దక్షిణ భారత దేశ ఉపకులపతుల సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు బోధనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, పరిశోధనలకు దూరంగా ఉండటం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ ఉపకులపతుల సదస్సు–2023ని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో గవర్నర్ మంగళవారం ప్రారంభించారు.
రెండురోజుల సదస్సులో తొలిరోజు ‘రీసెర్చ్ అండ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేటివ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై గవర్నర్ ప్రసంగించారు. ఉన్నతవిద్యలో పరిశోధనల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాల్ని చేసుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీలు బోధనకే పరిమితం కాకూడదని సూచించారు. పరిశోధన రంగంవైపు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని, ఇందుకనుగుణంగా రీసెర్చ్ రంగంలో పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లలో అత్యుత్తమ స్థానంలో భారతీయ విశ్వవిద్యాలయాలు స్థానం సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశంగా భారత్ ఉందని నాస్కామ్ స్పష్టం చేసిందని, 2022 నాటికి దేశంలో 80 వేలకు పైగా స్టార్టప్ సంస్థలున్నాయని తెలిపారు. కోవిడ్ సమయంలో అమెరికా, చైనా, యూకే సహా 50 దేశాలకు మనదేశం మార్గదర్శిగా నిలవడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
నూతన విద్యావిధానంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. ఏయూ వీసీ ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షల్ని సాకారం చేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తెలిపారు.
ఏఐయూ అధ్యక్షుడు ఆచార్య సురంజన్ దాస్ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానాన్ని పరిరక్షించడంతో పాటు పరిశోధనలకు అనుగుణంగా ఉన్నతవిద్యని ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యని పటిష్టం చేసేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి ఐదు లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో తొలుత ఏఐయూ ప్రత్యేక సంచికని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రావు, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్, 140 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment