ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: సాగు వాస్తవిక ఉత్పత్తి వ్యయం, డీజిల్‌పై అధిక రాయితీలు, జన్యుమార్పిడి విత్తనాలు (జీఎంఓ) వంటి వాటితో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేసేలా రాబోయే బడ్జెట్ (వ్యవసాయ) ఉండాలని, నిధుల కేటాయింపును కనీసం 25 శాతమైనా పెంచాలని పలువురు వ్యవసాయ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి ప్రారంభమైన ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా.. గడచిన 48 గంటల్లో రాష్ట్రానికి చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు వర్చువల్ విధానంలో జరిగిన సమావేశాల్లో తమ సలహాలను, సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులకు ఇచ్చే రుణాలను కనీసం 25 శాతం పెంచాలని కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సిఫా) ముఖ్య సలహాదారు పి. చెంగల్ రెడ్డి సూచించారు.ఇక్రిశాట్, ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు తక్షణ ఆమోదం తెలపాలని ఆయన కోరారు. పంట ధరల విధానంపై ప్రభుత్వ సలహా సంఘంగా ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల సంఘానికి వాస్తవిక ఖర్చుల ఆధారంగా ఎంఎస్‌పీ నిర్ధారించేందుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చేనేత రంగ నిపుణుడు డాక్టర్ డి.నరసింహారెడ్డి, రైతు నాయకుడు వై.శివాజీ సలహాలిచ్చారు.
వ్యవసాయ రంగంలో కూలీల కొరతను తగ్గించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎంఎస్‌పీ నిర్ణాయక విధానాన్ని సమూలంగా మార్చాలని కోరారు. దేశ ఆహారభద్రతకు భరోసా ఇచ్చిన హరిత విప్లవ రాష్ట్రాలు భారతీయ పౌష్టికాహార భద్రతా రాష్ట్రాలుగా మారేందుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలన్నారు. రాష్ట్రాలు ఈ ఖర్చును భరించే దశలో లేవని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సీజన్‌కు ఒక్కో రైతుకు 5 వేల లీటర్ల వరకు డీజిల్‌ను అనుమతించడంతో పాటు భారీ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. క్రిమిసంహారక మందులపై పన్నులు తగ్గించాలని సలహా ఇచ్చారు.
ఎంఎస్‌పీపై కమిటీలో ఏపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి
కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నియమించే కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉండడంతో పాటు సుమారు 28 రకాల పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, చేపట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఆ కమిటీలో సభ్యత్వానికి తమకు అర్హత ఉందని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment