rims college
-
రిమ్స్ కాలేజీలో కరోనా కలకలం
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలోని రిమ్స్‌లో సోమవారం కరోనా వైరస్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫైనలియర్‌కు చెందిన 48 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వివరాలు.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్ అధికారులు 146 మంది విద్యార్థులకు కరోనా టెస్ట్‌లు చేశారు. ఈ నివేదికలు సోమవారం సాయంత్రం రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మికి అందాయి. ఇందులో 48 మందికి కరోనా సోకినట్లు తేలింది. రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ.. మొత్తం 146 మంది వైద్య విద్యార్థులూ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. కరోనా సోకిన 48 మంది ఎలాంటి ఇబ్బంది పడకుండా పరీక్షలు రాసేందుకు ప్రత్యేక గదులు, ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా, కరోనా నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. -
300 ఎంబీబీఎస్ సీట్లకు కోత!
నాలుగు వైద్య కాలేజీల్లో సీట్ల కొనసాగింపునకు ఎంసీఐ నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) షాక్ ఇచ్చింది. గతేడాది ఈ కాలేజీలకు అదనంగా కేటాయించిన సీట్ల కొనసాగింపునకు తిరస్కరించింది. దీంతో 300 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. గత ఏడాది కొత్తగా ఏర్పాటైన నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలకు 100 సీట్లు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఈ సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ తిరస్కరించింది. అలాగే ఒంగోలులోని రిమ్స్ కాలేజీలో కొన్నేళ్లుగా 100 ఎంబీబీఎస్ సీట్లతో కొనసాగుతుండగా, ఈ ఏడాది ఆ సీట్ల రెన్యువల్‌కు అనుమతినివ్వలేదు. దీంతో నిజామాబాద్, ఒంగోలు రిమ్స్‌లలో ఈ ఏడాది అడ్మిషన్లు ఉండవు. సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లుండగా, గతేడాది అదనంగా 50 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ 50 సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ అనుమతించలేదు. తిరుపతిలోని వెంకటేశ్వర వైద్య కళాశాల పరిస్థితీ అంతే. గత ఏడాది ఇచ్చిన 50 సీట్లకు ఈసారి అనుమతినివ్వలేదు. వైద్య విద్యకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, అధ్యాపకుల కొరత ఉందన్న కారణంగానే సీట్లను తొలగించినట్లు ఎంసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,300 సీట్లుండగా, ఆ సంఖ్య ఈ ఏడాది 2 వేలకు పడిపోయింది. మరికొద్ది రోజుల్లో ఎంసెట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో సీట్లలో కోత విధించడంతో ఎంబీబీఎస్‌లో చేరాలనుకునే విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
తీరని వ్యథ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ కళాశాల కథ మారలేదు. వ్యథా తీరలేదు. అదనపు స్వయం ప్రతిపత్తి కింద కొనసాగుతున్న రిమ్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆధీనంలోకి రిమ్స్ వస్తే సౌకర్యాలు మెరుగుపడి నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రజలు ఆశించారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన అమలులోకి రావడంతో ఆ ఉత్తర్వులకు అధికారిక ముద్ర పడలేదు. దీంతో పాత పద్ధతిలో సెమీ అటానమస్ విధానం కిందే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెనుకబడిన జిల్లాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు రిమ్స్‌ను మంజూరు చేశారు. అప్పట్లోనే ప్రత్యేక జీవో ద్వారా రిమ్స్‌కు సెమీ అటానమస్ హోదా కల్పించారు. అయితే రిమ్స్‌లో 15 మంది వైద్యులను మినహాయిస్తే మిగతా వారంతా ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్నారు. నిర్వహణ నిధుల్ని సైతం ప్రణాళిక బడ్జెట్ నుంచే కేటాయిస్తున్నారు. కళాశాల ఆరంభమై ఆరేళ్లవుతున్నా..వైద్యశాలలో పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు, విభాగాల వారీగా నిపుణులు భర్తీకాలేదు. దీంతో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ రోగులకు అసలు సేవలే అందడం లేదు. ప్రతి కేసును గుంటూరు జనరల్ వైద్యశాలకు రిఫర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు నాణ్యమైన సేవలందించేందుకు ప్రభుత్వం రిమ్స్‌ను తన ఆధీనంలోకి తీసుకోవాలని భావించింది. ఏప్రిల్ 1 నుంచి రిమ్స్‌ను ప్రభుత్వపరంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు గత ఏడాది డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేశారు. పొరుగు సేవలు, ఒప్పంద విధానంలో కొనసాగుతున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్కానింగ్, ల్యాబ్ విభాగాలతో పాటు నాలుగో తరగతి ఉద్యోగుల వరకు ప్రభుత్వమే నియమిస్తుందని స్పష్టం చేశారు. కానీ ఆ గడువు ముగిసినా..ప్రభుత్వం ఆధీనంలోకి రిమ్స్‌ను తీసుకునేలా చర్యలు లేకపోవడంతో పాత విధానంలోనే రిమ్స్ కొనసాగాల్సి వస్తోంది. సెమీ అటానమస్ విధానంలో పనిచేస్తున్న రిమ్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలంటే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతుండటంతో అందుకు అవకాశం లేదు. దీంతో సీమాంధ్ర రాష్ట్రం పూర్తిస్థాయిలో విభజన జరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తీసుకునే నిర్ణయంపై రిమ్స్ వ్యవహారం ఆధారపడి ఉంది. కాంట్రాక్టు గడువు పొడిగించారు డాక్టర్ బీ అంజయ్య, డైరక్టర్ రిమ్స్ రిమ్స్‌లో ఒప్పంద విధానంలో పని చేస్తున్న వైద్యుల పదవీ కాలాన్ని ఈ ఏడాది మార్చి నుంచి మరో ఏడాది వరకు ప్రభుత్వం పొడిగించింది. దీంతో సెమీ అటానమస్ విధానంలోనే రిమ్స్ కొనసాగుతోంది.