Adulterated seeds
-
కల్తీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: రైతులు కల్తీల బారిన పడి నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. తయారీ, పంపిణీ, సరఫరాపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచడంతోపాటు గ్రామస్థాయిలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా నాన్‌సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా అధికారులకు విస్తృత అధికారాలు ఖరీఫ్ సీజన్‌కు 3 నెలల ముందే పత్తి, మిరప ఇతర విత్తనాలను సాగు విస్తీర్ణానికి తగినట్టుగా సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలను సిద్ధం చేసింది. ముఖ్యంగా పత్తి విత్తనం 29 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. ఇలా ఇతర విత్తనాలనూ సిద్ధం చేసింది. గతంలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత నమూనాలు సేకరించి, నిషేధిత హెచ్‌టీ విత్తనాలను గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం విత్తన తయారీ నుంచే నిఘాను కట్టుదిట్టం చేశారు. ప్రొసెసింగ్ ప్లాంట్లపై నిరంతర నిఘా ఉంచారు. డీలర్ల నుండి విత్తన నమూనాలతో పాటు ప్యాకింగ్, ధ్రువీకరణ, లేబులింగ్ వంటి వివిధ దశల్లో విత్తన నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత హెచ్‌టీ విత్తన విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా వ్యవసాయాధికారులకు విస్తృత అధికారాలు ఇచ్చారు. వీరి పర్యవేక్షణలో సీడ్ ఇన్స్పెక్టర్లతో కూడిన క్షేత్ర స్థాయి ప్రత్యేక నిఘా బృందాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు, స్టోరేజీ పాయింట్లు, డీలర్లు, రిటైల్ షాపులు, డెలివరీ యూనిట్లలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ‘సీడ్ మానటరింగ్ సెల్’ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ‘సీడ్ రెగ్యులేషన్ సెల్’ (ఫోన్ నెం 8331056032), రైతు సమీకృత సమాచార కేంద్రం (టోల్ ఫ్రీ నెం. 155251)కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ముగ్గురు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేశారు. రూ.2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరçప, కూరగాయల విత్తనాల అమ్మకాలను నిలిపివేశారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలు సరి్టఫై చేసిన నాణ్యమైన పత్తి, మిరప, ఇతర నాన్‌సబ్సిడీ విత్తనాలను జూన్ రెండో వారం నుంచి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందు కోసం ఆయా కంపెనీలతో ఏపీ సీడ్స్ అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ విత్తనాల నాణ్యతను నాలుగు దశల్లో పరీక్షిస్తారు. శుద్ధి చేసిన విత్తనాన్ని ప్యాకింగ్ చేసి రైతులకు పంపిణీ చేసే ముందు ఆర్బీకేల్లో పరీక్షిస్తారు. ఆర్బీకే ఇన్చార్జితో పాటు గ్రామంలోని కొంతమంది రైతులతో కలిసి గ్రామ స్థాయిలో మరోసారి నాణ్యతను పరీక్షిస్తారు. కల్తీ విత్తనాలపై నిఘా పెంచాం గతంలో 2, 3 పత్తి విత్తన రకాలకు మాత్రమే డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అనేక కంపెనీలు నిబంధనల మేరకు నాణ్యమైన విత్తనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. సర్టిఫై చేసిన పత్తి విత్తనాలను ఎమ్మార్పి కి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశాలిచ్చాం. తీవ్రతనుబట్టి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ఆర్బీకేల ద్వారా అవగాహన నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాల ఎంపికపై రైతులకు ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కల్తీ విత్తన విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరి్టఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెస్తున్నాం. – ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ కల్తీ విత్తనాల విక్రేతలపై ఫిర్యాదుకు ఈ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు.. సీడ్ రెగ్యులేషన్ సెల్– 8331056032రైతు సమీకృత సమాచార కేంద్రం – 155251 (టోల్ ఫ్రీ నంబర్) -
కల్తీ విత్తనం.. మార్కెట్లో పెత్తనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల్లో ఇద్దరు వాణిజ్య పంటలు వేసి చేతులు కాల్చుకున్న వారే. మరొకరు కల్తీ విత్తనం బారినపడి నష్టపోయిన వారు. కల్తీ విత్తన చావులకు ఇదో నిదర్శనం మాత్రమే. రాష్ట్రంలో కల్తీ విత్తనాల బారినపడి నష్టపోతున్న వారిలో పత్తి, మిర్చి రైతులే అధికం. అయితే, ప్రతి వంగడాన్ని ఏదోవిధంగా కల్తీ చేయడం సాగిపోతూనే ఉంది. ఒకపక్క కలిసిరాని ప్రకృతి, మరో వంక కల్తీ విత్తనాలతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఆర్థికంగా దెబ్బతిని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వందలాది కేసులు నమోదవుతున్నా.. తనిఖీలు చేస్తున్నా కల్తీ విత్తనాల బెడద రాష్ట్రంలో ఏమాత్రం ఆగడం లేదు. కల్తీకి పలానా కంపెనీ కారణం అని తేలినా ఆ విత్తన సంస్థల నుంచి రైతులకు పరిహారం అందడం లేదు. బడా విత్తన కంపెనీలతో లాలూచీ పడిన గత ప్రభుత్వాల నిర్వాకంతో రాష్ట్రంలో ఇప్పటికీ కల్తీ విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగానే సాగుతోంది. కల్తీ విత్తన విక్రయ అడ్డాలు వాణిజ్య పంటలు ఎక్కడ సాగవుతుంటే.. అక్కడ కల్తీ విత్తనాలు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, గుంటూరు, కర్నూలు, నంద్యాల వీటికి ప్రధాన అడ్డాలుగా మారాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి రైతులు కల్తీ విత్తనాలతోనే నష్టపోతున్నారు. నాసిరకం, కల్తీ విత్తనాలతో రెండేళ్ల కిందట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు నష్టపోయినా.. వారికి విత్తన కంపెనీల నుంచి నయాపైసా పరిహారం అందలేదు. ఎకరానికి రూ.లక్ష, రూ.లక్షన్నర ఖర్చుపెట్టి సాగు చేసినా విత్తన వైఫల్యంతో మిర్చి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ కల్తీ విత్తనాల బెడద మొదలైంది. గుంటూరు, కర్నూలులో జీవ వైవిధ్యం పాలిట శత్రువుగా మారిన బీజీ–3 పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మరోపక్క, రాష్ట్రానికి చెందిన కొందరు వ్యాపారులు గుంటూరు, కర్నూలు, నంద్యాల, గుజరాత్‌లలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్న 33 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బోల్‌గార్డ్–111 పేరిట నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వారి భరతం పట్టేందుకు వ్యవసాయ శాఖ, పోలీసు విభాగం సంయుక్తంగా దళాలను ఏర్పాటు చేసింది. 13 కంపెనీలను నిషేధించినా ఫలితం లేకుండా పోయింది. ఏయే సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు విత్తనాల విక్రయం నిత్యావసరాల వస్తువుల చట్టం పరిధిలోకి కూడా వస్తుంది. ఎవరైనా కల్తీ విత్తనాన్ని విక్రయిస్తే తక్షణమే కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టవచ్చు. భారతీయ శిక్షాస్మృతిలోని 420, 427, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు. అదే పత్తి విత్తనాలకైతే కాటన్ యాక్ట్ 2009 కింద కేసులు నమోదు చేయవచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. నకిలీ విత్తనాలేనని వ్యవసాయ శాఖ నిర్ధారిస్తే జిల్లా కలెక్టర్లు విత్తన కంపెనీలకు జరిమానా విధించవచ్చు. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆయా విత్తన కంపెనీల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు. రశీదు కచ్చితంగా తీసుకోండి మంచి విత్తనం చేలో వేస్తే కనీసం 15 నుంచి 20 శాతం వరకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికీ 30 శాతం విత్తనాలు చిన్న, పెద్ద వ్యాపారులు సరఫరా చేసేవే. రాష్ట్రంలో విత్తన ధ్రువీకరణ పద్ధతి ఉంది. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వంగడాలను ప్రయోగాత్మకంగా మొలక శాతాన్ని నిర్ధారించిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తారు. ప్రభుత్వ సంస్థలు సరఫరా చేసే విత్తనాలను కొనడంతోపాటు సొంతంగా తయారు చేసే ప్రైవేటు కంపెనీలు ఆ విత్తన ధ్రువీకరణ పత్రంతోనే విత్తనాలు అమ్మాలి. రైతు ఎక్కడ విత్తనాన్ని కొన్నా తాను కొంటున్న విత్తనానికి ఈ ధ్రువీకరణ పత్రం ఉందో లేదో చూడాలి. కొనుగోలు చేసిన ప్రతి వంగడానికి రశీదు తీసుకోవాలి. కల్తీ విత్తనాల వల్ల నష్టాలివీ - విత్తనాన్ని పదేపదే వేయాల్సి వస్తుంది. - ఒకటికి రెండుసార్లు కొనుక్కోవాల్సి వస్తుంది. - డబ్బుకన్నా సమయాన్ని నష్టపోవాల్సి వస్తుంది. - తెచ్చిన అప్పులు తీర్చలేక వడ్డీలు పెరిగిపోతాయి. - ఆర్థికంగా నష్టపోయి అఘాయిత్యాలకు పాల్పడాల్సి వస్తుంది. నూతన ప్రభుత్వం ఏం చేయబోతోందంటే కల్తీ విత్తనాన్ని విక్రయించే వారి భరతం పట్టేలా నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కల్తీ మాట వినబడటానికే వీలు లేదన్నారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకు వస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అటు వ్యవసాయాధికారులు, పోలీస్ యంత్రాంగంలో చలనం వచ్చింది. ముమ్మరంగా తనిఖీలు చేపట్టి కల్తీ విత్తనాలు అమ్మే సంస్థలపై నిఘా పెరిగింది. -
‘బీజీ–3’ అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: నిషేధిత బీజీ–3 పత్తి విత్తనం అమ్మితే ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం చేసేందుకు తెలంగాణ వ్యవసాయశాఖ కసరత్తు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ (ఈపీ) చట్టం 1986 రూల్ 13 ప్రకారం పర్యావరణానికి హానికలిగించే విత్తనాలు విక్రయిస్తే ఏడేళ్ల జైలుతోపాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈసారి ఈ చట్టాన్ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం 1966 విత్తన చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ చట్టం వల్ల నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కేవలం రూ. 500 జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. గతేడాది నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు విక్రయించిన, తయారుచేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. చాలా మందిని అరెస్టు చేశారు. ఈసారి అంతకుమించి ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటేనే దీన్ని అరికట్టగలమన్న భావనలో సర్కారు ఉంది. పైగా పర్యావరణ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. రైతులూ జాగ్రత్త! బీజీ–3 పత్తి విత్తనాలు కొనుగోలు చేసేముందు రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేస్తో్తంది. ఈ విత్తనాలు జీఎం (జెనిటికల్లీ మోడిఫైడ్) అని, వీటిని సాగు చేసినందుకుగాను ఇటీవల మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే రైతులను దళారులు మోసపుచ్చి బీజీ–3 విత్తనాలను అంటగడుతున్నారు. చాలా మంది రైతులకు ఈ విత్తనంపై అవగాహన లేకపోవడం, కలుపురాదని ఎక్కువ దిగుబడి వస్తుందని ప్రచారం చేస్తూ అక్రమార్కులు వారికి అంటగడుతున్నారు. ఈ పత్తి విత్తనాలు వేస్తే అత్యంత ప్రమాదకరమైన గ్లైఫోసేట్ పురుగుమందు వినియోగించాలి. ఇది జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేవని, క్యాన్సర్‌కు కారకమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. బీజీ–3 విత్తనాల విక్రయాలు రాష్ట్రంలో చాపకిందనీరులా జరుగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోకి విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. గత ఏడాది 694 శాంపిళ్లను పరీక్షించగా, 119 శాంపిళ్లలో బీజీ–3 లక్షణాలున్నట్లు నిర్ధారించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ వరకు బీజీ–3 లక్షణాలున్న విత్తనాలను నిర్ధారించేందుకు 17 శాంపిళ్లను పరీక్షించగా అందులో 8 శాంపిళ్లు బీజీ–3గా తేలినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. ఆరుగురు డీలర్ల లైసెన్స్‌లను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 112 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేయగా, 56,122 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గణనీయంగా పత్తి సాగు ఈసారి ఇప్పటి వరకు సాగైన పంటల్లోనూ పత్తిదే అగ్రస్థానంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. అందులో అత్యధికంగా పత్తి 8.50 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది బీజీ–3 విత్తనం సాగు చేసినందుకు 45 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కొందరు దళారులు, వ్యాపారులు, కొందరు అధికారుల నిర్లక్ష్యంతో బీజీ–3 విత్తన అడ్డాగా రాష్ట్రం మారింది. బీజీ–2 విత్తనం విఫలం కావడంతో కొన్ని కంపెనీలు ప్రమాదకరమైన బీజీ–3 విత్తనాన్ని రైతులకు అంటగడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ టీమ్స్ పనిచేస్తున్నప్పటికీ దళారులు, అక్రమార్కులు ఈ ప్రమాదకరమైన విత్తనాలను అన్నదాతలకు పెద్దమొత్తంలోనే విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ వర్గాలే ధ్రువీకరించడం గమనార్హం. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో బీజీ–3 విత్తన పంట చాపకింద నీరులా విస్తరిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర నుంచి సరఫరా కావడంతో పాటు మన రాష్ట్రంలో రైతుల పొలాల్లోనే బీజీ–3 పత్తి విత్తన పంటను సాగు చేయించి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. -
ఉద్యాన ఉత్పత్తుల్లో నాణ్యతే లక్ష్యం: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి, ఉద్యాన ఉత్పత్తుల కమిషనర్ సి.పార్థసారథి అన్నారు. ఉద్యాన పంటల్లో కల్తీ విత్తనాలు, నాణ్యతలేని నారు, మొక్కల సరఫరాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలు–2017ను రూపొందించిందన్నా రు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థ (టీహెచ్టీసీ)లో బుధవారం రాష్ట్రంలోని మిరప, కూరగాయల నర్సరీల యజమానులకు క్రమబద్ధీకరణ నిబంధనలపై అవగాహనకోసం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉద్యాన నర్సరీల్లో కల్తీ విత్తనాలు, కల్తీ నారును నిరోధించేందుకు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టామన్నారు. కల్తీ నిరోధించ డం లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో పోలీసు, వ్యవసాయ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. నర్సరీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి, కల్తీ ఉత్పత్తి, అమ్మకందారులపై దాడులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. కల్తీ నారు, విత్తనాలతో ఎకరాకు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు రైతులు నష్టపోవడంతో పాటు, విలువైన సమయా న్ని కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. నర్సరీల్లో అవకతవకలు, పొరపాట్లు జరగకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో మెరుగైన మౌళిక సౌకర్యాలతో ఆరోగ్యవంతమైన మొక్కలను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రాంరెడ్డి అవగాహన సదస్సులో సూచించారు. ఉద్యానవన శాఖలో నర్సరీ యజమానులు తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు, రికార్డుల నిర్వహణ సక్రమం గా ఉండేలా చూసుకోవాలన్నారు. మొక్కల ఉత్పత్తి, అమ్మకంలో అవతవకలకు పాల్పడితే విత్తన, నర్సరీ చట్ట నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి, చర్య లు తీసుకుంటామని తెలిపారు. నర్సరీల్లో రికార్డుల నిర్వహణ, విత్తన చట్టం, పీడీ యాక్టు నియమ నిబంధనలు తదితరాలపై ఉద్యాన శాస్త్రవేత్తలు అవగాహ న కల్పించారు. ఈ కార్యక్రమంలో విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ కె.కేశవులు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ శివప్రసాద్, రాచకొండ కమిషనరేట్ సీఐ విజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దగా చేసిన ధనుష్
వత్సవాయి మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయిలో ధనుష్–3, 4, 6 రకం వంగడాలతో 500 ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. మొక్కలు ఏపుగా పది అడుగుల ఎత్తు∙పెరిగి కొమ్మలతో విస్తరించాయి. పైరును చూసిన రైతులు అధిక దిగుబడులు ఖాయం అని సంతోషించారు. అయితే ఆశించిన స్థాయిలో పూత, పిందె రాలేదు. అరకొరగా కాసిన కాయలు సన్నగా ఉండటంతో ఎకరానికి ఒకటి రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. కోత ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, భీమవరం (వత్సవాయి) : ఆరుగాలం కష్టపడి సాగు చేసినా ఎకరాకు క్వింటా కూడా దిగుబడి రాలేదు. తాము సాగు చేసింది కల్తీ విత్తనాలు అని తెలిసి తెల్లబోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయి గ్రామాలలో ఈ ఏడాది కొత్తగా వచ్చిన ధనుష్–3, 4, 6 రకం విత్తనాలను సుమారు 500 ఎకరాల్లో సాగు చేశారు. భీమవరం 250 ఎకరాలు, మక్కపేట 100, ఇందుగపల్లిలో 100, వత్సవాయిలో 50 ఎకరాలలో సాగు చేశారు. ఈ విత్తనాలను వత్సవాయి గ్రామంలోని ఒక షాపు నుంచి, భీమవరం గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సాగు చేశారు. మొదట్లో పత్తి మొక్కలు ఏపుగా పది అడుగులకుపైగా పెరిగాయి. పంట ఎత్తు మాత్రం పెరిగింది కానీ పూత, పిందె మాత్రం ఆశించినంతగా రాలేదు. అక్కడక్కడా కాసిన పత్తి కాయలు కూడా సన్నగా కాశాయి. ఎకరానికి క్వింటా, రెండు క్వింటాళ్లు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులకు ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. వేరే కంపెనీలకు చెందిన విత్తనాలను నాటిన రైతులకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తుండడంతో కల్తీ విత్తనం వల్లనే నష్టపోయామని గ్రహించారు. ఎకరానికి లక్ష పెట్టుబడి పత్తి పంట సాగుచేయడానికి ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. సరాసరి కౌలు ఎకరానికి 30 వేలు కాగా ట్రాక్టర్ కిరాయి, విత్తనాలు, కూలీలు, పురుగుమందులు, ఎరువులు కలిపి మరో రూ.70 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి 1, 2 క్వింటాళ్లు వస్తుండడంతో తీత కూలి ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి తీతకు ఆసక్తి చూపని కూలీలు ఈ రకం విత్తనం సాగు చేసిన రైతులకు పత్తి తీసేందుకు కూడా కూలీలు రావడం లేదని చెబుతున్నారు. కాయ సన్నగా ఉండడంతోపాటు సక్రమంగా పగలకపోవడంతో కూలీలకు కూలి గిట్టుబాటు కావడంలేదు. పత్తిని తీసేందుకు కూలీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్తీ విత్తనాల వల్లనే నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్‌ను వివరణ కోరగా భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి గ్రామాల నుంచి ధనుష్ విత్తనం వల్ల నష్టపోయాం తమను ఆదుకోవాలని 60 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. -
కల్తీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి
రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తరగతులు వ్యవసాయ శాఖ జేడీఏతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు : రైతులకు కల్తీ విత్తనాలు పంపిణీ చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు మురళీకృష్ణ సోమవారం ఎంపీ కార్యాలయంలో ఆయన్ను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ పలు సూచనలు చేశారు. దోర్నాల, త్రిపురాంతకం మండలాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. రబీలో పెసర, అలచందలు, శనగ విత్తనాలు పంపిణీ చేసేటపుడు ఎటువంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్ పద్ధతిని అనుసరించాలని సూచించారు. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫామింగ్ వారితో ఈ నెల 18వ తేదీ మార్కాపురం పట్టణంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేలా శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు జేడీఏకి తెలిపారు. ముఖ్యంగా మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం డివిజన్లలోని రైతులు ఎక్కువమంది వచ్చేలా చూడాలన్నారు. 19వ తేదీ కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో ప్రదర్శనక్షేత్రం చేపట్టాలని దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జేడీఏకి తెలిపారు.