కల్తీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం | Actions against sellers of adulterated seeds | Sakshi
Sakshi News home page

కల్తీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం

Published Sun, Jun 2 2024 6:00 AM | Last Updated on Sun, Jun 2 2024 6:00 AM

Actions against sellers of adulterated seeds

రంగంలోకి ప్రత్యేక నిఘా బృందాలు 

జిల్లా కేంద్రాల్లో సీడ్‌ మానిటరింగ్‌ విభాగాలు 

కమిషనరేట్‌లో సీడ్‌ రెగ్యులేషన్‌ సెల్‌ 

ఇప్పటికే ముగ్గురు డీలర్లపై 6ఏ కేసులు 

రూ. 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలు జప్తు 

రూ.2.13 కోట్ల విలువైన విత్తన విక్రయాలు నిలుపుదల 

ఆర్బీకేల ద్వారా నాన్‌ సబ్సిడీ బీటీ పత్తి, మిరప విత్తనాలు 

సాక్షి, అమరావతి: రైతులు కల్తీల బారిన పడి నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. తయారీ, పంపిణీ, సరఫరాపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచ­డంతోపాటు గ్రామస్థాయిలో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా నాన్‌సబ్సిడీ విత్తనా­లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

జిల్లా అధికారులకు విస్తృత అధికారాలు 
ఖరీఫ్‌ సీజన్‌కు 3 నెలల ముందే పత్తి, మిరప ఇతర విత్తనాలను సాగు విస్తీర్ణానికి తగినట్టుగా సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలను సిద్ధం చేసింది. ముఖ్యంగా పత్తి విత్తనం 29 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. ఇలా ఇతర విత్తనాలనూ సిద్ధం చేసింది. గతంలో మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత నమూనాలు సేకరించి, నిషేధిత హెచ్‌టీ విత్తనాలను గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం విత్తన తయారీ నుంచే నిఘాను కట్టుదిట్టం చేశారు. ప్రొసెసింగ్‌ ప్లాంట్లపై నిరంతర నిఘా ఉంచారు. 

డీలర్ల నుండి విత్తన నమూనాలతో పాటు ప్యాకింగ్, ధ్రువీకరణ, లేబులింగ్‌ వంటి వివిధ దశల్లో విత్తన నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత హెచ్‌టీ విత్తన విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా వ్యవసాయాధికారులకు విస్తృత అధికారాలు ఇచ్చారు. వీరి పర్యవేక్షణలో సీడ్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన క్షేత్ర స్థాయి ప్రత్యేక నిఘా బృందాల ద్వారా ప్రాసెసింగ్‌ యూ­నిట్లు, స్టోరేజీ పాయింట్లు, డీలర్లు, రిటైల్‌ షాపులు, డెలివరీ యూనిట్లలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. 

జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ‘సీడ్‌ మానటరింగ్‌ సెల్‌’ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో ‘సీడ్‌ రెగ్యులేషన్‌ సెల్‌’ (ఫోన్‌ నెం 8331056032),  రైతు సమీ­కృత సమాచార కేంద్రం (టోల్‌ ఫ్రీ నెం. 155251)కు ఫోన్‌ చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ముగ్గురు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేశారు. రూ.2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరçప, కూరగాయల విత్తనాల అమ్మకాలను నిలిపివేశారు. 

ఆర్బీకేల ద్వారా నాన్‌ సబ్సిడీ విత్తనాలు 
సరి్టఫై చేసిన నాణ్యమైన పత్తి, మిరప, ఇతర నాన్‌సబ్సిడీ విత్తనాలను జూన్‌ రెండో వారం నుంచి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందు కోసం ఆయా కంపెనీలతో ఏపీ సీడ్స్‌ అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ విత్తనాల నాణ్యతను నాలుగు దశల్లో పరీక్షిస్తారు. శుద్ధి చేసిన విత్తనాన్ని ప్యాకింగ్‌ చేసి రైతులకు పంపిణీ చేసే ముందు ఆర్బీకేల్లో పరీక్షిస్తారు. ఆర్బీకే ఇన్‌చార్జితో పాటు గ్రామంలోని కొంతమంది రైతులతో కలిసి గ్రామ స్థాయిలో మరోసారి నాణ్యతను పరీక్షిస్తారు. 

కల్తీ విత్తనాలపై నిఘా పెంచాం 
గతంలో 2, 3 పత్తి విత్తన రకాలకు మాత్రమే డిమాండ్‌ ఉండగా, ప్రస్తుతం అనేక కంపెనీలు నిబంధనల మేరకు నాణ్యమైన విత్తనాలను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. సర్టిఫై చేసిన పత్తి విత్తనాలను ఎమ్మార్పి కి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశాలిచ్చాం. తీవ్రతనుబట్టి క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తాం.   – చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ 

ఆర్బీకేల ద్వారా అవగాహన  
నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాల ఎంపికపై రైతులకు ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కల్తీ విత్తన విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరి్టఫై చేసిన నాణ్యమైన నాన్‌ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెస్తున్నాం.  – ఎం.శివప్రసాద్, ఎండీ,  ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ 

కల్తీ విత్తనాల విక్రేతలపై ఫిర్యాదుకు ఈ నంబర్లకు ఫోన్‌ చేస్తే చాలు.. 
సీడ్‌ రెగ్యులేషన్‌ సెల్‌– 8331056032
రైతు సమీకృత సమాచార కేంద్రం – 155251 (టోల్‌ ఫ్రీ నంబర్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement