అపర భగీరథుడు.. సీఎం జగన్ | R Narayana Murthy Comments About CM YS Jagan Govt | Sakshi
Sakshi News home page

అపర భగీరథుడు.. సీఎం జగన్

Published Tue, Nov 17 2020 5:40 AM | Last Updated on Tue, Nov 17 2020 5:40 AM

R Narayana Murthy Comments About CM YS Jagan Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయొచ్చని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రెండు జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.

తూర్పుగోదావరి జిల్లా అంటే.. కోనసీమ, గోదావరి డెల్టా అని చాలామంది అనుకుంటారని.. కానీ ఆ జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఈ ప్రాంతం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ రిజర్వాయర్‌ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి.. వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అనుసంధాన ప్రాజెక్టుతో తాండవ, ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం  సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement