ఉల్లి ధర ఢిల్లీకి చుక్కలు చూపెట్టనుందా...!! | Will Onion Rates Shows Impact On Union Government | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 4:11 PM | Last Updated on Sat, Dec 29 2018 6:15 AM

Will Onion Rates Shows Impact On Union Government - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హివర్‌గావ్‌/ముజాహిద్‌పూర్‌ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అంతటి పోషక విలువలుంటాయి ఉల్లిలో. అంతేకాదు ఉల్లి ధరలు ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించగలవు. ఈ విషయం గతంలో రుజువైంది. ఇప్పుడు అదే ధోరణి పునరావృతం అవుతుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఉల్లి, ఆలు ధరలు దారుణంగా పడిపోవడంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో నరేంద్రమోదీ వ్యతిరేక పవనాలు బలపడే అవకాశాలున్నాయి. ఉల్లి ధర కిలో రూపాయికి చేరడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. కిలో ఉల్లిని పండించడానికి రూ.8 ఖర్చవుతుండగా..రూపాయి గిట్టుబాటు కావడంతో అప్పుల్లో మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రోడ్లపై పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమని తేల్చిచెప్తున్నారు. అచ్చేదిన్‌ అంటూ అధికారంలోకొచ్చిన బీజేపీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. 1998లో ఉల్లి ధర క్షీణించడంతో తర్వాత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి తిరిగి అధికారంలోకి రాలేకపోయింది.

ధర పెరిగినా దెబ్బే..
ధరలు క్షీణించడంతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందనుకోవడం పొరబాటే. రైతుల నుంచి కొనుగోలు చేసే ధరలు ఎలా ఉన్నా బహిరంగ మార్కెట్లో మాత్ర వాటిలో తేడా ఉండదు. నాలుగు దశల్లో ఉండే దళారులు తలా ఇంత ధర పెంచడంతో సరుకు వినియోగదారుడికి చేరేసరికి దాని ధర తడిసి మోపెడవుతుంది. ఇక ధరలు నిజంగానే పెరిగితే.. వినియోగదారుల జేబులకు చిల్లులు పడాల్సిందే. అప్పుడు కూడా ఢిల్లీకి సెగ తాకక తప్పదు. 1980 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉల్లి ధర ఆకాశాన్ని తాకడంతో జనతా ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీచాయి. దాంతో కేంద్రంలో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ 353 ఎంపీ సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉల్లి ధర తోడ్పడిందని భావించవచ్చు.

బీజేపీకి మాత్రం ఓటేయం..
‘లోక్‌సభ ఎన్నిలకు మరికొన్ని నెలలే ఉంది. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మేం దానిని స్వీకరించలేం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీకి మాత్రం ఓటు వేయం. 2014 ఎన్నికలప్పుడు చేసిన తప్పును మళ్లీ చేయం. ఏదేమైనా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తాం’ అని ఓ ఇంగ్లిష్‌ వార్తా సంస్థ సర్వేలో కొందరు రైతులు కుండబద్దలు కొట్టారు.

భవితవ్యాన్ని మార్చేస్తారు..
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కలిపి 128 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 545 స్థానాలున్న భారత పార్లమెంటులో ఈ రెండు రాష్ట్రాల పాత్రేమిటో తెలుస్తూనే ఉంది. ఇక ఉల్లి, ఆలు ధరల క్షీణత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ జనంలో బీజేపీపై వ్యతిరేకత రావడానికి కారణమవుతుందనడంలో సందేహం లేదు. వీరంతా 128 ఎంపీ అభ్యర్థుల భవితవ్యాన్ని తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీకి ప్రతికూల పవనాలు వీస్తుండగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో గనుక బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బందులు తలెత్తవచ్చు. లేదా తిరిగి అధికారంలోకి రాలేకపోవచ్చు. మరోవైపు 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టగానే నెమ్మది నెమ్మదిగా రైతులకు సబ్సిడీలను తొలగించడం కూడా వ్యతిరేకత పెంచింది. ఇదే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీయడానికి కారణమైంది. 

రూ. 400 పెరిగింది..
దేశంలో ఆలు పంట అధికంగా పండించే ఉత్తరప్రదేశ్‌లోనూ గిట్టుబాబు ధరలులేక  రైతులు ఆందోళన చెందుతున్నారు. 86 శాతం మేర పడిపోయిన టన్ను ఆలు ధర రూ.2500లకు చేరిందని వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పంటల నిర్వహణ ఖర్చులు పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయా అమ్మోనియం ఫాస్పేట్‌ (డీఏపీ) రూ. 400 పెరిగి 1450 రూపాయలకు చేరిందనీ, కానీ ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ కలిసి ధర పెంచేశాయి..
టన్ను ఉల్లి ధర 83 శాతం మేర పడిపోవడం ఒకవైపు.. అంతర్జాతీయంగా రూపాయి విలువ పడిపోవడం మరోవైపు దిగుబడి ఖర్చులు పెరిగేలా చేశాయి. గతంలో కంటే పంట దిగుబడి ఎక్కువ రావడం, తూర్పు మధ్య ఆసియా, ఆగ్నేయాసియా నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ఎగుమతులు తగ్గి నష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

అప్పుల్లో ముంచేశారు..
పండించిన పంటలకు గిట్టుబాబు ధరలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. ‘ధరల స్థిరీకరణ నిధి’ని ఏర్పాటు చేయకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 26 కోట్ల మంది రైతులు దళారీల దయాదాక్షిణ్యాల మీద పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది. తమకు పంటలను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటి సదుపాయాలు కల్పిస్తే ఇంతటి తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యేవి కాదనీ, అప్పుల్లో మునిగిపోయేవారం కాదని రైతులు అంటున్నారు. 

అచ్చేదిన్‌ ఎక్కడ..
‘మంచి రోజులొస్తాయంటే నమ్మాం. నరేంద్ర మోదీని గెలిపించాం. కానీ, రైతుల పట్ల ఇంత నిర్లక్ష్య పాలన సాగిస్తారని అనుకోలేదు’ అని మాధవ్‌ పవాసే అనే ఉల్లి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ధర పడిపోవడంతో రైతులు పంటపొలాల్లోనే ఉల్లిని వదిలేస్తున్నారనీ, పంటను కోసి మార్కెట్‌కు తరలిస్తే మరింత నష్టం మూటగట్టుకోవాల్సి వస్తుందని వాపోయారు.

బీజేపీకి సవాల్‌..
ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించడమని బీజేపీలో అంతర్మథనం మొదలైంది. వారిని ఆకట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ రైతులకు మేలు చేసే పథకాలు అమలు చేస్తామని చెప్పుకొస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలోనూ రైతు రుణ మాఫీ ప్రకటించిన కాంగ్రెస్‌.. దేశ వ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేయాలని బీజేపీకి సవాల్‌ విసురుతోంది. 

అయితే, రుణాల మాఫీ అన్నది రైతు సమస్యల పరిష్కారానికి మార్గం కాదని నీతి ఆయోగ్‌ వైఎస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు రైతుల సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్‌ జాఫర్‌ చెప్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరలతో పోల్చి గిట్టుబాబు ధరలు అందించడానికి ఎలక్ట్రానిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ కొనసాగుతోందనీ, ఇంత పెద్ద దేశంలో నాలుగేళ్లలోనే దానిఫలాలు రావాలనడం భావ్యం కాదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement