సాక్షి, విశాఖపట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆవిష్కరించింది.
ఏయూ బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పూసర్ల అపరంజి పూర్తి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరం పెన్‌డ్రైవ్ తరహాలో సుమారు 5 సెం.మీ. పరిమాణంలో ఉంటుంది. దీనికి వినియోగించే స్ట్రిప్ ఒక సెం.మీ. మాత్రమే ఉంటుంది. సాధారణంగా షుగర్ స్ట్రిప్స్‌ను ఒకసారి వాడి పడేయాలి. కానీ, ఈ లేబుల్ ఫ్రీ స్ట్రిప్‌ను బయో ఫ్యాబ్రికేషన్‌తో తయారు చేయడం వల్ల ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు.
ఈ బయోసెన్సార్ పరికరంలో ఒక చుక్క బ్లడ్ వేస్తే.. సెకను వ్యవధిలోనే కచ్చితమైన మధుమేహం వివరాలు వచ్చేస్తాయి. ఈ డివైజ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే షుగర్ లెవల్స్ వివరాలు డిస్‌ప్లే అవుతాయి. మరోవైపు ఈ డివైజ్ ద్వారా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా కోవిడ్, క్యాన్సర్, బీపీ, ఫ్యాట్, థైరాయిడ్ తదితర వ్యాధులకు పరీక్షలు చేసేలా, గాలిలో కాలుష్యాన్ని కనుగొనేలా అభివృద్ధి చేయాలని ఏయూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యాంటీజన్ యాంటీబాడీ ఇమ్మొబలైజేషన్ మెథడ్ ద్వారా చిప్స్ తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ పరీక్షలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు బార్క్, కోవిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన స్ట్రిప్స్ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఏయూతో చర్చలు జరుపుతున్నాయి.
ఏయూ చరిత్రలో తొలి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్
ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక పరిశోధన పేటెంట్ పొంది, సాంకేతికత బదలాయింపు జరిగిన తొలి పరికరం ఇదే కావడం విశేషం. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖకు చెందిన అక్షయ ఇన్నోటెక్ సంస్థ ఇటీవల ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సాంకేతికతను బదలాయింపు చేసుకుని త్వరలోనే ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో..
కోవిడ్ సమయంలో ప్రతి పరీక్షకు ఎక్కువ ఖర్చు చేసేవారు. అందువల్ల పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరం తయారు చేయాలన్న ఆలోచన మొదలైంది. వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సహకారంతో ఏయూ ల్యాబ్‌లోనే పరిశోధనలు ప్రారంభించి సఫలీకృతులయ్యాం. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో అన్ని పరీక్షలను ఈ పరికరం ద్వారా తెలుసుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం ఒక డివైజ్ మల్టీపుల్ స్ట్రిప్స్ వాడుతున్నాం. భవిష్యత్తులో ఒక పరికరం.. ఒకే చిప్ అనే విధంగా పరిశోధనలు చేస్తున్నాం.
– డాక్టర్ అపరంజి, ఏయూ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment