ర్యాలీలో పాల్గొన్న ఆయిషీ ఘోష్
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో నాలుగు రోజుల క్రితం విద్యార్థుల దాడి నేపథ్యంలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్‌కుమార్‌ను తొలగించాలంటూ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీలను పోలీసులు భగ్నం చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్చార్డీ)భవనం వైపు గురువారం ఉదయం విద్యార్థులతోపాటు సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, సమస్యలపై చర్చించేందుకు హెచ్చార్డీ అధికారులు కొందరు విద్యార్థి నేతలతో భేటీకి అంగీకరించారు. వీసీ తొలగింపునకు మాత్రం అధికారులు అంగీకరించలేదు.
ఫీజుల పెంపు సహా ఇతర సమస్యలపై ఈనెల 10వ తేదీన వీసీతో కలిపి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వీసీ వైదొలగాలన్న డిమాండ్ నెరవేరేదాకా నిరసన ఆపేది లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వైపు కొందరు విద్యార్థులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ సందర్భంగా 11 మందిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా, హెచ్చార్డీ నిర్ణయించిన మేర ఫీజుల పెంపుపై వెనక్కితగ్గేది లేదని జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment