విశ్వవిద్యాలయాలు విశ్వ విద్యా వికాస కేంద్రాలు. విద్య వికాసానికి, ఆ వికాసంతో విశ్వ మానవాళి జీవితాలను కొత్త పుంతలు తొక్కించగలిగిన ఆవిష్కరణలు చేయడానికి అవి వేదికలని తెలిసిన సంగతే. అటువంటి యూనివర్సిటీలు ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతున్నాయి. తెలంగాణ ఉద్య మంలో ప్రజానీకాన్ని చైతన్యపరిచి, ఉద్యమ బాటలో నడిపిన యూనివర్సిటీ కేంద్రాలు ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతున్నాయి. కేవలం యూనివర్సిటీ సర్వీసులో ఉన్న కొద్దిమంది సీనియర్ అధ్యాపకులే యూనివర్సిటీల మనుగడకు ఊపిరిలూదుతున్నారు. కొత్త నియామకాలు ఎండమా వులుగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు యూనివర్సి టీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసారని గొంత్తెత్తిన నాయకుడే నేడు రాష్ట్రాన్ని పాలిస్తూ.. వాటిని మరింత నిర్లక్ష్యం చేస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయపరిస్థితిలో విద్యార్థిలోకం ఉంది.
యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించకుండా, అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయకుండా, మౌలిక వసతుల కల్పనకు ఏ మాత్రం కృషి చేయ కుండా గాలికొదిలేసిన ప్రభుత్వం.. మరోవైపు యూని వర్సిటీలు ఫీజులు పెంచుకోవడానికి అనుమతించి, యూనివర్సిటీలను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర చేస్తున్నది. ప్రభుత్వ అనుమతిని సాకుగా చూపి యూనివర్సిటీలు పేద విద్యార్థులకు చెల్లింపు సాధ్యం కాని విధంగా ఫీజులను పెంచేశారు. అధ్యాపకులను నియమించి విద్యాప్రమాణాలను పెంచాల్సిన కొత్త వైస్ ఛాన్స్‌లర్లు ఫీజుల పెంపుపైనే దృష్టిపెట్టడం కనిపి స్తుంది.
ఉస్మానియా, జెఎన్‌టియుహెచ్, కాకతీయ, మహాత్మగాంధీ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్, పార్మసీ, పీజీ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు భారీగా నిర్ణయించడం అధికారుల బాధ్యతారాహి త్యమే. వందేళ్ల ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంఏ(ఆర్ట్స్, సోషల్ సైన్సెస్) రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ. 2,260 నుంచి రూ. 14,000 వరకు; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ. 5170 నుంచి రూ. 21,000లకు పెంచారు. ఎంకామ్‌కి రూ. 30,000, ఎంబీఏ రూ. 35,000, ఎమ్మెస్సీ సైన్స్ కోర్సులకు రూ. 2,260 నుంచి రూ.20,490; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకి రూ. 35,000 పెంచారు.
ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులనయితే భారీగా పెంచారు. రూ.18,000 నుంచి రూ. 35,000 వరకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ. 75,000 వరకు పెంచారు, ఈ ఏడాది ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – మిషన్ లెర్నింగ్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా పేర్కొని ఫీజు లక్ష ఇరవై వేల రూపాయలుగా నిర్ణయించారు. అలాగే మైనింగ్ ఇంజ నీరింగ్ కోర్సు ఫీజు రూ. 1,00,000. దీన్ని గమనిస్తే పేద విద్యార్థులను యూనివర్సిటీ విద్యకు దూరం చేసే కుట్ర బహిర్గతమవుతుంది. ఈ ఫీజుల పెంపుదలను నిరసిస్తూ.. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనకు దిగితే పోలీసులతో పాశవిక దాడులు చేయించి కేసులు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికే యూని వర్సిటీ అధికారులు సతమతమౌతున్న తీరు గమనిస్తే యూనివర్సిటీల దయనీయ ఆర్థిక పరిస్థితి అవగత మౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన పరిమా ణంలోనే యూనివర్సిటీలకు బడ్జెట్‌ని కేటాయించడం చూస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా యూనివర్సిటీలకు జరిగిన మేలేమీ లేదని అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీగా ఉన్న ఉస్మానియా నేడు పాల కుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కలిపి 2,220 ఖాళీలు ఉన్నాయి.
రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యనభ్యసించడానికి ఉపకరిస్తున్న ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుంది. గత రెండేళ్లుగా రూ. 3,816 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి యూని వర్సిటీలను అద్భుత విజ్ఞాన కే్రందాలుగా విలసిల్లేలా చూడటం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత.
ప్రవీణ్ రెడ్డి
వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శి, ఏబీవీపీ, తెలంగాణ
మొబైల్ : 90104 05476
Comments
Please login to add a commentAdd a comment