సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడి విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆన్‌లైన్ కోర్సులు విద్యార్థులకు అక్కరకు వస్తున్నాయి. పలు కోర్సులను ఇళ్ల నుంచే అభ్యసించి పరీక్షలు రాసేందుకు ఆన్‌లైన్ వేదికలు దోహదం చేస్తున్నాయి. కోవిడ్–19 కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ‘స్వయం’ ఆన్‌లైన్ వేదిక ద్వారా ఇప్పటికే పలు ఆన్‌లైన్ కోర్సులకు అవకాశం కల్పిస్తున్న యూజీసీ మరిన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నిపుణులైన అధ్యాపకుల ద్వారా ఆన్‌లైన్‌కు అనువుగా పాఠ్యాంశాలను రూపొందిస్తారు.
► 2017లో ప్రారంభమైన స్వయం ఆన్‌లైన్ వేదికలో వివిధ విభాగాలలో ఇప్పటికే 2 వేల కోర్సులు అందుబాటులో ఉండగా 1.6 కోట్ల మంది విద్యార్థులు, ఇతర అభ్యాసకులు ఇందులో నమోదు చేసుకున్నారు. దాదాపు అన్ని విభాగాల్లో ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది.
► ఈ ఏడాది 574 కోర్సులలో 26.03 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సులు కావడంతో పాటు యూజీసీ క్రెడిట్లు కేటాయిస్తూ క్రెడిట్ ఫ్రేమ్‌వర్కు నిబంధనల ప్రకారం బదిలీకి కూడా అవకాశం కల్పించడంతో ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది.
► రెగ్యులర్ కోర్సుల ప్రకారం చూస్తే స్వయం ద్వారా మొత్తం కోర్సుల్లో ఒక్కో సెమిస్టర్లో 20 శాతం మేర మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మరో 40 శాతం విస్తరించాలని యూజీసీ నిర్ణయించింది. యూజీ, పీజీ కోర్సులను ఆన్‌లైన్‌లోకి మార్పు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు పాఠ్యాంశాల వీడియోలు, ఈ–మెటీరియల్ రూపకల్పనకు యూజీసీ చర్యలు చేపట్టింది.
► ఈ కోర్సులను అభివృద్ధి చేసేందుకు అర్హులైన అధ్యాపకుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను యూజీసీ ఆహ్వానిస్తోంది.
► యానిమేషన్, వీడియోలు, వర్చువల్ ల్యాబ్‌లు, ఇంటర్వ్యూలు ఇలా వివిధ రూపాల్లో ఈ కోర్సులకు ఆన్‌లైన్ కంటెంట్ రూపొందిస్తారు. ఆన్‌లైన్ చర్చా వేదికలు, ప్రశ్నోత్తరాలు, క్విజ్‌లు, అసైన్‌మెంట్లు, సందేహాల నివృత్తి తదితర రూపాల్లో ఈ కోర్సులుంటాయి.
► ఒక్కో మాడ్యూల్ వీడియో సుమారు 25–30 నిమిషాల వ్యవధి ఉంటుంది. అవసరమైతే మూడు, నాలుగు వీడియోలుగా రూపొందిస్తారు. ఆన్‌లైన్‌లో విద్యార్థులను ఎక్కువ సేపు ఏకాగ్రతతో ఉంచడం కష్టం కాబట్టి సుదీర్ఘ అంశాలను కుదిస్తారు. బోధన ఆకర్షణీయంగా ఉండేందుకు ఆటలు, క్విజ్‌లు లాంటివి కూడా చేరుస్తారు.
► కోర్సు వ్యవధి సాధారణంగా 8 నుంచి 12 వారాలు ఉంటుంది.
► ఈ కోర్సుల వీడియోలు, ఇతర అంశాలను రూపొందించేందుకు ఆసక్తి చూపే అధ్యాపకులకు పీహెచ్‌డీ అర్హతతో పాటు గుర్తింపు పొందిన వర్సిటీ, విద్యాసంస్థలో సభ్యుడిగా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల బోధనా అనుభవం ఉండాలి. వర్సిటీ అంగీకార లేఖ కూడా సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment