Santishree Dhulipudi Pandit: JNU Gets Its First Woman Vice Chancellor - Sakshi
Sakshi News home page

డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ నియామకం

Published Mon, Feb 7 2022 4:54 PM | Last Updated on Tue, Feb 8 2022 8:01 AM

Santishree Dhulipudi Pandit: JNU Gets Its First Woman Vice Chancellor - Sakshi

శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌

న్యూఢిల్లీ/సాక్షి, తెనాలి: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నూతన ఉపకులపతి(వీసీ)గా తెలుగు బిడ్డ డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌(59) నియమితులయ్యారు. జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా ఆమె రికార్డుకెక్కారు. శాంతిశ్రీ నియామకానికి రాష్ట్రపతి, జేఎన్‌యూ విజిటర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు సోమవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని సావిత్రిభా యి ఫూలే పుణే యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీ జేఎన్‌యూ వీసీ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఆమె గతంలో జేఎన్‌యూ నుంచి ఎంఫిల్, పీహెచ్‌డీ అందుకున్నారు.

ఇప్పుడు అదే వర్సిటీకి ఉపకులపతిగా నియమితులు కావడం గమనార్హం. మరో తెలుగు వ్యక్తి స్థానంలోకి ఆమె వస్తుండడం మరో విశేషం. ఐదేళ్లు జేఎన్‌యూ వీసీగా సేవలందించిన తెలంగాణవాసి ఎం.జగదీష్‌ కుమార్‌ గత ఏడాది ఆఖర్లో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి యాక్టింగ్‌ వీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన గతవారమే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టనున్న శాంతిశ్రీ ధూళిపూడిని జగదీష్‌ కుమార్‌ ప్రశంసించారు. నూతన వీసీగా సోమవారమే ఆమెకు బాధ్యతలు అప్పగించానని వెల్లడించారు. విధి నిర్వహణలో విజయం సాధించాలని  ఆకాంక్షించారు.  

మెడిసిన్‌ కాదనుకొని
హయ్యర్‌ సెకండరీలో మంచి మార్కులతో శాంతిశ్రీ ఉతీర్ణురాలయ్యాక, సైన్స్‌లో తనకు వచ్చిన మార్కులతో మెడిసిన్‌లో సీటు వచ్చేది. అయినాసరే, ఆమె చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌ చదవాలని నిర్ణయించుకున్నారు.  శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ 1962 జూలై 15న రష్యాలోని (అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌) సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్‌ ధూళిపూడి ఆంజనేయులు రచయిత, జర్నలిస్టు. శాంతిశ్రీ తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ ఓరియంటల్‌ ఫ్యాకల్టీ డిపార్టుమెంట్‌లో తమిళం, తెలుగు భాషల ప్రొఫెసర్‌గా పనిచేశారు.

► శాంతిశ్రీ మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1983లో హిస్టరీ, సోషల్‌ సైకాలజీలో బీఏ డిగ్రీ అందుకున్నారు.
► 1985లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ(ఎంఏ) డిగ్రీ పొందారు.
► 1990లో జేఎన్‌యూకు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ నుంచి ‘పార్లమెంట్, ఫారిన్‌ పాలసీ ఇన్‌ ఇండియా–ద నెహ్రూ ఇయర్స్‌’పై పీహెచ్‌డీ డాక్టరేట్‌ అందుకున్నారు.
► ఉన్నత విద్యావంతురాలైన శాంతిశ్రీ ధూళిపూడి ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. కన్నడం, మలయాళం, కొంకణీ భాషలను అర్థం చేసుకోగలరు.


ఎన్నెన్నో పురస్కారాలు..
► శాంతిశ్రీ పలు అంశాల్లో 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
► మద్రాసు పెసిడెన్సీ కాలేజీ నుంచి 1980–81, 1981–82, 1982–83, 1983–84, 1984–85లో ఎల్ఫిన్‌స్టోన్‌ ప్రైజ్‌. ఈ ప్రైజ్‌ను ఎక్కువసార్లు (ఐదుసార్లు) గెలుచుకున్న రికార్డు ఇప్పటికీ శాంతిశ్రీ పేరిటే ఉంది.
► 1998లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌–మాడిసన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సౌత్‌ ఆసియన్‌ డీస్‌ నుంచి ఫెలోషిప్‌. ఆస్ట్రియా నుంచి మరో ఫెలోషిప్‌.


విద్యా రంగానికి సేవలు
► 1988లో గోవా యూనివర్సిటీలో బోధనా వృత్తిని ఆరంభించారు.
► 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యురాలిగా, 2001 నుంచి 2007 వరకూ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా, 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా బాధ్యతలు.
► చైనాలోని హూనన్‌ వర్సిటీలో ఆసియన్‌ అండ్‌ యూరోపియన్‌ స్టడీస్‌ రిసోర్స్‌పర్సన్‌గా విధులు.
► యూజీసీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌    సైన్స్‌ రీసెర్చ్‌(ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) సభ్యురాలిగా పని చేశారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారు!
శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)కు బలమైన మద్దతుదారు అని తెలుస్తోంది. హిందుత్వవాదులకు అనుకూలంగా గతంలో ఆమె చేసిన ట్వీట్లను పలువురు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. వామపక్షవాదులను, ఉదారవాదులను జిహాదీలుగా ఆమె అభివర్ణించారు. మహాత్మాగాంధీ హత్య పట్ల విచారం వ్యక్తం చేస్తూనే నాథూరామ్‌ గాడ్సేకు సానుభూతి తెలిపారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి కాదు, బీజేపీ ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటాన్ని, షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతిశ్రీ తప్పుపట్టారు. ఆమె ట్వీట్లను విద్యార్థులు, జర్నలిస్టులు విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతిశ్రీ తన ట్విట్టర్‌ ఖాతాను తొలగించినట్లు సమాచారం. 2011లో పుణే యూనివర్సిటీలో విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీసీ పోస్టు కోసం శాంతిశ్రీతోపాటు ప్రొఫెసర్‌ గుల్షన్‌ సచ్‌దేవా, అవినాశ్‌చంద్ర పాండే పేర్లు పరిశీలనకు వచ్చాయి. భావజాలం రీత్యా శాంతిశ్రీ వైపే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా మూలాలు
శాంతిశ్రీ తండ్రి ధూళిపూడి ఆంజనేయులు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అమృతలూరు మండలంలోని యలవర్రు. ఆయన 1924 జనవరి 10న జన్మించారు. ఉన్నత విద్య అభ్యసించి, పాత్రికేయ రంగంలో స్థిరపడ్డారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, హిందూ పత్రికల్లో సబ్‌ఎడిటర్‌గా చేశారు. ఆకాశవాణి సొంత పత్రిక సంపాదకులుగా పనిచేశారు. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభు త్వ సమాచార శాఖలో సమాచార అధికారిగా సేవలందించారు. ఇంగ్లిష్‌ త్రైమాసిక పత్రిక త్రివేణికి సహసంపాదకులుగా ఉన్నారు.

(చదవండి: ప్రభుత్వాలనే కూల్చిన పంచ్‌ డైలాగులు)
(క్లిక్‌: ఇలాంటి ఆధార్‌ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్‌ మీడియా ఫిదా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement