
గిట్టుబాటు ధర ఇవ్వకుంటే ఉద్యమిస్తాం
పొగాకు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒంగోలు అర్బన్: పొగాకు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. స్థానిక కర్నూలు రోడ్డులోని 1వ నంబర్ పొగాకు వేలం కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు వాపోయారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ ఉత్తమ శ్రేణి, తక్కువ శ్రేణి పొగాకుకు సరాసరి ఎటువంటి తేడా లేకుండా ధర ఉండటం చాలా బాధాకరమని అన్నారు. రోజురోజుకూ ధర తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని..వారికి న్యాయం జరిగేలా పోరాడతానని చెప్పారు. పొగాకు వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
అపరాధ రుసుం కింద ఉన్న రూ.200 కోట్లను ప్రభుత్వం భరించి..రైతులకు పడుతున్న పెనాల్టీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రేడ్‌వింగ్ ద్వారా రైతులు పండించిన పొగాకును సవ్యమైన రేట్లకు కొని ఆదుకోవాలన్నారు. అక్రమ కొనుగోళ్ల నివారణ చేపట్టిన బోర్డు చైర్మన్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. ఆదిమూలపు సురేష్‌తో పాటు మాజీ టుబాకో బోర్డు సభ్యుడు మారెళ్ల బంగారు బాబు, గురువారెడ్డి, రైతులు ఉన్నారు.