రాజకీయమార్పులకు వేదికల్లా వర్సిటీలు ఎదగాలి | Universities should grow as platforms for political changes | Sakshi
Sakshi News home page

రాజకీయమార్పులకు వేదికల్లా వర్సిటీలు ఎదగాలి

Published Wed, Nov 15 2023 4:31 AM | Last Updated on Wed, Nov 15 2023 4:31 AM

Universities should grow as platforms for political changes - Sakshi

వ్యవస్థను మార్చే నిప్పుకణాలకు విశ్వవిద్యాలయాలే పునాదులు వేస్తాయన్నది ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి అభిప్రాయం. ఉప్పొంగే ఆ యువరక్తంలో కనిపించేది ఆవేశమే కాదు... భావితరాల ఆలోచనా విధానం అనేది ఆయన విశ్లేషణ. రాజకీయ చిత్రపటంలో అత్యున్నత శిఖరాల్లో కనిపించే నేటితరం నేతల ఆశయ పునాదులు యూనివర్సిటీల్లో కన్పిస్తాయని విశ్లేషిస్తారాయన.

సమ్మిళితమైన చదువు, రాజకీయాలను వేర్వేరుగా చూడలేమన్నది ఆయన భావన. ఉ ద్యమాల పురిటిగడ్డలైన తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా రాణించిన నేపథ్యం లింబాద్రిది. అంచెలంచెలుగా ఎదిగి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ లింబాద్రి అసెంబ్లీ ఎన్నికల వేళ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అది  ఆయన మాటల్లోనే ...  

రాజకీయాలకు విద్యార్థి దశే కీలకం 
విలువలతో కూడిన రాజకీయాలకు విద్యార్థి దశే పునాది వేస్తుంది. విద్యతో పాటు రాజకీయ అవగాహన ఉండాలి. మార్పును కోరుకునేదే విద్య. అలాంటప్పుడు రాజకీయ మార్పును ఎందుకు ఆశించకూడదు? యువ చైతన్యాన్ని ఎందుకు స్వాగతించకూడదు? రాజకీయాల్లో కీలకపాత్ర పోషి స్తున్న ఎంతోమందిని చూడండి. ఆకాశాన్ని తాకే వారి ఆలోచనా శక్తి విద్యార్థి నేపథ్యం నుంచే కన్పిస్తుంది. అందుకే యువతరాన్ని రాజకీయాల్లోకి రానివ్వాల్సిందే. ప్రోత్సహించాల్సిందే. నిజానికి రేపటి అభివృద్ధిని అంచనా వేయగలిగేది విద్యార్థి లోకమే. భావితరం ఉన్నతికి బాటలేసేది యువతరమే. ఆ దిశగానే విద్యా బోధన ఉండాలి. సరికొత్త మార్పును ప్రేరేపించే విధానపరమైన లక్ష్యాలు విద్యలో జొప్పించాలి.

ఉదాహరణకు సాంకేతికతనే తీసుకోండి. ఎన్ని మార్పులొచ్చాయి. సంప్రదాయ కోర్సుల స్థానంలో టెక్నాలజీ కోర్సుల వైపు యువత మొగ్గుచూపుతున్నారు. విశ్వవ్యాప్తంగా వచ్చిన ఈ మార్పును మనమూ అందిపుచ్చుకోవాలి. ఆ క్రమంలో ఆలోచన విధానంలోనూ మార్పు లు తేవాలి. మార్కెట్లో మన శక్తిసామర్థ్యాలు నిరూపించుకునే సత్తా మన యువతరానికి ఉంది. దీన్ని మరింత పెంచగలిగే విధానపరమైన నిర్ణయాలు ప్రజల నుంచి వచ్చే నేతలు చేయాలి. విద్యార్థి దశలోనే రాజకీయ నేపథ్యం ఉన్న నేతకు ఇది మరింత బోధపడుతుందనేది నా అభిప్రాయం.  

సర్కారీ కొలువునే ఉద్యోగం అనుకోవద్దు.. 
ప్రతీ ఎన్నికల్లోనూ యువత, ఉపాధి అవకాశాలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. ఈ దిశగా అన్ని పార్టీలూ స్పందిస్తున్నాయి. కానీ వాస్తవాలను యువత తెలుసుకోవాలి. సర్కారీ కొలువునే ఉద్యోగం అనుకోవద్దు. లక్షల్లో గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వేలల్లో ఉంటున్నాయి. అంతమాత్రాన ఉపాధి లేకుండా పోతుందా? ఉద్యోగం కావాలనుకునే ప్రతీ వ్యక్తి తన నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి ఉద్యోగాలు సృష్టించాలి.

ఆ దిశగా మన ఎన్నికల ప్రణాళికలూ ఉండాలి. ఈ వాస్తవాన్ని నేతలు యువతకు వివరించి చెప్పాలి. ఆలోచనలు రేకెత్తించాలి. నిజానికి ఈ తరహా విద్య వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. ఉద్యోగం రాలేదనే తాత్కాలిక అసంతృప్తిని పక్కనబెడితే... ఉపాధి బాటలు వేయగల సామర్థ్యం ఉందని గుర్తిస్తే చాలు..  శాశ్వత పరిష్కారం దొరికినట్టే.     

విద్యారంగ శ్రేయస్సే పార్టీల ఎజెండా కావాలి
విద్యార్థి లోకాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ప్రభుత్వాల కృషి మరువలేనిది. ప్రతిభకు దన్నుగా నిలిచే గురుకులాలు, రెసిడెన్షియళ్లు, ఊతం ఇచ్చే వివిధ రకాల సంక్షేమాలు అభినందనీయమే. నిజానికి విద్యను భావితరాల పెట్టుబడిగానే చూడాలి. అత్యుత్తమ మానవ వనరులు అందించే కేంద్రంగానే పరిగణించాలి. ఆ దిశగా పార్టీల మేనిఫెస్టోలు ఉండాలి.

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా మార్పులొస్తున్నాయి. దీన్ని అందుకోవాలంటే బోధన నాణ్యత పెంచాల్సిందే. అందుకు అనుగుణంగా ఖాళీల భర్తీ అనివార్యం. మన విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఖాళీలున్న మాట వాస్తవం. వాటి భర్తీకి చేపట్టిన చర్యలు, పారదర్శక నియామక విధాన నిర్ణయం ఆమోదించాల్సిందే. ఈ దిశగా చేపట్టిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు మరో అడుగుగానే చెప్పాలి.

ప్రశ్నించే తత్వమే రాజకీయ పునాది 
ప్రశ్నించే తత్వం నుంచే ఆలోచనలు ఉద్భవిస్తాయి. నిలదీసే నైజం నుంచే కోరుకున్న మార్పూ సాధ్యమవుతుంది. అది విద్యార్థి దశ నుంచే మొదలవ్వాలి. ఒక్కో విద్యార్థికి ఒక్కో ఆశయం ఉంటుంది. ఆ కలల స్వప్నంలోంచే గొప్ప రాజకీయవేత్తలూ పుట్టుకొస్తారు.

పారిశ్రామిక వేత్తలూ ఆవిర్భవిస్తారు. రచయితలు, సైంటిస్టులూ.. రాజకీయ విశ్లేషకులు... ఇలా అన్ని వర్గాల మేధావులు సరికొత్త ఆలోచనల్లోంచే తెరపైకి వస్తారు. విద్యార్థికి రాజకీయాలెందుకు? అనే వాదనలో అర్థం లేదు. నిజానికి ఆ దిశగా విద్యార్థి లోకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరమూ ఉంది. మార్కుల పరుగులే కాదు... రాజకీయ మార్పులకు వేదికల్లా విశ్వవిద్యాలయాలు ఎదగాల్సిందే.

-గౌటే దేవేందర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement