌ఫోర్డ్, జార్జియాటెక్, యేల్, డ్యూక్, మిచిగాన్‌ వంటి అనేక వర్సిటీలలొ దాదాపు 178 మూక్స్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు. 
► ఉచితంగా ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందించనున్న వర్సిటీలు 50.
► వీటిలో పెన్, జార్జియాటెక్, జాన్స్‌ హాకిన్స్, కాల్‌టెక్, డ్యూక్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటివి ఉన్నాయి.
► 180 రోజుల్లో పూర్తయ్యేలా ఈ సర్టిఫికేషన్‌ కోర్సులకు ఈ ఏడాది మే ఆఖరు వరకే అవకాశం ఉంది.
► ఇవే కాకుండా గూగుల్, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఫ్రీ  ఆన్‌లైన్‌ కోర్సులను  అందిస్తున్నాయి.
► ఈ కోర్సుల వ్యవధి వారంలో 5 నుంచి 10 గంటలవరకు మాత్రమే ఉంటుంది.

ఫ్రీ ఆన్‌లైన్‌ కోర్సుల్లో ముఖ్యమైన కేటగిరీలు
కంప్యూటర్‌ సైన్సు; బిజినెస్‌; ఇంజనీరింగ్‌; హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌;  హ్యుమానిటీస్‌; 
డేటా సైన్స్‌;  పర్సనల్‌ డెవలప్‌మెంట్‌; ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ 
ప్రోగ్రామింగ్‌; మేథమెటిక్స్‌; సైన్స్‌; సోషల్‌ సైన్సెస్‌. ఈ విభాగాల్లోనూ పలు స్పెషలైజ్డ్‌ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. 

ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రయినింగ్‌: ఉచితంగా అందిస్తున్న ఈ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని https://www.classcentral.com/report/coursera-free-certificate-covid-19/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఈ ఉచిత ఆన్‌లైన్‌ కోర్సుల అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆ క్రెడిట్లతో ప్రయోజనం పొందగలుగుతారని రాష్ట్ర విదేశీవిద్య కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు పేర్కొన్నారు.

విద్యా సమాచారం
ఆకాశవాణి ద్వారా ఎంసెట్‌ శిక్షణ 
కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు దూరమై ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి ఆన్‌లైన్‌ విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఎంసెట్‌ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. రోజూ ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా వినవచ్చన్నారు. రేడియో సెట్‌ లేని విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్‌లో ఆల్‌ ఇండియా రేడియో మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా వినాలని సూచించారు.  

ఫీజులపై త్వరలో నోటిఫికేషన్‌
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంఎడ్, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ (ఎల్‌పీటీ) తదితర కోర్సులకు సంబంధించి 2020–21 నుంచి 2022–23 వరకు మూడేళ్ల కాలపరిమితి ఫీజుల ఖరారుకు సంబందించి త్వరలోనే నోటిఫికేషన్‌ను వెలువరించనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను కమిషన్‌ పూర్తిచేసిందని వివరించారు. ఈనెల 18 లేదా 19వ తేదీల్లో నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు. 

సెట్ల దరఖాస్తు ఫీజు గడువు పెంపు
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ దరఖాస్తు గడువును పొడిగించినట్లు వివరించారు. ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 7 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. 

డేటా అప్‌లోడింగ్‌ గడువు పెంపు
కోవిడ్‌–19 నేపథ్యంలో రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సులకు ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఆయా కాలేజీల డాక్యుమెంట్లు, ఇతర సమాచారం, అప్‌లోడింగ్‌ గడువును కాలేజీల వినతి మేరకు మే 6 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీహెచ్‌ఈఎంఆర్‌సీ) కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.రాజశేఖరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్‌లో తెలిపిన మేరకు కోర్సుల వారీగా నిర్ణీత రుసుమును ఏప్రిల్‌ 24వ తేదీలోగా కాలేజీలు చెల్లించాల్సి ఉంటుంది.

డిగ్రీ, లా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీల సమాచార సమర్పణ గడువు పొడిగింపు
రాష్ట్రంలో సాధారణ డిగ్రీ, లా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులకు ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఆయా కాలేజీలు డాక్యుమెంట్లు, ఇతర సమాచార సమర్పణ తేదీని మే 6 వరకు పొడిగించినట్లు రాజశేఖరరెడ్డి తెలిపారు. కాలేజీలు చెల్లించాల్సిన ప్రాసెసింగ్‌ ఫీజును ఏప్రిల్‌ 24లోగా చెల్లించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement