UGC guidelines
-
ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఏకకాలంలో రెండు కోర్సులు అభ్యసించేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలు జారీచేసింది. పీహెచ్డీ మినహా మిగిలిన కోర్సులకు నిబంధనలను అనుసరించి వీటిని విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అన్ని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఈమేరకు చర్యలు చేపట్టాలని తాజాగా ఆదేశించింది. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020 విధానాల్లో పూర్తిగా మార్పులు చేయాలని సూచించింది. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలో నచ్చిన కోర్సులను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని, ఆన్లైన్ విద్య కార్యక్రమాలను సిద్ధం చేయాలని ఆయా విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. ఇవీ మార్గదర్శకాలు ♦ఒక విద్యార్థి ఫిజికల్ మోడ్లో రెండు విద్యా కార్యక్రమాలను పూర్తి సమయం కొనసాగించవచ్చు. తరగతి సమయాలు భిన్నంగా ఉండేలా చూడాలి. ♦విద్యార్థి రెండు విద్యా కార్యక్రమాలను ఒకేసారి కొనసాగించవచ్చు, ఒకటి పూర్తి సమయం భౌతికంగా మరొకటి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్)/ఆన్లైన్ మోడ్లో చేయవచ్చు. లేదా రెండూ ఓడీఎల్/ఆన్లైన్ ప్రోగ్రామ్లలో ఏకకాలంలో అభ్యసించవచ్చు. ♦ఓడీఎల్/ఆన్లైన్ మోడ్ కింద డిగ్రీ లేదా డిప్లొమా ప్రోగ్రామ్లు యూజీసీ/చట్టబద్ధ సంస్థలు, ప్రభుత్వాలు గుర్తించిన కార్యక్రమాలకే పరిమితం కావాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థలే వీటిని చేపట్టాలి. ♦యూజీసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రెండు డిగ్రీలు చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా ఉంటే యూజీసీ నిబంధనలను అనుసరించి అనుమతి పొందాలి. నూతన విధానం లక్ష్యాలు ♦విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించేందుకు అనుమతించాలి. ♦సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్స్ సహా ఇతర విభాగాల్లో అవకాశం కల్పించాలి. ♦భాష, ప్రొఫెషనల్, టెక్నికల్, వొకేషనల్ విషయాలను కూడా అందుబాటులోకి తేవాలి. ♦నచ్చిన అంశాలను నేర్చుకోవడంతోపాటు ఆసక్తి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలలో క్షుణ్నంగా అధ్యయనానికి వీలు కల్పించాలి. -
దేశవ్యాప్తంగా 21 నకిలీ వర్సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ నకిలీ యూనివర్సిటీ అని విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీల వివరాలను బహిర్గతం చేసింది. ఆయా వర్సిటీలు యూజీసీ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. వాటికి ఎలాంటి డిగ్రీలను అందజేసే అధికారం లేదని తేల్చిచెప్పింది. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్లో 4, పశ్చిమబెంగాల్లో 2, ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి చొప్పున నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: Viral Video:ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు -
ఆన్లైన్ కోర్సులు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ‘మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు’ (మూక్స్)కింద స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ (స్వయం) ద్వారా రూపకల్పన చేసిన కోర్సుల్లో 40 శాతం ఆన్లైన్లో అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. విద్యా సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు ఇవి అదనమని తెలిపింది. వీటి అమలుకు చర్యల నివేదికలను కూడా సమర్పించాలని తాజాగా పేర్కొంది. విద్యార్థులు డిజిటల్, ఆన్లైన్ వేదికలుగా చదువులు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూక్స్ వేదికను ఏర్పాటు చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్రం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘స్వయం’ ద్వారా వివిధ ఆన్లైన్ కోర్సులకు రూపకల్పన చేసింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు అవి అందిస్తున్న కోర్సులకు అదనంగా ‘స్వయం’ ద్వారా ఆన్లైన్ కోర్సులనూ అందించాలని 2021లోనే సూచించింది. కరోనా సమయంలో కొంతవరకు స్పందన వచ్చినా, ఆ తర్వాత అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. దీంతో ‘స్వయం’ కోర్సుల్లో కనీసం 40 శాతమైనా అందించాలని తాజాగా పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందుకోగలుగుతారని భావిస్తోంది. రెగ్యులర్ కోర్సులు చేస్తూనే డ్యూయెల్ డిగ్రీ కింద స్వయం కోర్సులకు అవకాశం కల్పించింది. ఈ కోర్సులకు యూజీసీ క్రెడిట్ ఫ్రేమ్వర్కును కూడా ఏర్పాటుచేసింది. ఈ కోర్సులు అభ్యసించే వారికి క్రెడిట్ల కేటాయింపుతో పాటు వాటిని వేర్వేరు కోర్సులు అభ్యసించే సంస్థలకు బదలాయించుకొనే వెసులుబాటు కూడా కల్పించింది. పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే క్రెడిట్ బదిలీ కోసం ‘స్వయం’ కోర్సులను ఆమోదించాయని, మిగిలిన వర్సిటీలు కూడా చర్యలు తీసుకోవాలని యూజీసీ తాజాగా పేర్కొంది. ముందుగా వర్సిటీలు అకడమిక్ కౌన్సిళ్ల నుంచి ఆమోదం పొందాలని పేర్కొంది. క్రెడిట్ల కేటాయింపు, బదిలీని ఆయా విభాగాల హెడ్లు, డీన్లు ఆమోదించాలని తెలిపింది. ఈ ఆన్లైన్ కోర్సుల విధానంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఇలా డిజిటల్, ఆన్లైన్ బోధన వల్ల ప్రమాణాలు మెరుగుపడవని అభిప్రాయపడుతున్నారు. పైగా ఆన్లైన్ కోర్సుల్లో పర్యవేక్షణ కొరవడుతుందని, విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇలా ఆన్లైన్ బోధన వైపు వెళ్లడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. -
అడ్మిషన్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు ఇచ్చేయాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కోవిడ్ కారణంగా తమ అడ్మిషన్లను రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజులను వాపసు ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఆదేశించింది. కోవిడ్, లాక్డౌన్ కారణంగా ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు దెబ్బతిని పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై ఉన్నందున క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేయకుండా వెనక్కిచ్చేయాలని కొత్త అకడమిక్ షెడ్యూల్తో విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచించింది. అక్టోబర్ 31లోగా అడ్మిషన్లు రద్దు చేసుకున్న వారు, లేదా మైగ్రేషన్పై వేరే సంస్థల్లోకి చేరే వారి నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఫీజులను తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 31 లోపు అడ్మిషన్లు రద్దు చేసుకునే వారి నుంచి రూ.1000 వరకు క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేయాలని, అంతకు మించి వసూలు చేయరాదని పేర్కొంది. ఆఫ్లైన్లో పరీక్షల నిర్వహణ 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు టర్మినల్ సెమిస్టర్ పరీక్షలను పెన్ అండ్ పేపర్ ఆధారితంగా (ఆఫ్లైన్లో), లేదా ఆన్లైన్, బ్లెండెడ్ (ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్) విధానాల్లో ఆగస్టు 31లోగా నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. ఇంటర్ ఫలితాలు విడుదల ఆలస్యమైనందున 2021–22 విద్యాసంవత్సరానికి విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను యూజీసీ అక్టోబర్ 1 నుం చి ప్రారంభించాలని కొత్త షెడ్యూల్లో పేర్కొం ది. ఈ విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ ప్రిపరేటరీ బ్రేక్, పరీక్షల నిర్వహణ అంశాలను విద్యాసంస్థలు నిర్ణయించుకోవాలని వివరించింది. -
ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే: సుప్రీం
-
ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఫైనలియర్ పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్ చేయవద్దని కోర్టు సూచించింది. సెప్టెంబర్ 30న యథాతథంగా యూజీసీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. యూజీసీ గైడ్లైన్స్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఫైనలియర్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా ఆదిత్య ఠాక్రేకు చెందిన యువసేనతో సహ పలు సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూసి వేశారని.. ఇలాంటి పరిస్థితులోల పరీక్షలు పెడితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పిటిషన్దారులు కోర్టుకు తెలిపారు. (చదవండి: నీట్, జేఈఈల వాయిదా ఉండదు!) దీన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్దారులు కోర్టును కోరారు. ఇప్పటికే విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని.. వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలన్నారు. ఈ పిటిషన్లను నేడు విచారించిన సుప్రీం కోర్టు యూజీసీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడాన్ని ప్రోత్సాహించదని కోర్టు రాష్ట్రాలను కోరింది. -
యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశాలు
ఎస్కేయూ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా పీహెచ్డీ ప్రవేశాలను నిర్వహించాలని ఎస్కేయూ వీసీ ఆచార్య కే. రాజగోపాల్ అన్నారు. వర్సిటీలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇండిస్ట్రియల్, ఎక్జిక్యూటివ్ కోటాలో ఉన్న పీహెచ్డీ సీట్లు తాజా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కేటాయించాలని వీసీ ఆదేశించారు. ఎంబీఏ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ కోర్సుల్లో ఇండిస్ట్రియల్ కోటాలో సీట్లు ఉన్నాయి. రెక్టార్ జి.శ్రీధర్ , రిజిస్ట్రార్ వెంకటరమణ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చింతా సుధాకర్, ప్రిన్సిపాల్ సీఎన్ కృష్ణానాయక్, డీన్స్, డైరెక్టర్లు పాల్గొన్నారు.