వెండితెరపై అందంగా విరబూసిన ఎర్ర మల్లె ఆయన సినిమా. సామాన్యుడి కన్నీటి చుక్కే ఆయన కథకు చుక్కాని. కమర్షియల్ బాటలో వెళ్తున్న మెయిన్ స్ట్రీమ్ సినిమా నుంచి ఓ శాఖను విజయవంతంగా విప్లవ బాట పట్టించిన అరుదైన కళా కార్మికుడాయన. నాలుగు దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్నా ఆడంబరాలు ఎరుగని పెద్ద మనిషి ఆర్.నారాయణమూర్తి. పీపుల్స్ స్టార్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ దర్శకుడు పేపర్ లీకేజీ ఇతివృత్తంతో యూనివర్సిటీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.– శ్రీకాకుళం డెస్క్
దశాబ్దాలుగా ఎన్నో సామాజిక అంశాలపై సినిమాలు తీసిన మీరు యూనివర్సిటీ చిత్రాన్ని తెరకెక్కించడానికి దోహదపడిన అంశాలేమిటి..?
నారాయణమూర్తి: కొన్నాళ్ల కిందట జరిగిన ఓ ఘటన ఈ చిత్రాన్ని తీసేందుకు నన్ను ప్రేరేపించింది. నా మిత్రుడి కొడుకు ప్రైవేటు కాలేజీలో చదవాలని ఆశ పడ్డాడు. అయితే పిల్లాడి తండ్రికి అంత స్థోమత లేకపోవడంతో తన కిడ్నీ అమ్మి కొడుకును ప్రైవేటు కాలేజీలో చదివించాడు. అది నన్ను కలిచివేసింది. ఇలాంటి తండ్రులెందరో పిల్లల భవిష్యత్ కోసం కష్టపడుతున్నారు. విద్యార్థులు కూడా రేయింబవళ్లు శ్రమించి చదువుతున్నారు. కానీ ఇలాంటి వారి కష్టాన్ని అపహాస్యం చేస్తూ కొందరు పేపరు లీకేజీలకు పాల్పడుతున్నారు. ఫలితంగా సామాన్యుల పిల్లలు అన్యాయమైపోతున్నారు. అలాంటి బాధితుల కన్నీరే మా యూనివర్సిటీ చిత్రానికి ప్రేరకం.
ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తైతే, దానికి ప్రచారం చేసి విడుదల చేయడం మరో ఎత్తు? ఈ సినిమా ప్రచారానికి ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా చేశారా?
నారాయణమూర్తి: సినిమా విజయానికి ప్రచారమే ఇప్పుడు చాలా ప్రధానమైంది. అందుకే యూనివర్సిటీ చిత్రానికి బాగా ప్రచారం చేయాలనే ఉంది. ఈ సినిమా ప్రతి కుటుంబానికీ దగ్గరవుతుంది. అందుకే యువత కూడా నా సినిమాను ప్రమోట్ చేయాలని నా కోరిక.
మీరు ఎప్పుడూ నూతన నటీనటులతో సినిమాలు తీస్తుంటారు. యూనివర్సిటీ సినిమాకు నటుల ఎంపిక ఎలా జరిగింది?
నారాయణమూర్తి : ఈ చిత్రాన్ని విజయనగరం, విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. విజయనగరం జేఎన్‌టీయూ నుంచి అలాగే అక్కడ ఉన్న సెంచూరియన్ యూనివర్సిటీల నుంచి విద్యార్థులను తీసుకున్నాం. వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్న నటులను కూడా ఎంపిక చేసి నటింపజేశాం.
ఒకప్పుడు మీ చిత్రాలను తండోపతండాలుగా చూశారు. స్టార్ హీరోలతో సమానంగా మిమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు ఆ ఆదరణ కాస్త తగ్గడానికి కారణాలు విశ్లేషిస్తారా?
నారాయణమూర్తి: ఒకప్పుడు నా సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడిన మాట వాస్తవం. కానీ కొన్నాళ్లకు అందరూ నా తరహా సినిమాలనే తీయడంతో ఒక మొనాటనీ వచ్చేసింది. అది నా చిత్రాలపై ప్రభావం చూపింది. అయితే యూనివర్సిటీ సమకాలీన సామాజిక ఇతివృత్తంతో తీసిన సినిమా. ఇది అన్ని వర్గాలకు నచ్చుతుందని నా అభిప్రాయం.
తమిళంలో జై భీమ్, కర్ణన్, మామన్నన్ వంటి చిత్రాలను చాలా ఏళ్ల కిందటే మీరు తెలుగులో తీసి చూపించారు. ఆయా సినిమాలకు రూ.కోట్లలో కలెక్షన్లు వచ్చాయి. మీ చిత్రం అలాంటి ఆదరణ పొందడానికి మీరు తీసుకున్న చర్యలు?
నారాయణమూర్తి: సామాజిక ఇతివృత్తాలపై సినిమాలు తీయడం గూడవల్లి రామబ్రహ్మం కాలం నుంచి ఉంది. ఇప్పటి తరం కూడా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. అయితే జనం గొప్పవాళ్లు. వారు ముందుకు వచ్చి సినిమా చూస్తే నా సినిమాకూ గొప్ప ఆదరణ దక్కుతుందన్న ఆశ ఉంది.
దాసరి నారాయణరావు వంటి దర్శకుడికి ఆర్.నారాయణమూర్తి వంటి నటుడు తోడైతే ఒరేయ్ రిక్షా వంటి సినిమా వచ్చింది. అదే నారాయణమూర్తి వేరే ప్రతిభావంతులైన దర్శకులతో కలిస్తే మరెన్నో మంచి సినిమాలు వస్తాయని జనం అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?
నారాయణమూర్తి: నా వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు అన్నది నా ప్రధాన ఉద్దేశం. నేను వారికి ప్లస్ అవ్వాలి గానీ మైనస్ అవ్వకూడదు. నేను మళ్లీ సక్సెస్ బాట పట్టాక దీని గురించి ఆలోచించవచ్చు.
ఒక సినిమా విజయానికి ఆ చిత్రం ఆడిన రోజులు, కలెక్ట్ చేసిన డబ్బులు చాలా మందికి కొలమానం. కానీ మీ చిత్ర విజయానికి మీరిచ్చే కొలమానం ఏమిటి?
నారాయణమూర్తి: నేను ఎంచుకున్న అంశం జనాల్లోకి ఎంత బలంగా వెళ్లిందన్నదే నా కొలమానం. ఇలా నా సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. యూనివర్సిటీ ఆ జాబితాలోకి చేరుతుందన్న నమ్మకం ఉంది.
మీ ఆహార్యం, మీరు వాడే పాతకాలం మొబైల్ వంటివి మీ మనస్తత్వాన్ని సూచిస్తాయి. ఇప్పుడు ఓటీటీలు చాలా మంది చూస్తున్నారు. మీరూ చూస్తుంటారా?
నారాయణమూర్తి: నేను అవేమీ చూడనండీ. పాత సినిమాలే ఎక్కువగా చూస్తుంటాను. ఘంటసాల, జానకమ్మ, సుశీలమ్మ పాటలు వింటాను. ఇలా ఉండడమే నాకు ఇష్టం.
మీరు ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఎంతో డబ్బు సంపాదించారు. ఎంతో సేవ కూడా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదా?
నారాయణమూర్తి: నాకు ఆ ఆలోచన లేదు. మనం ఎవరికీ హాని చేయకపోతే చాలు. ఇంకేమీ వద్దు. పంచభూతాలు ఏం కోరి మనకు అన్నీ ఇస్తున్నాయి. నేను చేసే పనులు కూడా అలాంటివే.
ఇది విద్యా సంబంధిత సినిమా కదా. రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యా విధానాలపై మీ అభిప్రాయం ఏంటి?
నారాయణమూర్తి: ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇంగ్లిష్ మీడియంపై ప్రవేశ పెట్టడం చాలా గొప్ప నిర్ణయం. ఇంగ్లిష్‌లో చదువుకోకపోవడం వల్ల నాలాంటి వారు ఎంతో మంది ఉద్యోగాలు రాక నష్టపోయారు. ఇంగ్లిష్ చదువుకుంటే సామాన్యుల పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment