![Govt hikes minimum support price for wheat and five other rabi crops - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/22/794035-252184-GM-CROPS.jpg.webp?itok=qbpuQ7D-)
న్యూఢిల్లీ: గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6% వరకు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుల ద్వారా ఎంఎస్పీ వ్యవస్థను దశలవారీగా తొలగించాలనుకుంటోందన్న రైతుల ఆందోళనకు తాజా చర్య ద్వారా ప్రభుత్వం సమాధానమిచ్చింది. గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్పీ రూ. 1,975కి చేరింది. 2020–21 పంట సంవత్సరానికి(జూన్–జూలై), 2021–22 మార్కెటింగ్ సీజన్‌కు ఆరు రబీ పంటల ఎంఎస్పీ పెంపును ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు తెలిపారు.
బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది. ఎంఎస్పీ రూ.225 పెరగడంతో, కందుల ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. మసూర్‌దాల్ ధర క్వింటాల్‌కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. ఆవాల ధర క్వింటాల్‌కు రూ.225 పెరిగి, రూ. 4,650కి చేరింది. కుసుమల ధర క్వింటాల్‌కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది. కనీస మద్దతు ధర కొనసాగుతుందనేందుకు తాజా పెంపే నిదర్శనమని తోమర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు. గత ఆరేళ్లలో రైతులకు రూ. 7 లక్షల కోట్లను ఎంఎస్పీగా అందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment