న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు.
60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్‌యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి.
నల్లగొండ వాసి...
తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్‌ఏ అండ్ వీఎస్‌ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు.
నూతన బాధ్యతలు చాలెంజింగ్‌గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్‌లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment