సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో పాలన గాడితప్పుతోంది. విధానపరౖ నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండళ్లు (ఈసీ) లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ఉద్యోగులు, అధ్యాపకుల నియామకాలు, పదోన్నతులు, వేతనాల పెంపు, అభివృద్ధి పనులు.. ఇలా అన్నింటికీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల అనుమతి తప్పనిసరి కావడం, ఏళ్ల తరబడి ఈసీల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో వర్సిటీల పాలన దెబ్బతింటోంది. కొన్ని వర్సిటీలకు పదేళ్లుగా ఈసీలు లేకున్నా పట్టించున్న పరిస్థితి లేదు. వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నా.. ఈసీలు లేక అన్నింటికీ ఐఏఎస్ అధికారుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి నెలకొంది.
శాతవాహన, కేయూకు 2009 నుంచే..
రాష్ట్రంలోని శాతవాహన, కాకతీయ వర్సిటీలకు 2009 నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. అంతకుముందు నియమించిన ఈసీల పదవీకాలంలో ముగియడం, తరువాత ఈసీలను నియమించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ వర్సిటీ ఈసీని 2011లో రద్దు చేశాక మళ్లీ నియమించలేదు. మిగతా వర్సిటీలదీ ఇదే పరిస్థితి. 2011లో ఉస్మానియా, జేఎన్‌టీయూకే ఈసీలను నియమించినా వాటి పదవీకాలం 2014తో ముగిసింది. ఆ తరువాత రాష్ట్రంలోని ఏ వర్సిటీకీ ఈసీలను నియమించలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా వాటిపై ప్రభుత్వం దృష్టి సారించలేదు.
10 లక్షలకు మించి ఖర్చు చేయాలంటే..
వర్సిటీల్లో అభివృద్ధి పనులను చేపట్టడంలో ఈసీ నిర్ణయమే కీలకం. రూ.10 లక్షలకు మించిన వ్యయంతో ఏ పని చేయాలన్నా, ఎలాంటి కొనుగోళ్లు చేపట్టాలన్నా ఈసీ ఆమోదం ఉండాలి. 12–13 మంది ఉండే పూర్తి స్థాయి ఈసీ లేకున్నా ఐదుగురు సభ్యులు (కోరం) ఉన్న ఈసీ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం అది కూడా లేకపోవడంతో వర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.
ఏ నిర్ణయమైనా పరుగెత్తాల్సిందే
పాలక మండళ్లు లేకపోవడంతో వర్సిటీలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్స్ అఫిషియో సభ్యులైన ఐఏఎస్ అధికారుల వద్దకు వీసీలు పరుగెత్తాల్సి వస్తోంది. రూ.10 లక్షలలోపు పనికైనా రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు ఈసీలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను వర్సిటీలు రాబట్టుకోలేకపోతున్నా యి. ఎక్స్ ఆఫిషియో సభ్యులు వర్సిటీల బాగోగులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అధిక మొత్తంలో నిధులు కావాలని అడిగే పరిస్థితి లేదు.
వర్సిటీ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో ఈసీలు లేకుండా చేపట్టిన నియామకాలు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. 2010లో కాకతీయ వర్సిటీ జంతు శాస్త్ర విభాగంలో ఇద్దరు అధ్యాపకుల నియామకాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయి పాలక మండలి లేకుండా నియామకాలు ఎలా చేపడతారంటూ కోర్టుకెక్కారు. నియామకాలు చెల్లవని కోర్టు తీర్పునిచ్చింది. వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా పోస్టింగ్ పొందారు. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలోనూ నలుగురు అధ్యాపకుల నియామకాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వర్సిటీలోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వర్సిటీల్లోని 1,061 పోస్టుల భర్తీ ఈసీ నియామకాలతో ముడిపడి ఉండటంతో ముందుకు సాగడం లేదు.
పత్తాలేని పాలక మండళ్లు
Published Tue, May 1 2018 1:21 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment