
పత్తి రైతును పట్టించుకోరా..
‘పత్తి రైతులను పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. క
కనీస మద్దతు ధరపై భరోసా ఇవ్వాలి
జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే రైతులకు ఇంకా ఇబ్బందులే
ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
వరంగల్ : ‘పత్తి రైతులను పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. కరువు పరిస్థితుల్లో పండించిన కొద్ది పంటకు గిట్టుబాటు దక్కకపోతే రైతుల పరిస్థితి ఏమిటి’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికలో ఓటర్లు సరైన తీర్పు ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే రైతులపై ఇంకా పెద్ద పెద్ద బండలు వేసేలా నిర్ణయాలు కొనసాగుతాయని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం తొర్రూరులో జరిగిన సభలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి అరకొరగా క్వింటాల్‌కు రూ.4100 కనీస మద్దతు ధర ప్రకటించిం దని... రాష్ట్రంలో ఏ రైతుకూ ఈ ధర దక్కడంలేదన్నారు. పత్తికి రూ.3500 మాత్రమే వస్తుండడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. పత్తి రైతులు నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. వరంగల్ జిలాల్లో 150 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
ప్రభుత్వంలో ఉన్న వారు ఇప్పటికైనా స్పందించి పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తికి క్వింటాల్‌కు రూ.6700 ధర పలికిందని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. వాటిని నెరవేర్చడంలేదన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే చేతగాని పాలనకు ఓటు వేసినట్లేనని అన్నారు. పేదల అభ్యన్నతి, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత లక్ష్యాలుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారని, వైఎస్సార్ పాలనను మళ్లీ తీసుకువచ్చేలా వరంగల్ లోక్‌సభ ఓటర్లు వైఎస్సార్‌సీపీకి ఉప ఎన్నికలో మద్దతు తెలపాలని కోరారు. మహానేత వైఎస్సార్ అమలు చేసిన పథకాలను తమవిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ దిక్కుమాలిన పార్టీ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీకి ఉప ఎన్నికలో బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. వెన్నుపోటు, మోసపూరిత పార్టీ టీడీపీ మద్దతుతో బీజేపీ ఉప ఎన్నికలో పోటీ చేస్తోందని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఓటర్లు సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించాలని చెప్పారు. జిల్లాలో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా.. కేసీఆర్ ఎంపీగా తాను మోజుపడిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా నియమించినందుకు ఈ ఉప ఎన్నిక వచ్చిందని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
మూడు నియోజకవర్గాల్లో ప్రచారం
వరంగల్ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పాలకుర్తి, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రచారాన్ని ప్రారంభించిన జగన్.. తొర్రూరులో బహిరంగసభతో ముగించారు. పాలకుర్తి, దర్దెపల్లి, కొండాపురం, ఒగులాపూర్, జఫర్‌గఢ్, దమ్మన్నపేట, రెడ్డిపాలెం, నందనం, కక్కిరాలపల్లి, కట్య్రాల, ఇల్లంద, వర్ధన్నపేట, డీసీ తండా, రాయపర్తి, మైలారం, నాంచారిమడూరులో జగన్ ప్రచారం నిర్వహించారు. దారిలో ప్రతి చోట జగన్‌కు చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ తొలిరోజు ప్రచారం సాగింది. వైఎస్సాఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, ఎడ్మ కిష్టారెడ్డి, ఎ.రెహ్మాన్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు భీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, ఎం.సందీప్‌కుమార్, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, బంగి లక్ష్మణ్, సుమిత్‌గుప్తా, జి.శివ, ఐ.వెంకటేశ్వర్ర్రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, కమల్‌రాజ్, ఎం.కళ్యాణ్‌రాజ్, కె.నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజులు ఉండవా అన్నా..
సినుకు కోసం మొఖం మొత్తింది. నీవు కాలు పెట్టినవ్.. మొగులు పట్టింది.. నాలుగు రోజులు ఉండిపోరాదన్నా.. వర్ధన్నపేట మండలం దమన్నపేటలో వైఎస్ జగన్‌తో మహిళా రైతు.
పత్తి రైతులు నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 150 మందికిపైగా రైతులు ఆత్మహత్య
చేసుకున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు ఇప్పటికైనా స్పందించి పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి.
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి