‘కెరీర్ టూల్ కిట్’ను ఆవిష్కరిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో అంతర్జాతీయ యూనివర్సిటీల కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై సమగ్ర అవగాహన కల్పించేలా ఉన్నత విద్యామండలి రూపొందించిన ‘కెరీర్ టూల్ కిట్’ ఆన్‌లైన్ టీచింగ్ ప్రోగ్రామ్‌ను ఆయన మంగళవారం విజయవాడలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 (సబ్జెక్టుల వారీగా) విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోలేని ఎందరో విద్యార్థులు ఎంఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే సుమారు 2 వేల కోర్సులను ఆన్‌లైన్‌లో చదువుకునే వెసులుబాటు కల్పింస్తున్నట్టు పేర్కొన్నారు.
దేశంలోనే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చదువులు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం కంటే ముందుగానే ఏపీ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశామన్నారు. తాజాగా తొలిసారిగా స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను ఇచ్చేలా అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.
ఉన్నత విద్యామండలి 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు మేలు చేస్తూ ప్రతి సెమిస్టర్‌లో విభిన్న అంశాల్లో మార్గనిర్దేశం చేసేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకురావడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందన్నారు. వాటి ఫలితాలే ఇండియా స్కిల్ రిపోర్టులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాయన్నారు.
సెమిస్టర్ల వారీగా కెరీర్ గైడెన్స్
ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక అందించడం, ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ పెంపుపై ‘కెరీర్ టూల్‌కిట్’ మెంటార్‌గా నిలుస్తుందన్నారు. విద్యా ప్రయాణంలో ప్రతి దశలో విద్యార్థులకు వ్యక్తిగత మార్గదర్శకంగా పని చేసేలా 19 రకాల కెరీర్ టూల్ కిట్లను రూపొందించామని తెలిపారు.
దేశంలో ఏ యూనివర్సిటీ, విద్యామండలి చేయని విధంగా విద్యార్థి కోర్సులో చేరినప్పటి నుంచి పూర్తి చేసి బయటకు వెళ్లేంత వరకు జాబ్, రీసెర్చ్ ఓరియంటేషన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక దృక్పథాన్ని పెంపొందించేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకొచ్చామన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్‌పర్సన్లు రామ్మోహనరావు, ఉమా మహేశ్వరిదేవి, సెక్రటరీ నజీర్ అహ్మద్, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ సు«దీర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment