ఉన్నత విద్యారంగం, యూనివర్సిటీల్లో నాణ్యత ప్రమాణాల పెంపే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు సాగుతానని యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సరైన ప్రమాణాలు లేకపోతే ఆ తరమే నష్టపోతుందని, ఆ నష్టం వాటిల్లకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ యూజీసీ నూతన చైర్మన్‌గా శుక్రవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
– సాక్షి ప్రతినిధి, నల్లగొండ
వర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట
లోతైన పరిశోధనలు లేకపోతే మెరుగైన ఆవిష్కరణలకు అవకాశం ఉండదు. దానివల్ల సమాజానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే యూనివర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట వేస్తా. మెరుగైన పరిశోధనలు జరిగినప్పుడే వాటి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే పరిశోధన ఫలాలు ప్రజల దగ్గరికి చేరితేనే సార్థకత ఉంటుంది.
నియామకాలు వేగవంతం చేస్తా
రాష్ట్ర యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల అంశమే ప్రధాన సమస్యగా ఉంది. చాలా రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నియామకాలు ఆగిపోయాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ మంత్రులు, వైస్ ఛాన్స్‌లర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తా. నియామకాలు వేగవంతం జరిగేలా కృషి చేస్తా.
అనుమతి లేని విద్యా సంస్థలపై కొరడా
అనుమతిలేని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కఠిన చర్యలు చేపడతాం.కొన్ని వర్సిటీలు, కాలేజీలు విద్యార్థులకు విద్యను అందించడం లేదు. పేపరుపైనే విద్యా సంస్థలుగా ఉన్నాయి. కొన్నిటికి అనుమతులే ఉండటం లేదు. అధికారుల తనిఖీల్లోనూ ఈ విషయం వెల్లడైంది. అలాంటి వాటిని అలాగే వదిలేస్తే విద్యలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయి. వీటిపై యువతలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం.
నూతన విద్యా విధానంతో ప్రయోజనాలెన్నో..
నూతన విద్యా విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, పేద విద్యార్థులకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఎంతో మెరుగైన విద్యా బోధన అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన అవసరమే. అయితే మాతృభాషలో బోధన చేపడితే విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుంది.
వచ్చే ఏడాది అమల్లోకి ‘హెకీ’
నూతన విద్యా విధానం అమల్లో భాగంగా వచ్చే ఏడాది హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడతున్నాం. అందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకటి ప్రస్తుతం ఉన్న యూజీసీ రెగ్యులేటరీ వ్యవహారాలు చూస్తుంది. మరో సంస్థ నిధులు, ఇంకో సంస్థ అసెస్‌మెంట్స్, గ్రేడింగ్, నాలుగో సంస్థ నాణ్యత ప్రమాణాల పెంపు వంటి కార్యకలాపాలను చూడనుంది. యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలకు విధించిన భౌగోళిక పరిధిని అవి దాటడానికి వీల్లేదన్న అంశంపై తగిన చర్యలు చేపడతా.
తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది
యూజీసీ చైర్మన్‌గా నియామకంతో తెలుగు ప్రజల నుంచి అందుతున్న అభినందనలు ఎంతో శక్తిని ఇస్తున్నాయి. వారి అభిమానం మరువలేనిది.
తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ
యూజీసీ చైర్మన్‌గా అనేక బాధ్యతలు ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నత విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి పని చేస్తా. చొరవ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో వైస్ ఛాన్స్‌లర్లు, విద్యాశాఖ మంత్రులతో ప్రత్యేకంగా చర్చిస్తా. ఈ మేరకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తా. యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలేంటి? వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, యూజీసీ నుంచి ఎలాంటి సహకారం అవసరం.. అన్న అన్ని అంశాలపై చర్చించి తగిన చర్యలు చేపడతా.
Comments
Please login to add a commentAdd a comment