ఘాజీపూర్ సరిహద్దు వద్ద రైతు ఆందోళనల్లో పాల్గొన్న రాకేశ్ తికాయత్
న్యూఢిల్లీ/చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ శనివారం ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా కొనసాగిస్తున్న ఆందోళనలను విరమించాలని రైతు సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని పెంచడంతోపాటు ఎంఎస్‌పీ ప్రకారం పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ జరిపిందని చెప్పారు. కాగా, మంత్రి తోమర్ పిలుపుపై 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) స్పందించింది. ఆ ప్రకటనలు అస్పష్టంగాను, పరస్పర విరుద్ధంగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది.
వివాదాస్పద చట్టాలకు అర్థంలేని సవరణలు చేపట్టాలని తాము కోరుకోవడం లేదని తెలిపింది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది నవంబర్ నుంచి వివిధ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయా చట్టాల్లోని వివాదాస్పద అంశాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య జనవరి 22వ తేదీ నాటికి 11 విడతలుగా జరిగిన చర్చలుæ పురోగతి సాధించలేకపోయాయి. ఆందోళనలు 8వ నెలకు చేరుకున్న సందర్భంగా ఎస్‌కేఎం ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రైతులు గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు.
భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో ఈశాన్య ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)ను కలిసేందుకు బయలుదేరగా పోలీసులు వారిని వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకునేదాకా ఆందోళనలను విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యుధ్‌వీర్ సింగ్ తేల్చిచెప్పారు. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో ఉన్న బారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించి, అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment