
సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఏకకాలంలో రెండు కోర్సులు అభ్యసించేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలు జారీచేసింది. పీహెచ్‌డీ మినహా మిగిలిన కోర్సులకు నిబంధనలను అనుసరించి వీటిని విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అన్ని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఈమేరకు చర్యలు చేపట్టాలని తాజాగా ఆదేశించింది.
చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు
ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020 విధానాల్లో పూర్తిగా మార్పులు చేయాలని సూచించింది. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలో నచ్చిన కోర్సులను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని, ఆన్‌లైన్ విద్య కార్యక్రమాలను సిద్ధం చేయాలని ఆయా విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది.
ఇవీ మార్గదర్శకాలు
♦ఒక విద్యార్థి ఫిజికల్ మోడ్‌లో రెండు విద్యా కార్యక్రమాలను పూర్తి సమయం కొనసాగించవచ్చు. తరగతి సమయాలు భిన్నంగా ఉండేలా చూడాలి.
♦విద్యార్థి రెండు విద్యా కార్యక్రమాలను ఒకేసారి కొనసాగించవచ్చు, ఒకటి పూర్తి సమయం భౌతికంగా మరొకటి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్)/ఆన్‌లైన్ మోడ్‌లో చేయవచ్చు. లేదా రెండూ ఓడీఎల్/ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో ఏకకాలంలో అభ్యసించవచ్చు.
♦ఓడీఎల్/ఆన్‌లైన్ మోడ్ కింద డిగ్రీ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లు యూజీసీ/చట్టబద్ధ సంస్థలు, ప్రభుత్వాలు గుర్తించిన కార్యక్రమాలకే పరిమితం కావాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థలే వీటిని చేపట్టాలి.
♦యూజీసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రెండు డిగ్రీలు చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా ఉంటే యూజీసీ నిబంధనలను అనుసరించి అనుమతి పొందాలి.
నూతన విధానం లక్ష్యాలు
♦విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించేందుకు అనుమతించాలి.
♦సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్స్ సహా ఇతర విభాగాల్లో అవకాశం కల్పించాలి.
♦భాష, ప్రొఫెషనల్, టెక్నికల్, వొకేషనల్ విషయాలను కూడా అందుబాటులోకి తేవాలి.
♦నచ్చిన అంశాలను నేర్చుకోవడంతోపాటు ఆసక్తి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలలో క్షుణ్నంగా అధ్యయనానికి వీలు కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment