కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ! | Indian Students Contributing Major Role In Canada Universities | Sakshi
Sakshi News home page

కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!

Published Tue, Oct 3 2023 12:32 PM | Last Updated on Tue, Oct 3 2023 12:52 PM

Indian Students Contributing Major Role To Canada Universities - Sakshi

ఒట్టావా: ఖలిస్తానీ తీవ్రవాది హర్దిప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో కెనడా, భారత దేశాల మధ్య సంబంధాలు ఇటీవల అనూహ్య మార్గంలో పయనిస్తున్నాయి. కెనడా ఉన్నత విద్యాసంస్థల్లో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న కారణంగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదుల భారత వ్యతిరేక ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

19వ శతాబ్దం చివరి నుంచీ కెనడాతో పంజాబ్‌ రాష్ట్రానికి నాటి (బ్రిటిష్‌ ఇండియా కాలం) నుంచీ చారిత్రకంగా సంబంధాలు ఉండడంతో–తమిళులకు శ్రీలంక ఎలాగో, పంజాబీలకు కెనడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉన్న ప్రాంతంగా మారింది. గత పదేళ్లుగా ఏటా కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరుతున్న విద్యార్థుల్లో పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారే సింహభాగం అనేది తెలిసిందే. భారత విద్యార్థులు కెనడలో తమ విద్యాభ్యాసానికి చేస్తున్న వ్యయం (కోట్లాది డాలర్లు) అక్కడి ప్రావిన్సులను (రాష్ట్రాలను) ఆర్థికంగా నిలబెడుతోంది. ప్లస్‌ టూ తర్వాత, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల కోసం కెనడా వెళ్లి చదువుతున్న భారత విద్యార్థులు ఏటా దాదాపు 20 బిలియన్ల డాలర్లు (2000 కోట్ల డాలర్లు) ఖర్చుచేస్తున్నారు.

ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇండియా నుంచి కెనడాకు రావడంతో రెండు దేశాల మద్య సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో అక్కడి విద్యాసంస్థలకు కెనడా సర్కారు కన్నా భారత విద్యార్థులే ఎక్కువ మొత్తంలో ఫీజుల రూపంలో నిధులు సమకూర్చుతున్నారంటే–కెనడాలో భారత్‌ నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు  ప్రాముఖ్యం ఎంతో అర్థమౌతోంది. కెనడా కాలేజీల్లో స్థానిక విద్యార్థులు చెల్లించే ఫీజులకు మూడు రెట్లు ఎక్కువ ఫీజులను భారత విద్యార్థులు చెల్లిస్తున్నారని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే కెనడా ఉన్నత విద్యాసంస్థలు వసూలు చేసే అన్ని రకాల ట్యూషన్‌ ఫీజుల మొత్తంలో 76 శాతం భారత విద్యార్థుల నుంచే వస్తోందన్న మాట. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్సులోని విద్యాసంస్థలన్నీ భారత విద్యార్థుల ఫీజుల డబ్బుతోనే నడుస్తున్నాయని వార్తలొస్తున్నాయి. 

విద్యార్థుల నుంచి కెనడాకు 22.3 బిలియన్‌ డాలర్లు
2022 మార్చిలో కెనడా కాలేజీలు, వర్సిటీల ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల సంఖ్యపై చేసిన ఒక విశ్లేషణ ప్రకారం–ఈ ఉత్తర అమెరికా ఫెడరల్‌ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో 22.3 బిలియన్‌ (2230 కోట్ల డాలర్లు) డాలర్ల సొమ్ము పంపుతున్నారు. అంటే, కెనడా ప్రతి సంవత్సరం ఇతర దేశాలకు ఆటోమొబైల్‌ విడిభాగాలు, కలప, విమానాల ఎగుమతుల ద్వారా సంపాదించేదాని కన్నా అంతర్జాతీయ విద్యార్థులు చెల్లించేదే ఎక్కువ.

ఇక సంఖ్య విషయానికి వస్తే 1990ల చివర్లో కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 40 వేలు కాగా, 2020–21 నాటికి ఈ సంఖ్య 4,20,000కు పెరిగింది. 2009 నుంచీ కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరి చదువులు పూర్తిచేసుకునే పంజాబీ, ఇతర భారత రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య వేగం పుంజుకుంది. ఇండియా నుంచే గాక ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. 2021–22లో కెనడాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల్లో విదేశీ స్టూడెంట్ల సంఖ్య 17.6 శాతం ఉండగా, కెనడా కాలేజీల్లో ఈ అంతర్జాతీయ విద్యార్థల వాటా 22 శాతం ఉంది.

ఒంటారియా ప్రావిన్స్‌ కాలేజీల్లో ఇలాంటి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 2016–17, 2019–20 మధ్య కాలంలో రెట్టింపు కావడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏమంటే–ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే దానికి ఆరు రెట్ల సంఖ్యలో భారత యువతీయువకులు విదేశీ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో చేరుతున్నారని ఎడ్యుకేషన్‌ కన్సల్టెంగ్‌ సంస్థ ఒకటి అంచనా వేసింది. ఇలా విదేశీ ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఇండియన్‌ స్టూడెంట్స్‌ సంఖ్య ఇటీవల 7,70,000కు చేరింది. 2024 నాటికి పాశ్చాత్య దేశాలు సహా విదేశాలకు పోయి అక్కడ ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య 18 లక్షలకు చేరుతుందని అంచనా.

:::విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ ఎంపీ

ఇదీ చదవండి: భారత హైకమిషన్‌కు ఖలిస్తాన్‌ నిరసన సెగ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement