రాజధాని దగ్గర్లోని సింఘు సరిహద్దు వద్ద భారీ స్థాయిలో బైఠాయించిన రైతులు
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తొలిరోజు అడ్డుకున్న ప్రభుత్వం రెండోరోజు శుక్రవారం దిగి వచ్చింది. రైతులు శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీకి దారి తీసే మార్గాలపై విధించిన ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. దీంతో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. రాజధానిలో అతి పెద్దదైన నిరంకారీ మైదానంలో ధర్నా నిర్వహించారు.
సాగును కార్పొరేట్లకు అప్పగిస్తూ రైతులను దగా చేసే కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పంజాబ్–హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి బయలుదేరిన రైతులపైహరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. హరియాణాలో పలుచోట్ల రైతులపై దాష్టీకం ప్రదర్శించారు. శుక్రవారం పరిస్థితి చాలావరకు సద్దుమణిగింది. ఆంక్షలను ఎత్తివేయడంతో అన్నదాతలు తిక్రీ బోర్డర్ నుంచి పోలీసు ఎస్కార్ట్‌తో నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. ధర్నాతో ఢిల్లీలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హరియాణాలోని భీవానిలో జరిగిన ప్రమాదంలో ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పంజాబ్ రైతు తాన్నాసింగ్(40) మృతి చెందాడు.
రైతులతో చర్చించేందుకు సిద్ధం
రైతులతో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రైతన్నలు ఆందోళన విరమించుకోవాలని కోరారు. కొత్త సాగు చట్టాలతో అన్నదాతల జీవితాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. 3న జరిగే భేటీకి రైతు నేతలను ఆహ్వానించామన్నారు.
సింఘు సరిహద్దు వద్ద రైతుపై లాఠీచార్జ్ చేస్తున్న జవాను
Comments
Please login to add a commentAdd a comment