![Governor Biswabhusan Attended IIPE Celebrations In Andhra University Visakapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/20/avanthi-srinivas_1.jpg.webp?itok=GN1HXG9U)
సాక్షి, విశాఖపట్నం : ఇండియన్ ఇన్‌సిట్యూట్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) నాలుగో ఆవిర్బావ దినోత్సవ వేడుకలను విశాఖలోని ఆంధ్ర యునివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి అవంతి శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. దేశాభివృద్దిలో యువత పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. విద్యార్థి దశ దాటిన తర్వాత యువత ఎక్కడున్నా మాతృ దేశాన్ని మరిచిపోవద్దని కోరారు. విశాఖలో ఐఐపిఇ ని అభివృద్ది చేయడంలో డైరక్టర్ ప్రసాద్ కృషి అభినందనీయమన్నారు.
దేశంలోని పెట్రోలియం కంపెనీలతో టై అప్ అవ్వడం ద్వారా యూనివర్సిటీ సరికొత్త పరిశోధనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలోనే కెజి బేసిన్ ఉండటం వల్ల ఈ యూనివర్సిటీ లో విద్య పూర్తి చేసిన విధ్యార్ధులకు పూర్తి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ యూనివర్సిటిలో చేరిన మొదటి బ్యాచ్ కి అభినందనలు తెలియజేస్తూ... విశాఖలోని పెట్రోలియం యూనివర్సిటీ దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా ఎదగాలని ఆకాక్షించారు. విశాఖతో పాటు దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
విద్య, విద్యార్థులన్నా తనకు ఎంతో ఇష్టం : మంత్రి అవంతి
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐఐపిఇ నాలుగవ ఆవిర్బావ కార్యక్రమంలో పాల్గోవడం ఆనందంగా ఉందన్నారు. కాకినాడలో ఐఐపిఇని స్దాపించాలని చంద్రబాబు ప్రయత్నించినా, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాల దృష్ట్యా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ పెట్రో యూనివర్సిటీకి భూములు కేటాయింపులలో ఇబ్బంధులు తలెత్తకుండా ప్రయత్నాలు చేశానని తెలిపారు.
రాజకీయాలలోకి రాకముందే తాను విద్యాసంస్ధలు స్ధాపించానని, విద్య, విధ్యార్ధులన్నా తనకు ఎంతో ఇష్టమన్నారు. విద్యార్ధులు తమకున్న నైపుణ్యంతో వినూత్నంగా ఆలోచించడంతో పాటు భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని మంత్రి అవంతి పిలుపునిచ్చారు.రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి పధకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. రాబోయే నాలుగైదు ఏళ్లలో అక్షరాస్యతలో కేరళను దాటగలమనే నమ్మకముందన్నారు. అనంతరం వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు గవర్నర్, మంత్రి చేతుల మీదగా సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, కలెక్టర్ వినయ్ చంద్ , పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, డైరక్టర్ చంద్రశేఖర్ , ప్రొఫెసర్ విఎస్ ఆర్ కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment