విత్తన కంపెనీలతో బాబు సర్కారు లాలూచీ! | Ys Jagan Cancels Predecessor Naidu Farmers Scheme Announces New Incentives | Sakshi
Sakshi News home page

విత్తన కంపెనీలతో బాబు సర్కారు లాలూచీ!

Published Fri, Jun 7 2019 3:55 AM | Last Updated on Fri, Jun 7 2019 3:55 AM

Ys Jagan Cancels Predecessor Naidu Farmers Scheme Announces New Incentives - Sakshi

సాక్షి, అమరావతి:  ప్రైవేట్‌ విత్తన కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. 2017లో అధికారులు రూపొందించిన రాష్ట్ర విత్తన బిల్లును అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అటకెక్కించారు. 2017 మార్చి 2వ తేదీన మంత్రివర్గ(కేబినెట్‌) సమావేశం అజెండాలో రాష్ట్ర విత్తన బిల్లును చేర్చారు. ప్రైవేట్‌ విత్తన కంపెనీలతో సంప్రదింపులు జరపాల్సి ఉందంటూ చంద్రబాబు ఆ బిల్లును పక్కన పెట్టారు. విత్తన కంపెనీలతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని, అందుకే బిల్లును పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ, నాణ్యత లేని విత్తనాల బారి నుంచి రైతులను రక్షించేందుకు రాష్ట్ర విత్తన బిల్లు–2017ను అధికారులు రూపొందించగా, చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.  

బిల్లును అప్పటి ప్రభుత్వ పెద్దలే అడ్డుకున్నారు  
నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయినా, ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోయినా సదరు కంపెనీల నుంచి బాధితులకు సరైన పరిహారం ఇప్పించడానికి ఏపీ విత్తన బిల్లు–2017ను అధికారులు రూపొందించారు. ఆ బిల్లు అమల్లోకి రాకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలే అడ్డుకున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడద అరికట్టేందుకు పటిష్టమైన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు.  

రాష్ట్ర విత్తన బిల్లు–2017లోని ముఖ్యాంశాలు  
►వ్యవసాయ శాఖ కమిషనర్‌ నేతృత్వంలో రాష్ట్ర సీడ్‌ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో ఉద్యాన శాఖ కమిషనర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీ, వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్శిటీ రీసెర్చ్‌ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. రైతులను, ఇతర వ్యవసాయ, విత్తనాల నిపుణులను కూడా సభ్యులుగా నామినేట్‌ చేస్తారు.  

►ధరల నియంత్రణ, పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించే అధికారాలను కమిటీ కలిగి ఉంటుంది.  

►విత్తనాల ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేస్తారు. రాయల్టీతో సహా ఎంత ధరకు ఏ రకం విత్తనాలను  విక్రయించాలో ఈ కమిటీ నిర్ధారిస్తుంది.

►రిజిస్ట్రేషన్‌ లేకుండా విత్తనాలు తయారు చేయడం, విక్రయించడం చేయరాదు. సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కూడా నడపరాదు.

►స్టేట్‌ సీడ్‌ సర్టిఫికేషన్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర సీడ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై 30 రోజుల్లోగా అప్పిలియేట్‌ అథారిటీకి వెళ్లే అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏక వ్యక్తితో గానీ, ముగ్గురుతో గానీ అప్పిలియేట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తుంది.

►కల్తీ విత్తనాల విక్రయాల నియంత్రణకు సీడ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమిస్తారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా ఇన్‌స్పెక్టర్‌ దాడులు, సోదాలు చేయవచ్చు.  

►తప్పుడు బ్రాండ్‌తో విత్తనాలను విక్రయిస్తున్నా, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ లేకున్నా రూ.50 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.  

►నాణ్యతా ప్రమాణాలు, ఫిజికల్‌ ప్యూరిటీ, జర్మినేషన్‌ లేకున్నా లక్ష వరకు జరిమానా, మూడేళ్లు జైలు.

►తప్పుడు నమూనా స్టాండర్డ్స్, జెనిటిక్‌ ప్యూరిటీ లేని, రిజిస్ట్రేషన్‌ లేని, తప్పుదోవ పట్టించే బ్రాండ్లు, నకిలీ, కల్తీ విత్తనాలను విక్రయిస్తే రూ.2 లక్షల  నుంచి రూ.5 లక్షల వరకు
జరిమానాతో పాటు మూడేళ్ల జైలు.

►నాణ్యత లేని, నకిలీ విత్తనా వల్ల రైతు పంటలు కోల్పోయినా, దిగుబడి తగ్గినా అప్పటి వరకు సాగుకైన ఖర్చు మొత్తాన్ని ఆయా విత్తన కంపెనీల నుంచి రైతులకు పరిహారంగా ఇప్పిస్తారు.

►రాయల్టీతో కలిపి ఎంత ధరకు విత్తనాలు విక్రయించాలనేది రాష్ట్రస్థాయి సీడ్‌ కమిటీ నిర్ణయిస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement