Sugar Test
-
నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..!
శరీరంలోని చక్కెర స్థాయి తెలుసుకోవాలంటే, నెత్తురు చిందించక తప్పదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానం మేరకు చక్కెర స్థాయి తెలుసుకోవడానికి కనీసం ఒక్క చుక్క నెత్తురైనా అవసరం. ఇంట్లో గ్లూకో మీటర్ ద్వారా చక్కెర స్థాయి తెలుసుకోవాలన్నా, సూదితో వేలిని పొడిచి నెత్తురు చిందించక తప్పదు. అయితే, అమెరికన్ కంపెనీ ‘నో లాబ్స్’ రూపొందించిన ఈ పరికరం ఉంటే, ఒక్క చుక్కయినా నెత్తురు చిందించకుండానే శరీరంలోని చక్కెర స్థాయిని వెంటనే తెలుసుకోవచ్చు. ‘నో యూ’ పేరుతో రూపొందించిన ఈ పరికరాన్ని జిగురు ఉన్న స్టిక్కర్ ద్వారా లేదా, బిగుతుగా పట్టే రబ్బర్ స్ట్రాప్ ద్వారా జబ్బకు, లేదా ముంజేతికి కట్టుకుంటే చాలు. క్షణాల్లోనే శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో, యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. ఈ పరికరం పనితీరును ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ‘ఎఫ్‌డీఏ’ పరీక్షిస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లయితే, ఈ పరికరం అందరికీ అందుబాటులోకి వస్తుంది. (చదవండి: ఆ జత జాడీలతో ఓ కుటుంబం రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!) -
షుగర్ టెస్టు కోసం ఆంధ్రా వర్సిటీ అద్భుత ఆవిష్కరణ.. డివైస్ స్పెషల్ ఇదే!
సాక్షి, విశాఖపట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆవిష్కరించింది. ఏయూ బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పూసర్ల అపరంజి పూర్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరం పెన్‌డ్రైవ్ తరహాలో సుమారు 5 సెం.మీ. పరిమాణంలో ఉంటుంది. దీనికి వినియోగించే స్ట్రిప్ ఒక సెం.మీ. మాత్రమే ఉంటుంది. సాధారణంగా షుగర్ స్ట్రిప్స్‌ను ఒకసారి వాడి పడేయాలి. కానీ, ఈ లేబుల్ ఫ్రీ స్ట్రిప్‌ను బయో ఫ్యాబ్రికేషన్‌తో తయారు చేయడం వల్ల ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు. ఈ బయోసెన్సార్ పరికరంలో ఒక చుక్క బ్లడ్ వేస్తే.. సెకను వ్యవధిలోనే కచ్చితమైన మధుమేహం వివరాలు వచ్చేస్తాయి. ఈ డివైజ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే షుగర్ లెవల్స్ వివరాలు డిస్ప్లే అవుతాయి. మరోవైపు ఈ డివైజ్ ద్వారా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా కోవిడ్, క్యాన్సర్, బీపీ, ఫ్యాట్, థైరాయిడ్ తదితర వ్యాధులకు పరీక్షలు చేసేలా, గాలిలో కాలుష్యాన్ని కనుగొనేలా అభివృద్ధి చేయాలని ఏయూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యాంటీజన్ యాంటీబాడీ ఇమ్మొబలైజేషన్ మెథడ్ ద్వారా చిప్స్ తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ పరీక్షలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు బార్క్, కోవిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన స్ట్రిప్స్ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఏయూతో చర్చలు జరుపుతున్నాయి. ఏయూ చరిత్రలో తొలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక పరిశోధన పేటెంట్ పొంది, సాంకేతికత బదలాయింపు జరిగిన తొలి పరికరం ఇదే కావడం విశేషం. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖకు చెందిన అక్షయ ఇన్నోటెక్ సంస్థ ఇటీవల ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సాంకేతికతను బదలాయింపు చేసుకుని త్వరలోనే ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో.. కోవిడ్ సమయంలో ప్రతి పరీక్షకు ఎక్కువ ఖర్చు చేసేవారు. అందువల్ల పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరం తయారు చేయాలన్న ఆలోచన మొదలైంది. వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సహకారంతో ఏయూ ల్యాబ్‌లోనే పరిశోధనలు ప్రారంభించి సఫలీకృతులయ్యాం. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో అన్ని పరీక్షలను ఈ పరికరం ద్వారా తెలుసుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం ఒక డివైజ్ మల్టీపుల్ స్ట్రిప్స్ వాడుతున్నాం. భవిష్యత్తులో ఒక పరికరం.. ఒకే చిప్ అనే విధంగా పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ అపరంజి, ఏయూ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ -
2 నెలల్లో అందరికీ బీపీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ పరీక్షలు చేస్తామని, ఇందుకు రూ.33కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకొని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ)సహకారంతో, గ్లీనీగిల్స్ గ్లోబల్ ఆసుపత్రులు 9000 మందిపై చేసిన సర్వే ఫలితాలను హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... సీఎస్ఐ సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయన్నారు. కోవిడ్ బారిన పడినవాళ్లలో హైపర్ టెన్షన్ పెరిగినట్టు కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యని గుర్తించి 90లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తే 13లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. నిమ్స్ చేసిన ఓ సర్వే ప్రకారం... కిడ్నీ సమస్యలున్న వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనీ, జీవనశైలి మార్పులు కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ, షుగర్‌ను ముందుగా గుర్తించి జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారతాయని హెచ్చరించారు. బస్తీదవాఖానాలో పరీక్షల సంఖ్య పెంచుతాం.. రాష్ట్రంలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్న మంత్రి.. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌లో తెలంగాణ దేశంలోనే 3 స్థానంలో ఉందని, మరో నాలుగు నెలల్లో మొదటి స్థానంలోకి తీసుకొస్తామని తెలిపారు. నగరంలోని 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రస్తుతం 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల నుంచి ఆ సంఖ్యను 120కి పెంచుతామని తెలిపారు. పరీక్షలతో పాటు ఉచితంగా మందులు ఇస్తున్నామని, అవి వాడుతున్నారో, లేదో తెలుసుకునేందుకు కాల్ సెంటర్‌నూ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. పరీక్షల ఫలితాల రిపోర్టులను 24 గంటల్లో మొబైల్ ద్వారా పేషెంట్‌కు, డాక్టర్లకు పంపిస్తున్నామని వివరించారు. ఆయుష్ ఆధ్వర్యంలో 450 వెల్నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్యం పట్ల శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. -
‘స్మార్ట్’గా మధుమేహాన్ని కనిపెట్టొచ్చు
వాషింగ్టన్: మధుమేహాన్ని తెలుసుకునేందుకు శరీరాన్ని సూదులతో గుచ్చే పద్ధతులకు అమెరికా శాస్త్రవేత్తలు మంగళం పాడనున్నారు. ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న స్మార్ట్ ఫోన్లతోనే శరీరంలో ‘చక్కెర’ శాతం ఎంతుందో తెలుసుకునేలా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టారు. ఆ నూతన పరికరాన్ని స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి, లాలాజలం ద్వారా టైప్ 2 షుగర్‌ను కూడా సెకన్లలో కనిపెట్టేయొచ్చు. దీనిపై టెక్ డీ మాంటేర్రెయ్ సంస్థకు చెందిన ప్రాజెక్టు కో అర్డినేటర్ డా.మర్కో ఆంటోనియో రిటే పాలోమర్స్(మెక్సికన్ యూనివర్సిటీ) మాట్లాడుతూ.. లాలాజల నమూనాను సెల్‌ఫోన్ కెమెరాతో రికార్డ్ చేయడం ద్వారా షుగర్‌ను కనిపెట్టొచ్చన్నారు. అపారప్రతిభ కలిగిన టెక్ డీ మాంటేర్రెయ్ బృందం, హౌస్టన్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ ఆవిష్కరణను చేశాయని వివరించారు. కెమెరాతో రికార్డ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు.