సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని యూనివర్సిటీల బలోపేతానికి ప్రాధాన్యతనిస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతీ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తొమ్మిది యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లని నియమించామని, మూడు యూనివర్సిటీలకి సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్ధలలో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో అర్హులకి పూర్తిస్ధాయి ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 11 న అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమం ప్రాంభిస్తున్నట్లు చెప్పారు. నాడు నేడులో మూడు విడతలలో 11 వేలకోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఎక్కడాలేని విధంగా హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉన్నత విద్యను బలోపేతం చేస్తున్నాం. నిబంధనలు పాటించని 247 కళాశాలలకి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలుంటాయి. ఈ నూతన విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాం. ఇంటర్‌లో వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభిస్తాం.అవినీతికి తావులేకుండా యూనివర్సిటీలలో పూర్తిగా కంప్యూటీకరణ చేస్తున్నాం. ఉన్నత విద్యలో ర్యాపిడ్ ఎడ్యుకేషన్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరంలో మూడు కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నాం. అయిదేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుని ప్రారంభిస్తున్నాం.నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుని తీసుకువస్తున్నాం. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పిజికోర్సుని కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఈ ఏడాదిలో ఉన్నత విద్యామండలిని మరింత బలోపేతం చేసి దేశంలో నంబర్ వన్‌గా నిలబడతాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment