సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల్లో ఇద్దరు వాణిజ్య పంటలు వేసి చేతులు కాల్చుకున్న వారే. మరొకరు కల్తీ విత్తనం బారినపడి నష్టపోయిన వారు. కల్తీ విత్తన చావులకు ఇదో నిదర్శనం మాత్రమే. రాష్ట్రంలో కల్తీ విత్తనాల బారినపడి నష్టపోతున్న వారిలో పత్తి, మిర్చి రైతులే అధికం. అయితే, ప్రతి వంగడాన్ని ఏదోవిధంగా కల్తీ చేయడం సాగిపోతూనే ఉంది. ఒకపక్క కలిసిరాని ప్రకృతి, మరో వంక కల్తీ విత్తనాలతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఆర్థికంగా దెబ్బతిని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వందలాది కేసులు నమోదవుతున్నా.. తనిఖీలు చేస్తున్నా కల్తీ విత్తనాల బెడద రాష్ట్రంలో ఏమాత్రం ఆగడం లేదు. కల్తీకి పలానా కంపెనీ కారణం అని తేలినా ఆ విత్తన సంస్థల నుంచి రైతులకు పరిహారం అందడం లేదు. బడా విత్తన కంపెనీలతో లాలూచీ పడిన గత ప్రభుత్వాల నిర్వాకంతో రాష్ట్రంలో ఇప్పటికీ కల్తీ విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగానే సాగుతోంది.
కల్తీ విత్తన విక్రయ అడ్డాలు
వాణిజ్య పంటలు ఎక్కడ సాగవుతుంటే.. అక్కడ కల్తీ విత్తనాలు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, గుంటూరు, కర్నూలు, నంద్యాల వీటికి ప్రధాన అడ్డాలుగా మారాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి రైతులు కల్తీ విత్తనాలతోనే నష్టపోతున్నారు. నాసిరకం, కల్తీ విత్తనాలతో రెండేళ్ల కిందట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు నష్టపోయినా.. వారికి విత్తన కంపెనీల నుంచి నయాపైసా పరిహారం అందలేదు. ఎకరానికి రూ.లక్ష, రూ.లక్షన్నర ఖర్చుపెట్టి సాగు చేసినా విత్తన వైఫల్యంతో మిర్చి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ కల్తీ విత్తనాల బెడద మొదలైంది. గుంటూరు, కర్నూలులో జీవ వైవిధ్యం పాలిట శత్రువుగా మారిన బీజీ–3 పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మరోపక్క, రాష్ట్రానికి చెందిన కొందరు వ్యాపారులు గుంటూరు, కర్నూలు, నంద్యాల, గుజరాత్‌లలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్న 33 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బోల్‌గార్డ్–111 పేరిట నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వారి భరతం పట్టేందుకు వ్యవసాయ శాఖ, పోలీసు విభాగం సంయుక్తంగా దళాలను ఏర్పాటు చేసింది. 13 కంపెనీలను నిషేధించినా ఫలితం లేకుండా పోయింది.
ఏయే సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు
విత్తనాల విక్రయం నిత్యావసరాల వస్తువుల చట్టం పరిధిలోకి కూడా వస్తుంది. ఎవరైనా కల్తీ విత్తనాన్ని విక్రయిస్తే తక్షణమే కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టవచ్చు. భారతీయ శిక్షాస్మృతిలోని 420, 427, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు. అదే పత్తి విత్తనాలకైతే కాటన్ యాక్ట్ 2009 కింద కేసులు నమోదు చేయవచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. నకిలీ విత్తనాలేనని వ్యవసాయ శాఖ నిర్ధారిస్తే జిల్లా కలెక్టర్లు విత్తన కంపెనీలకు జరిమానా విధించవచ్చు. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆయా విత్తన కంపెనీల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు.
రశీదు కచ్చితంగా తీసుకోండి
మంచి విత్తనం చేలో వేస్తే కనీసం 15 నుంచి 20 శాతం వరకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికీ 30 శాతం విత్తనాలు చిన్న, పెద్ద వ్యాపారులు సరఫరా చేసేవే. రాష్ట్రంలో విత్తన ధ్రువీకరణ పద్ధతి ఉంది. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వంగడాలను ప్రయోగాత్మకంగా మొలక శాతాన్ని నిర్ధారించిన తర్వాత మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ప్రభుత్వ సంస్థలు సరఫరా చేసే విత్తనాలను కొనడంతోపాటు సొంతంగా తయారు చేసే ప్రైవేటు కంపెనీలు ఆ విత్తన ధ్రువీకరణ పత్రంతోనే విత్తనాలు అమ్మాలి. రైతు ఎక్కడ విత్తనాన్ని కొన్నా తాను కొంటున్న విత్తనానికి ఈ ధ్రువీకరణ పత్రం ఉందో లేదో చూడాలి. కొనుగోలు చేసిన ప్రతి వంగడానికి రశీదు తీసుకోవాలి.
కల్తీ విత్తనాల వల్ల నష్టాలివీ
- విత్తనాన్ని పదేపదే వేయాల్సి వస్తుంది.
- ఒకటికి రెండుసార్లు కొనుక్కోవాల్సి వస్తుంది.
- డబ్బుకన్నా సమయాన్ని నష్టపోవాల్సి వస్తుంది.
- తెచ్చిన అప్పులు తీర్చలేక వడ్డీలు పెరిగిపోతాయి.
- ఆర్థికంగా నష్టపోయి అఘాయిత్యాలకు పాల్పడాల్సి వస్తుంది.
నూతన ప్రభుత్వం ఏం చేయబోతోందంటే
కల్తీ విత్తనాన్ని విక్రయించే వారి భరతం పట్టేలా నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కల్తీ మాట వినబడటానికే వీలు లేదన్నారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకు వస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అటు వ్యవసాయాధికారులు, పోలీస్ యంత్రాంగంలో చలనం వచ్చింది. ముమ్మరంగా తనిఖీలు చేపట్టి కల్తీ విత్తనాలు అమ్మే సంస్థలపై నిఘా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment