
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలోని రిమ్స్‌లో సోమవారం కరోనా వైరస్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫైనలియర్‌కు చెందిన 48 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వివరాలు.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్ అధికారులు 146 మంది విద్యార్థులకు కరోనా టెస్ట్‌లు చేశారు.
ఈ నివేదికలు సోమవారం సాయంత్రం రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మికి అందాయి. ఇందులో 48 మందికి కరోనా సోకినట్లు తేలింది. రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ.. మొత్తం 146 మంది వైద్య విద్యార్థులూ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. కరోనా సోకిన 48 మంది ఎలాంటి ఇబ్బంది పడకుండా పరీక్షలు రాసేందుకు ప్రత్యేక గదులు, ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా, కరోనా నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment