సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిల్లెట్స్ మిషన్‌ను వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. మన రాష్ట్రంతోపాటు 19 రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయశాఖ సహకారంతో రెండేళ్ల కిందట ఈ మిషన్ ప్రారంభమైంది. సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న వంటి ముతక ధాన్యాలతో పాటు కొర్ర, వరిగ, అండుకొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యం. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి చిరుధాన్యాల సాగును రెట్టింపు చేసి తక్కువ వ్యయంతో రైతులకు ఎక్కువ ఆదాయం దక్కేలా చేయాలన్నది ఉద్దేశం. దీన్లో భాగంగా సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న వంటి పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించగా కొన్ని చిరుధాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు ధరల స్థిరీకరణ నిధితో జోక్యం చేసుకుంటోంది. అయినా మొక్కజొన్న తప్ప మిగతా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం సంతృప్తికరంగా లేదు. దీంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్ణయించాయి. వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడంతో పాటు పర్యావరణ హితం, పౌష్టికాహార విలువలున్న జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను రైతులు సాగుచేస్తే భూసారాన్నీ పరిరక్షించుకోవచ్చు. ప్రస్తుత తక్షణావసరం ఇదేనని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
మన రాష్ట్రంలో 2.87 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం
సజ్జ, జొన్న, రాగి వంటి ముతక ధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీచేస్తే ఉత్పత్తి పెరుగుతుందని, వ్యయప్రయాసలతో కూడిన పంటల నుంచి రైతులు చిరుధాన్యాల వైపు మరల్చవచ్చని సాగురంగ నిపుణుల అభిప్రాయం. చౌకడిపోల ద్వారా చిరుధాన్యాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదించినా కరోనా నేపథ్యంలో అమల్లోకి రాలేదు. ముతక ధాన్యాలతో పాటు చిరుధాన్యాలను సాగుచేయడం వల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది. చిరుధాన్యాలను పండించడం వల్ల భూమి గుల్లబారకుండా ఉంటుందని హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనసంస్థ డైరెక్టర్ విలాస్ తోనాపి పేర్కొన్నారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 24 శాతం పెరిగింది.
ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతుంటే మన రాష్ట్రంలో మొత్తం 2.87 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలన్నది లక్ష్యం. గత ఏడాది ఖరీఫ్‌లో 1.85 లక్షల హెక్టార్లలో ఈ పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌లోనైనా లక్ష్యానికి అనుగుణంగా జొన్న 41 వేల హెక్టార్లు, సజ్జ 34 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.18 లక్షల హెక్టార్లు, రాగి 35 వేల హెక్టార్లు, ఇతర చిరుధాన్యాలను 59 వేల హెక్టార్లలో సాగు చేయించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో మిల్లెట్స్ మిషన్ అమల్లో ఉంది. ఒక్క చిరుధాన్యాలతోనే ఆదాయం రాదనే అపోహను పోగొట్టేలా.. పంట వైవిధ్యాన్ని, అంతరపంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్రలో రాగి పంట సాగు పెరిగింది.
మొక్కజొన్న సాగు ఎందుకు పెరుగుతోందంటే..
సజ్జ, జొన్న, రాగి వంటి ముతక ధాన్యాల సాగు పెరగకపోయినా మొక్కజొన్న సాగు ఏటికేడాది పెరుగుతూనే ఉంది. మొత్తం దిగుబడిలో పది శాతానికి పైగా మొక్కజొన్నల్ని కోళ్ల మేత కోసం పౌల్ట్రీరంగం కొనుగోలు చేస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అనుబంధ ఆహార ఉత్పత్తులకు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే వీటిని శుద్ధి చేయడం సులభమేగాక మద్దతు ధర కూడా సాగు పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment