రోల్‌మోడల్‌గా తయారుచేస్తా
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జేఎన్‌యూ నూతన వీసీ జగదీశ్‌కుమార్
♦ యూనివర్సిటీ పరిశోధనల్లో నాణ్యత తగ్గుతోంది
♦ దీన్ని అధిగమించడానికే నా ప్రథమ ప్రాధాన్యం
♦ వర్సిటీలు ఉద్యోగాల సృష్టికర్తలను తయారు చేయాలి
♦ కనీసం ఐదేళ్లకోసారి సిలబస్‌లో మార్పులు జరగాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ:దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)ని రోల్‌మోడల్‌గా తయారు చేసేందుకు కృషి చేస్తానని ఆ యూనివర్సిటీ నూతన వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. వర్సిటీల్లో జరుగుతున్న పరిశోధనల్లో నాణ్యత తగ్గిపోతోందని, దాన్ని అధిగమించేందుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. స్వామి వివేకానందుని బోధనలు తనకు ఆదర్శమని..దేశ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్న ఆయన స్ఫూర్తితోనే ముందుకెళుతున్నానని చెప్పారు. జేఎన్‌యూ వీసీగా నియమితులైన నేపథ్యంలో జగదీశ్ కుమార్ ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ఫోన్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలివీ..
సాక్షి: జేఎన్‌యూ వీసీగా ఎంపికైనందుకు కంగ్రాట్స్ సార్.. మీ నేపథ్యం ఏమిటి?
జగదీశ్‌కుమార్: మాది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. నేను ఆరో తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదువుకుని ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించాను. నా మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ అన్నీ అక్కడే పూర్తయ్యాయి. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చాను. 1995లో ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యో గం లభించింది. ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఇప్పుడు జేఎన్‌యూ వీసీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు మా అమ్మే స్ఫూర్తి. ఆమె స్కూల్ చదువు కూడా చదువుకోలేదు. కానీ చదువుకున్న వారి కన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉంది. నేను ఈ స్థాయికి వచ్చానంటే ఆమే కారణం. ఇప్పటికీ ఆమె సలహాలు తీసుకుంటా.
సాక్షి: పరిశోధనలకు నెలవైన విశ్వవిద్యాలయాల్లో నైతిక విలువలు లేకుండా పోతున్నాయని, పరిశోధనల్లో ఆశించిన నాణ్యత ఉండట్లేదన్న అపవాదు ఉంది. మీ అభిప్రాయమేంటి?
జగదీశ్‌కుమార్: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో నాణ్యత తగ్గిపోతున్న మాట వాస్తవమే. విశ్వవిద్యాలయాల పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా, దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇప్పించేవిగా ఉండాలి. జేఎన్‌యూలో అలాంటి పరిశోధనలకు చాలా అవకాశాలున్నాయి. వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటా. అయితే ఈ మార్పు రెండు, మూడు నెలల్లో సాధ్యమయ్యే పనికాదు. చాలా శ్రమించాలి. జేఎన్ యూ పరిశోధనల్లో నాణ్యత లోపాన్ని అధిగమించడమే నా ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తా.
సాక్షి: దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ఏటా 2 లక్షలకుపైగా రీసెర్చ్ డాక్యుమెంట్లు వస్తున్నాయి. కానీ పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు అందుబాటులోనికి రావడం లేదన్న దానిపై మీరేమంటారు?
జగదీశ్‌కుమార్: పరిశోధనల్లో నాణ్యత ఉన్నప్పుడే వాటి ఫలితాలు క్షేత్రస్థాయికి వెళతాయి. అయితే జేఎన్‌యూ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో అందరికీ ప్రవేశాలు సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిభను పూర్తిస్థాయిలో వెలికి తీయలేం. ప్రతిభ అనేది కేవలం నగరాలు, చదువుకున్న కుటుంబాలకే పరిమితం కాదనేది గుర్తించాలి. దేశాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం సాధ్యపడడం లేదు. అందరికీ విద్య, నాణ్యమైన సిలబస్‌ను ఉచితంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగాలి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల నుంచి ఉద్యోగార్థులను తయారు చేయాలన్న ఆలోచన నుంచి బయటపడాలి. ఉద్యోగాల సృష్టికర్తలను విశ్వవిద్యాలయాల నుంచి పంపాలి. ఇది యూనివర్సిటీల నుంచే సాధ్యమవుతుంది. ఆ దిశలో జేఎన్‌యూ పయనించేలా ప్రయత్నిస్తా. యూనివర్సిటీల్లో చదువు అంటే అక్కడే హాస్టళ్లలో ఉండి చదువుకోవడమనే అభిప్రాయం నుంచి యువత బయటపడాలి. ముఖ్యంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని అందరికీ జేఎన్‌యూ పాఠాలు, సిలబస్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే కృషి చేయాలన్నది నా ఉద్దేశం. అవసరమైతే ఆన్‌లైన్ వీడియో పాఠాలు కూడా చెప్పిస్తా. జేఎన్‌యూలో దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ముఖ్యంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా ప్రయత్నిస్తా.
సాక్షి: ఆక్స్‌ఫర్డ్ లాంటి వర్సిటీలు మూక్స్ పేరుతో సమాజానికి ఉపయోగపడేలా ఆఫర్ చేస్తున్న కోర్సులు మనకెప్పుడు అందుబాటులోకి వస్తాయి?
జగదీశ్‌కుమార్: ఆ తరహా కోర్సులు ఇప్పటికే మన దేశంలో ఐఐటీల్లో ప్రారంభమయ్యాయి. మిగిలిన దేశాల విశ్వవిద్యాలయాలు, ఐటీ విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. కానీ మన దేశంలో ఐఐటీలు, యూనివర్సిటీలకు సమన్వయం లేదు. అలాంటి సమన్వయం మనకు అవసరం. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు అభిప్రాయాలను పంచుకుని పనిచేస్తేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయి. నేను ఆ దిశగా పనిచేయాలనుకుంటున్నా.
సాక్షి: దేశంలోని వర్సిటీల్లో 10 ఏళ్లకు కూడా సిలబస్ మారని పరిస్థితులున్నాయి. దీనిపై ఏమంటారు?
జగదీశ్‌కుమార్: కరిక్యులమ్ రివిజన్ అనేది శాస్త్రీయంగా ఉండాలి. దేశ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లను దృష్టిలో పెట్టుకుని సిలబస్‌ను ఉన్నతీకరిస్తుండాలి. కనీసం ఐదేళ్లకోసారి అయినా సిలబస్ అప్‌గ్రేడ్ కావాలి. మన విశ్వవిద్యాలయాల్లో అలాంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీలను దేశానికి అన్వయింపజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి జేఎన్‌యూను రోల్‌మోడల్ చేయాలనేదే నా తపన.
హెచ్‌సీయూ ఘటన దురదృష్టకరం
సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య..ఆ తర్వాతి ఘటనల పరిణామాలను మీరెలా చేస్తారు?
జగదీశ్‌కుమార్: హెచ్‌సీయూ ఘటన చాలా దురదృష్టకరమైనది. దీని గురించి నేను మాట్లాడను కానీ.. విద్యార్థుల సంక్షేమమే వీసీల ప్రధాన బాధ్యత అనేది నా ఉద్దేశం. చావు, పుట్టుకలను మనం ఆపలేం కానీ.. వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. నేను జేఎన్‌యూకి వెళ్లాక విద్యార్థులతో మమేకమవుతా. వారి సమస్యలపై చర్చిస్తా.. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తా.