winter holidays
-
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు తిరిగి వచ్చేయండి
న్యూయార్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. శీతాకాల సెలవులకు స్వదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు తిరిగి వచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి. ప్రవేశాల నిషిద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జనవరి 20కి ముందే తిరిగి వచ్చేయాలని భారతీయ విద్యార్థులను పలు వర్సిటీలు హెచ్చరించాయి. వలసదారులను అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధికంగా వెనక్కి పంపిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన జారీచేశాయి. చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేకున్నా.. అవకాశం తీసుకోవద్దని హెచ్చరించాయి. అమెరికా వర్సిటీల్లో చదువున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికం కావడం గమనార్హం. 2023–24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు ఉండగా.. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా అయితే నూతన సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు తరగతులు ప్రారంభమవుతాయని, ట్రంప్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జనవరి 2 నుంచే తరగతులు మొదలుపెడుతున్నారని ఒక విద్యార్థి తెలిపారు. జనవరి మొదటి వారాంతం తర్వాత రావడం రిస్క్ అవుతుందని ప్రొఫెసర్లు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లాలని తమపై ఒత్తిడి ఉందని తెలిపారు. అమెరికాకు ఎప్పుడు తిరిగి రావాలనే విషయంలో సందేహాలను తీర్చడానికి యేల్ యూనివర్సిటీ అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాకు వెళ్లడానికి జనవరి 10న రిటర్న్ టికెట్‌ను బుక్ చేసుకున్నానని, అయితే మసాచుసెట్స్ యూనివర్సిటీ సూచన మేరకు రూ.35 వేలు అదనంగా పెట్టి.. తిరిగివెళ్లే తేదీని ముందుకు జరిపానని ఎస్.సర్సన్ అనే విద్యార్థి తెలిపారు. నిబంధనలు కఠినతరం కావచ్చని, నిశిత పరిశీలన, తనిఖీలు ముమ్మరం కావచ్చని తమ ప్రొఫెసర్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకొనే బదులు.. ముందుగా అమెరికాకు తిరిగి రావడమే ఉత్తమమని వెస్లెయాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. -
శీతాకాల సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటించింది. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది.. జనవరి 1 నుంచి 6 వరకు స్కూల్స్‌కు శీతాకాల సెలవులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం డెరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్య్కూలర్‌ను విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. Delhi Government’s Directorate of Education issues circular for winter vacation in Delhi Govt Schools. The Winter Vacation for Academic Session 2023-2024 is scheduled to be observed from 1st January 2024 (Monday) to 6th January 2024 (Saturday) pic.twitter.com/P1GXIROySN — ANI (@ANI) December 6, 2023 15 రోజులు పాటు ఉండే సెలవులను ఈసారీ 6 రోజులకే పరిమితం చేశారు. ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా గత నవంబర్ నెల మొదట్లో 9వ తేదీ నుంచి 18వరకు స్కూల్స్ మూసివేసిన సంగతి విదితమే. అందుకే ప్రతి యేటా జనవరి 1 నుంచి 15 వరకు ఇవ్వాల్సిన సెలవును ఈసారి ఆరు రోజులకే తగ్గించినట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో ముందుగానే చలికాలం సెలవుల ప్రకటన
దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతుండంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో ఢిల్లీలోని విద్యాసంస్థలకు సెలవుల్ని పొడిగించింది. నవంబర్ 09 నుంచి 18 దాకా సెలవులు ఉంటాయని ప్రకటిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో గత ఆరురోజులుగా విషపూరిత వాయువులు వాతావరణాన్ని కమ్మేశాయి. రాబోయే కొద్ది రోజుల్లోనూ ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి నగరానికి ఉపశమనం లభించకపోవచ్చని ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. సాధారణంగా డిసెంబర్-జనవరిలో చలి తీవ్రత దృష్ట్యా సెలవులు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఈసారి ఆ సెలవుల్ని కాలుష్యం నేపథ్యంలో ముందుకు జరిపినట్లు ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. బుధవారం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి అతిషి, రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్, ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరై .. స్కూళ్ల సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 10, 12వ తరగతులకు మినహా మిగతా అక్కడి తరగతుల విద్యార్థులు ఈ శుక్రవారం(నవంబర్ 10) తేదీ వరకు స్కూళ్లకు హాజరు కానక్కర్లేదని(ఫిజికల్ క్లాస్‌లకు మాత్రమే) ఆదేశించింది. అయితే పరిస్థితి తీవ్రతరం అవుతుండడంతో తాజాగా సెలవుల్ని పొడిగించింది. దేశ రాజధానిలో కాలుష్యం స్థాయిలు ఈ సీజన్లో తొలిసారి తీవ్రమైన జోన్లోకి ప్రవేశించాయి. వచ్చే రెండు వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) ‘తీవ్రమైన’ విభాగంలో నమోదు కావడం గమనార్హం. నగర వాసుల మెడపై వేలాడుతున్న కాలుష్య కత్తిని తప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది, కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు 395 ఉన్న AQI.. బుధవారం ఉదయానికి 421కి చేరింది. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడా 409 వద్ద వాయు నాణ్యత సూచీ నమోదు అయ్యింది. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం -
సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు డిసెంబర్ 17 నుంచి వచ్చే జనవరి ఒకటో తేదీ దాకా శీతాకాల సెలవులని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనాలేవీ పనిచేయవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు రోజుల తరబడి సెలవులు న్యాయార్థులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని ప్రజలు భావిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీజేఐ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. ఇదీ చదవండి: వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు -
రాష్ట్రపతికి తమిళిసై విందు
సాక్షి, హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్ధం ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి సహా తెలంగాణ సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్, హైకోర్టు న్యాయమూర్తులు సహా సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇండియన్ రెడ్‌క్రాస్ మొబైల్ యాప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. -
కోవింద్‌కు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం శుక్రవారం నగరానికి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లితో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి రాకముందుకు హకీంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. స్వాగత కార్యక్రమం తర్వాత గవర్నర్, హోం మంత్రి వెంటరాగా రాష్ట్రపతి దంపతులు శీతాకాల విడిది బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘గవర్నర్‌గా వంద రోజులు’నివేదికతో పాటు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రాజ్‌భవన్ ముద్రించిన ‘బతుకమ్మ తెలంగాణ ఫ్లోరల్ ఫెస్టివల్’పుస్తకాన్ని రాష్ట్రపతికి తమిళిసై అందజేశారు. మీరేంటి ఇక్కడ.. స్వాగతం సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేశారు. మీరేంటి ఇక్కడ.. ఇటువైపు వచ్చారెందుకు.. అని గుత్తాను ఉద్దేశించి రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. గతంలో కోవింద్ రాజ్యసభ సభ్యుడిగా, తాను లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంట్ ఎనర్జీ కమిటీలో సభ్యులుగా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గుత్తా తనకు పాత స్నేహితుడని రాష్ట్రపతి చెప్పగా, తనకూ పాత స్నేహితుడే అని సీఎం సరదాగా అనడంతో నవ్వులు విరిశాయి. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి కోవింద్ ఈ నెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. -
ఏప్రిల్‌లో తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
గర్వాల్ హిమాలయాల్లో ఉన్న పవిత్ర బద్రీనాథ్ ఆలయం ఐదు నెలల తర్వాత మళ్లీ ఏప్రిల్ 26న తెరుచుకోనుంది. శీతాకాలం, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ప్రతియేటా ఐదు నెలల పాటు మూసేస్తారు. ఏప్రిల్ 26 ఉదయం 5.15 గంటలకు భక్తుల కోసం ఆలయ గేట్లు తెరుస్తారని పండిట్ ఆచార్య కృష్ణప్రసాద్ ఉనియాల్ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా పూజారులు, తేహ్రి రాజకుటుంబ సభ్యులు, డిమ్రి వర్గ ప్రతినిధులు, బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్.. అంతా కలిసి ఆలయాన్ని మళ్లీ తెరిచే పవిత్ర ముహూర్తాన్ని నిర్ణయించారు. గత సంవత్సరం నవంబర్ 27న శీతాకాలం సందర్బంగా ఆలయాన్ని మూసేశారు.