మంగళవారమే ముగిసిన రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్ల పదవీ కాలం
వివాదాలు, ఆరోపణలతో వారిని కొనసాగించడంపై సర్కారు విముఖత
కొత్త వీసీల కోసం సెర్చ్ కమిటీలు ఏర్పాటైనా ముందుకు పడని అడుగు
లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియామకాల్లో జాప్యం
వైస్ చాన్స్‌లర్ల పోస్టుల కోసం భారీగా కొనసాగుతున్న పైరవీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్‌లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్‌చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
సెర్చ్ కమిటీలు వేసినా..
వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి.
కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు.
భారీగా పైరవీలు షురూ..
వైస్ చాన్స్‌లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్‌లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు.
రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment