Career In Sports : Best Sports Related Courses, Scope And Jobs - Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ రంగంలో రాణించాలనుకుంటున్నారా? సమాచారం ఇదుగో..

Published Mon, Aug 2 2021 12:28 PM | Last Updated on Mon, Aug 2 2021 4:41 PM

Build Your Career in Sports, Courses Scope And Jobs - Sakshi

ప్రపంచ క్రీడా వేదిక టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు చక్కటి ప్రతిభ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు అంశాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు. అయినప్పటికీ నేటికీ చాలామంది తల్లిదండ్రులు ఆటలతో కెరీర్‌ కష్టమనుకుంటారు. అందుకే పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి కోర్సుల వైపు పోత్సహించినట్టుగా.. క్రీడల వైపు ప్రోత్సహించడం లేదు. వాస్తవానికి ప్రతిభ ఉంటే.. స్పోర్ట్స్‌ రంగంలోనూ అద్భుతమైన కెరీర్‌ సొంతం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో స్పోర్ట్స్‌ కోర్సులను అందించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ(ఇంపాల్‌)’ని∙ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరెన్నో పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూట్స్, స్పోర్ట్స్‌ కాలేజీలు పలు కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో స్పోర్ట్స్‌ కోర్సులు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం... 

మన యువత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ.. క్రీడలను కూడా కెరీర్‌గా మలచుకోవచ్చని నిరూపిస్తోంది. పలువురు స్పోర్ట్స్‌తో పేరు ప్రఖ్యాతులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకుంటున్నారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. క్రికెట్‌ ఒక్కటే కాదు.. హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్‌ టెన్నిస్, రెజ్లింగ్, సైక్లింగ్, చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ వంటి క్రీడలపైనా ఆసక్తి ఎక్కువే. ఆయా క్రీడాకారులకు అంతర్జాతీయంగా అద్భుతమైన గుర్తింపు లభిస్తోంది. సచిన్‌ టెండూల్కర్, ఎంఎస్‌ ధోని, కోహ్లీ, సానియా మీర్జా, పీవీ సింధు, అభినవ్‌ బింద్రా, సుశీల్‌ కుమార్, విశ్వనాథ్‌ ఆనంద్, మేరీకోమ్‌ వంటి వారే అందుకు నిదర్శనం. 

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు
క్రీడాకారుడిగా రాణించాలంటే.. ఎంచుకున్న క్రీడలో ప్రతిభతోపాటు బలమైన సంకల్పం, పట్టుదల చాలా అవసరం.

ఒక వయసు దాటాక స్పోర్ట్స్‌ కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. క్రీడాకారుడిగా కెరీర్‌ ముగిసిన తర్వాత కూడా అద్భుతమై రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోచింగ్, అథ్లెటిక్‌ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్‌ మెడిసిన్, స్పోర్ట్స్‌ ప్రమోషన్, స్పోర్ట్స్‌ సెకాలజీ, స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌ వంటి అనుబంధ రంగాల్లో ప్రవేశించవచ్చు. 
స్పోర్ట్స్‌ ప్లేయర్, స్పోర్ట్స్‌ టీచర్, స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్, స్పోర్ట్స్‌ జర్నలిస్ట్, స్పోర్ట్స్‌ కోచ్‌ అండ్‌ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్‌ వ్యాఖ్యాత, స్పోర్ట్స్‌ ఫొటోగ్రాఫర్, పర్సనల్‌ ట్రైనర్, ప్రొఫెషనల్‌ అథ్లెట్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, హెల్త్‌ అడ్వైజ్‌ ఆఫీసర్‌ వంటి విభాగాల్లో రాణించవచ్చు. 
స్కూల్‌ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపినవారికి ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ ఆధ్వర్యంలోని వివిధ స్పోర్ట్స్‌ సంస్థలు, అకాడమీలు శిక్షణనిస్తున్నాయి. చురుకైన యువతకు చక్కటి శిక్షణ ఇచ్చి.. ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. 

డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకూ
క్రీడలకు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు పలు స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా » బీఎస్సీ–స్పోర్ట్స్‌ కోచింగ్‌ » బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌(బీపీఈఎస్‌) » ఎంఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌(రెండేళ్లు) » ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజీ(రెండేళ్లు) » ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్‌ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్‌ సైకోథెరఫీ, ఎంఎస్సీ/ఎంఫీల్‌/పీహెచ్‌డీ స్పోర్ట్స్‌ సైకాలజీ తదితర కోర్సుల్లో చేరే అవకాశముంది. 

ప్రవేశం–అర్హతలు
స్పోర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి పలు అర్హతలు నిర్దేశించారు. ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి, సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సుల్లో చేరవచ్చు. యూజీ కోర్సులు పూర్తిచేసినవారు పీజీ కోర్సులకు వెళ్లవచ్చు. ఎంబీబీఎస్‌ తర్వాత స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా చేయవచ్చు. అభ్యర్థుల అకడెమిక్‌ మెరిట్‌ ,టెస్టులు, క్రీడా ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. 

పలు స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లు
నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (ఇంపాల్‌);
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(పటియాలా); 
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ (న్యూఢిల్లీ);
లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (గ్వాలియర్‌);
లక్ష్మీబాయి నేషనల్‌ కాలేజ్‌ ఫర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (తిరువనంతపురం);
టాటా ఫుట్‌బాల్‌ అకాడమీ (జంషెడ్‌పూర్‌);
 నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు);
 ఢిల్లీ యూనివర్సిటీ.

నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ
మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్రంలోని యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ యూజీ/పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది. 

► బీఎస్సీ–స్పోర్ట్స్‌ కోచింగ్‌: నాలుగేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ కోర్సులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్‌ లిఫ్టింగ్‌ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్నెట్‌ బేస్డ్‌ ప్రోక్టర్డ్‌ టెస్ట్‌కు 50 శాతం, అభ్యర్థి క్రీడా ప్రతిభకు మరో 50 శాతం మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 
► బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌(బీపీఈఎస్‌): బీపీఈఎస్‌ కోర్సు కాలపరిమితి మూడేళ్లు. ఇంటర్మీడియెట్‌(10+2)లేదా తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్నెట్‌ బేస్డ్‌ ప్రోక్టర్డ్‌ టెస్ట్‌లో 70 శాతం, క్రీడల్లో చూపిన ప్రతిభకు 30 శాతం వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 

► ఎంఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌(రెండేళ్లు): బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌/గ్రాడ్యుయేషన్‌ విత్‌ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, బీపీఈఎస్‌ విత్‌ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌/ బీపీఈడీ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్‌ బేస్డ్‌ ప్రోక్టర్డ్‌ టెస్ట్‌కు 100 మార్కులు, క్రీడా ప్రతిభకు 30 మార్కులు, వైవాకు 20 మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 
► ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజీ(రెండేళ్లు): ఈ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి బీపీఈఎస్‌/ బీపీఈడీ/బీఏ(హానర్స్‌), బీఏ సైకాలజీ/స్పోర్ట్స్‌ సైకాలజీలో 50 మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్‌ బేస్డ్‌ ప్రోక్టర్డ్‌ టెస్ట్‌కు 100 మార్కులు,  వైవాకు 30 మార్కులు, క్రీడా ప్రతిభకు 20 మార్కుల వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 

ముఖ్య సమాచారం
► ఎన్‌ఎస్‌యూ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఆగస్టు 2021
► ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌: 10 సెప్టెంబర్‌ 2021
► ఫిజికల్‌ ఫిట్‌నెస్, గేమ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌: సెప్టెంబర్‌ 22–24
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nsu.ac.in

స్సోర్ట్స్‌ సైకాలజీకి క్రేజ్‌
క్రీడాకారుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్పోర్ట్స్‌ సైకాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో సుశిక్షుతులైన స్పోర్ట్స్‌ సైకాలజిస్టులు కొరత నెలకొంది. దాంతో మన దేశ క్రీడా సంఘాలు అమెరికా,ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్‌ సైకాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంఏ,ఎంఎస్సీ సైకాలజీ కోర్సులు అందిస్తున్నా.. స్పోర్ట్స్‌ సైకాలజీ కోర్సు మాత్రం చాలా తక్కువ యూనివర్సిటీల్లో ఉంది.వాటిలో చెప్పుకోదగ్గవి.. 
►గురునానక్‌దేవ్‌ యూనివర్సిటీ(అమృత్‌సర్‌): ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్‌ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్‌ సైకోథెరఫీ. 
►తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ(చెన్నై): ఎంఎస్సీ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ స్పోర్ట్స్‌ సైకాలజీ.
► రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ: 
 ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్‌ సైకాలజీ. 
►లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(గ్వాలియర్‌):ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజీ.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement