కోల్‌కత్తా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నట్లు ప్రకటించారు. 62 ఏళ్లుగా ఉన్న అధ్యాపక ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారు. అదే విధంగా యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ (వీ.సీ) విరమణ వయస్సును కూడా 70 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం కోల్‌కత్తా వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో మమత ప్రకటించారు.
కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ... ‘‘ 60 ఏళ్లు దాటిన తరువాత ఓ ఉద్యోగి పనిచేయలేడని నేను అనుకోను. వారి అనుభవాలు, సేవలు మన విద్యార్థులకు చాలా అవసరం. అందుకే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నాం. బలహీన వర్గాల ఉన్నత విద్య కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం రూ. 28000 కోట్లను ఈ ఏడాదికి ఖర్చు చేయదలచాం’ అని తెలిపారు. కాగా ఉన్నత విద్యపై మమతా బెనర్జీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే నదియా జిల్లాలో కన్యశ్రీ విశ్వవిద్యాలయంకు జనవరి 10న శంకస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment