Jagdish Kumar
-
పరిశోధనలతో సమాజానికి మేలు
(వివేకానంద్ తంగెళ్లపల్లి) ; పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధనా రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువగా దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. తగినంత మంది అధ్యాపకులు ఉండాలి ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని జగదీశ్‌కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయపడ్డారు.విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయతి్నస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కలి్పస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదుపరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’అని చెప్పారు. -
ప్రమాణాలు లేకపోతే.. ఒక తరం నష్టపోతుంది
ఉన్నత విద్యారంగం, యూనివర్సిటీల్లో నాణ్యత ప్రమాణాల పెంపే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు సాగుతానని యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సరైన ప్రమాణాలు లేకపోతే ఆ తరమే నష్టపోతుందని, ఆ నష్టం వాటిల్లకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ యూజీసీ నూతన చైర్మన్‌గా శుక్రవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ వర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట లోతైన పరిశోధనలు లేకపోతే మెరుగైన ఆవిష్కరణలకు అవకాశం ఉండదు. దానివల్ల సమాజానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే యూనివర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట వేస్తా. మెరుగైన పరిశోధనలు జరిగినప్పుడే వాటి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే పరిశోధన ఫలాలు ప్రజల దగ్గరికి చేరితేనే సార్థకత ఉంటుంది. నియామకాలు వేగవంతం చేస్తా రాష్ట్ర యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల అంశమే ప్రధాన సమస్యగా ఉంది. చాలా రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నియామకాలు ఆగిపోయాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ మంత్రులు, వైస్ ఛాన్స్లర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తా. నియామకాలు వేగవంతం జరిగేలా కృషి చేస్తా. అనుమతి లేని విద్యా సంస్థలపై కొరడా అనుమతిలేని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కఠిన చర్యలు చేపడతాం.కొన్ని వర్సిటీలు, కాలేజీలు విద్యార్థులకు విద్యను అందించడం లేదు. పేపరుపైనే విద్యా సంస్థలుగా ఉన్నాయి. కొన్నిటికి అనుమతులే ఉండటం లేదు. అధికారుల తనిఖీల్లోనూ ఈ విషయం వెల్లడైంది. అలాంటి వాటిని అలాగే వదిలేస్తే విద్యలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయి. వీటిపై యువతలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం. నూతన విద్యా విధానంతో ప్రయోజనాలెన్నో.. నూతన విద్యా విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, పేద విద్యార్థులకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఎంతో మెరుగైన విద్యా బోధన అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన అవసరమే. అయితే మాతృభాషలో బోధన చేపడితే విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుంది. వచ్చే ఏడాది అమల్లోకి ‘హెకీ’ నూతన విద్యా విధానం అమల్లో భాగంగా వచ్చే ఏడాది హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడతున్నాం. అందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకటి ప్రస్తుతం ఉన్న యూజీసీ రెగ్యులేటరీ వ్యవహారాలు చూస్తుంది. మరో సంస్థ నిధులు, ఇంకో సంస్థ అసెస్మెంట్స్, గ్రేడింగ్, నాలుగో సంస్థ నాణ్యత ప్రమాణాల పెంపు వంటి కార్యకలాపాలను చూడనుంది. యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలకు విధించిన భౌగోళిక పరిధిని అవి దాటడానికి వీల్లేదన్న అంశంపై తగిన చర్యలు చేపడతా. తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది యూజీసీ చైర్మన్‌గా నియామకంతో తెలుగు ప్రజల నుంచి అందుతున్న అభినందనలు ఎంతో శక్తిని ఇస్తున్నాయి. వారి అభిమానం మరువలేనిది. తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ యూజీసీ చైర్మన్‌గా అనేక బాధ్యతలు ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నత విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి పని చేస్తా. చొరవ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో వైస్ ఛాన్స్లర్లు, విద్యాశాఖ మంత్రులతో ప్రత్యేకంగా చర్చిస్తా. ఈ మేరకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తా. యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలేంటి? వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, యూజీసీ నుంచి ఎలాంటి సహకారం అవసరం.. అన్న అన్ని అంశాలపై చర్చించి తగిన చర్యలు చేపడతా. -
జేఎన్‌యూ విద్యార్థుల ర్యాలీలు భగ్నం
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో నాలుగు రోజుల క్రితం విద్యార్థుల దాడి నేపథ్యంలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్‌కుమార్‌ను తొలగించాలంటూ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీలను పోలీసులు భగ్నం చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్చార్డీ)భవనం వైపు గురువారం ఉదయం విద్యార్థులతోపాటు సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, సమస్యలపై చర్చించేందుకు హెచ్చార్డీ అధికారులు కొందరు విద్యార్థి నేతలతో భేటీకి అంగీకరించారు. వీసీ తొలగింపునకు మాత్రం అధికారులు అంగీకరించలేదు. ఫీజుల పెంపు సహా ఇతర సమస్యలపై ఈనెల 10వ తేదీన వీసీతో కలిపి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వీసీ వైదొలగాలన్న డిమాండ్ నెరవేరేదాకా నిరసన ఆపేది లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వైపు కొందరు విద్యార్థులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ సందర్భంగా 11 మందిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా, హెచ్చార్డీ నిర్ణయించిన మేర ఫీజుల పెంపుపై వెనక్కితగ్గేది లేదని జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ తెలిపారు. -
రోల్‌మోడల్‌గా తయారుచేస్తా
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జేఎన్‌యూ నూతన వీసీ జగదీశ్‌కుమార్ ♦ యూనివర్సిటీ పరిశోధనల్లో నాణ్యత తగ్గుతోంది ♦ దీన్ని అధిగమించడానికే నా ప్రథమ ప్రాధాన్యం ♦ వర్సిటీలు ఉద్యోగాల సృష్టికర్తలను తయారు చేయాలి ♦ కనీసం ఐదేళ్లకోసారి సిలబస్‌లో మార్పులు జరగాలి సాక్షి ప్రతినిధి, నల్లగొండ:దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)ని రోల్‌మోడల్‌గా తయారు చేసేందుకు కృషి చేస్తానని ఆ యూనివర్సిటీ నూతన వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. వర్సిటీల్లో జరుగుతున్న పరిశోధనల్లో నాణ్యత తగ్గిపోతోందని, దాన్ని అధిగమించేందుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. స్వామి వివేకానందుని బోధనలు తనకు ఆదర్శమని..దేశ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్న ఆయన స్ఫూర్తితోనే ముందుకెళుతున్నానని చెప్పారు. జేఎన్‌యూ వీసీగా నియమితులైన నేపథ్యంలో జగదీశ్ కుమార్ ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ఫోన్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలివీ.. సాక్షి: జేఎన్‌యూ వీసీగా ఎంపికైనందుకు కంగ్రాట్స్ సార్.. మీ నేపథ్యం ఏమిటి? జగదీశ్‌కుమార్: మాది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. నేను ఆరో తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదువుకుని ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించాను. నా మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ అన్నీ అక్కడే పూర్తయ్యాయి. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చాను. 1995లో ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యో గం లభించింది. ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఇప్పుడు జేఎన్‌యూ వీసీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు మా అమ్మే స్ఫూర్తి. ఆమె స్కూల్ చదువు కూడా చదువుకోలేదు. కానీ చదువుకున్న వారి కన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉంది. నేను ఈ స్థాయికి వచ్చానంటే ఆమే కారణం. ఇప్పటికీ ఆమె సలహాలు తీసుకుంటా. సాక్షి: పరిశోధనలకు నెలవైన విశ్వవిద్యాలయాల్లో నైతిక విలువలు లేకుండా పోతున్నాయని, పరిశోధనల్లో ఆశించిన నాణ్యత ఉండట్లేదన్న అపవాదు ఉంది. మీ అభిప్రాయమేంటి? జగదీశ్‌కుమార్: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో నాణ్యత తగ్గిపోతున్న మాట వాస్తవమే. విశ్వవిద్యాలయాల పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా, దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇప్పించేవిగా ఉండాలి. జేఎన్‌యూలో అలాంటి పరిశోధనలకు చాలా అవకాశాలున్నాయి. వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటా. అయితే ఈ మార్పు రెండు, మూడు నెలల్లో సాధ్యమయ్యే పనికాదు. చాలా శ్రమించాలి. జేఎన్ యూ పరిశోధనల్లో నాణ్యత లోపాన్ని అధిగమించడమే నా ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తా. సాక్షి: దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ఏటా 2 లక్షలకుపైగా రీసెర్చ్ డాక్యుమెంట్లు వస్తున్నాయి. కానీ పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు అందుబాటులోనికి రావడం లేదన్న దానిపై మీరేమంటారు? జగదీశ్‌కుమార్: పరిశోధనల్లో నాణ్యత ఉన్నప్పుడే వాటి ఫలితాలు క్షేత్రస్థాయికి వెళతాయి. అయితే జేఎన్‌యూ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో అందరికీ ప్రవేశాలు సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిభను పూర్తిస్థాయిలో వెలికి తీయలేం. ప్రతిభ అనేది కేవలం నగరాలు, చదువుకున్న కుటుంబాలకే పరిమితం కాదనేది గుర్తించాలి. దేశాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం సాధ్యపడడం లేదు. అందరికీ విద్య, నాణ్యమైన సిలబస్‌ను ఉచితంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగాలి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల నుంచి ఉద్యోగార్థులను తయారు చేయాలన్న ఆలోచన నుంచి బయటపడాలి. ఉద్యోగాల సృష్టికర్తలను విశ్వవిద్యాలయాల నుంచి పంపాలి. ఇది యూనివర్సిటీల నుంచే సాధ్యమవుతుంది. ఆ దిశలో జేఎన్‌యూ పయనించేలా ప్రయత్నిస్తా. యూనివర్సిటీల్లో చదువు అంటే అక్కడే హాస్టళ్లలో ఉండి చదువుకోవడమనే అభిప్రాయం నుంచి యువత బయటపడాలి. ముఖ్యంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని అందరికీ జేఎన్‌యూ పాఠాలు, సిలబస్ ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే కృషి చేయాలన్నది నా ఉద్దేశం. అవసరమైతే ఆన్లైన్ వీడియో పాఠాలు కూడా చెప్పిస్తా. జేఎన్‌యూలో దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ముఖ్యంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా ప్రయత్నిస్తా. సాక్షి: ఆక్స్ఫర్డ్ లాంటి వర్సిటీలు మూక్స్ పేరుతో సమాజానికి ఉపయోగపడేలా ఆఫర్ చేస్తున్న కోర్సులు మనకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? జగదీశ్‌కుమార్: ఆ తరహా కోర్సులు ఇప్పటికే మన దేశంలో ఐఐటీల్లో ప్రారంభమయ్యాయి. మిగిలిన దేశాల విశ్వవిద్యాలయాలు, ఐటీ విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. కానీ మన దేశంలో ఐఐటీలు, యూనివర్సిటీలకు సమన్వయం లేదు. అలాంటి సమన్వయం మనకు అవసరం. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు అభిప్రాయాలను పంచుకుని పనిచేస్తేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయి. నేను ఆ దిశగా పనిచేయాలనుకుంటున్నా. సాక్షి: దేశంలోని వర్సిటీల్లో 10 ఏళ్లకు కూడా సిలబస్ మారని పరిస్థితులున్నాయి. దీనిపై ఏమంటారు? జగదీశ్‌కుమార్: కరిక్యులమ్ రివిజన్ అనేది శాస్త్రీయంగా ఉండాలి. దేశ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని సిలబస్‌ను ఉన్నతీకరిస్తుండాలి. కనీసం ఐదేళ్లకోసారి అయినా సిలబస్ అప్‌గ్రేడ్ కావాలి. మన విశ్వవిద్యాలయాల్లో అలాంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీలను దేశానికి అన్వయింపజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి జేఎన్‌యూను రోల్‌మోడల్ చేయాలనేదే నా తపన. హెచ్‌సీయూ ఘటన దురదృష్టకరం సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య..ఆ తర్వాతి ఘటనల పరిణామాలను మీరెలా చేస్తారు? జగదీశ్‌కుమార్: హెచ్‌సీయూ ఘటన చాలా దురదృష్టకరమైనది. దీని గురించి నేను మాట్లాడను కానీ.. విద్యార్థుల సంక్షేమమే వీసీల ప్రధాన బాధ్యత అనేది నా ఉద్దేశం. చావు, పుట్టుకలను మనం ఆపలేం కానీ.. వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. నేను జేఎన్‌యూకి వెళ్లాక విద్యార్థులతో మమేకమవుతా. వారి సమస్యలపై చర్చిస్తా.. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తా.