అన్నదాతకు మద్దతు | CM KCR Entrusted To Provide Minimum Support Price To Crops | Sakshi
Sakshi News home page

అన్నదాతకు మద్దతు

Published Wed, Apr 17 2019 3:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

CM KCR Entrusted To Provide Minimum Support Price To Crops - Sakshi

మంగళవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖ సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నడుం బిగించారు. తెలంగాణలోని కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని, ఈ నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవ హరించి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి అనుసరించాల్సిన వ్యూహం రూపొందించేందుకు సీఎం కేసీఆర్‌.. మంగళవారం ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎంపీ వినోద్‌ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సీనియర్‌ అధికారులు పార్థసారథి, రాహుల్‌ బొజ్జా, స్మితా సభర్వాల్, పౌసమి బసు, ఉద్యాన కమిషనర్‌ వెంకట్రామ్‌ రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతీ గింజకు మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలని స్పష్టంచేశారు. ‘తెలంగాణ రాష్ట్రం చేసిన ఆలోచన ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించింది. రైతులకు కనీస మద్దతు ధర అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా రైతులకు మంచి ధర లభించడం కోసం ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇందుకోసం సమగ్ర వ్యూహం రూపొందించాలి’ అని సూచించారు.  

మార్కెటింగ్‌ శాఖే కొనుగోలు చేయాలి... 
రైతులు పండించిన పంట మార్కెట్‌కు వచ్చి, కాంటా అయితే.. ఐదు నిమిషాల్లోనే వారికి చెక్కు ఇచ్చే పద్ధతి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. రైతుల నుంచి ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్‌ శాఖే కొనుగోలు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌ శాఖే కొనుగోలు చేయడం వల్ల పోటీతత్వం పెరిగి, రైతన్నలకు మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. నిధుల సేకరణ కోసం మార్కెటింగ్‌ శాఖ డైరెక్టరేట్‌కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని హామీ ఇచ్చారు. మార్కెటింగ్‌ శాఖ రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని ఆదేశించారు. దేశ విదేశాల్లో మార్కెట్‌ పోటీదారులను గుర్తించి, వారిని ఎదుర్కొనే వ్యూహం కూడా రూపొందించాలని సూచించారు.  

ఆ వివరాలన్నీ పక్కాగా ఉండాలి... 
మన రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటనే విషయంలో పక్కా వివరాలుంటే ఏ పంట పండించాలో నిర్ణయించవచ్చని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అలాగే ఏ పంటకు మంచి మార్కెట్‌ ఉందో తెలుసుకుని పంటల సాగు చేస్తే మంచి ధర వస్తుందన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పది రోజుల్లో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు. ‘వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఒక్కో రైతు నుంచి వివరాలు తెలుసుకోవాలి. ఏ గుంట భూమిలో ఏది సాగు చేస్తున్నారో సేకరించాలి. బియ్యం ఎంత తింటున్నారు? కూరగాయలు ఎన్ని తింటున్నారు? పప్పుదినుసులు ఎంత తింటున్నారు? మసాలా దినుసులు ఎంత మేర వినియోగిస్తున్నారు? నూనె గింజల వాడకం ఎంత? తదితర విషయాలు సేకరించాలి. ఈ అంశాల్లో కచ్చితమైన గణాంకాలు రూపొందించాలి. అప్పుడు వాటికి అనుగుణంగా  పంటల సాగు చేయడానికి క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. అలాగే పండించిన పంటకు మంచి మార్కెట్‌ రావడానికి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా పండించిన పంటనంతా ఒకేసారి మార్కెట్‌కు తీసుకురాకుండా, గ్రామాలవారీగా మార్కెట్‌కు తీసుకొచ్చే పద్ధతిని అలవాటు చేయాలి. ఇందుకు రైతు సమన్వయ సమితులను ఉపయోగించుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. 

కల్తీ విత్తనాలపై ఇంకా కఠినం... 
కల్తీ విత్తనాల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా ఉంటుందని సీఎం స్పష్టంచేశారు. ‘‘మన రాష్ట్రంలో వరి, మక్కలు, పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. పండ్ల తోటలున్నాయి. అక్కడక్కడా ఇతర పంటలు కూడా వేస్తున్నారు. కానీ ఈ పంటల సాగు శాస్త్రీయంగా లేదు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి పండించడంలేదు. ఉత్పాదకత పెరగాలి. నాణ్యత పెరగాలి. అప్పుడే రైతులకు మంచి ధర వస్తుంది. కల్తీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ విషయంలో ఇంకా కఠినంగా ఉంటుంది. పత్తి దిగుబడి ఎక్కువ రావడం కోసం అనువైన భూముల్లోనే పత్తి సాగు చేయించాలి. మేలు రకమైన పత్తి సాగు విధానాలు ప్రపంచంలో ఎక్కడున్నా వాటిని అధ్యయనం చేసి అనుసరించాలి. పంజాబ్‌ సహా వరిసాగు బాగా జరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలి. అక్కడి మెళకువలు తెలుసుకుని, రైతులకు నేర్పించాలి. తక్కువ కాలరీలు, తక్కువ షుగర్‌ ఉన్న వరి వంగడాలు సాగుచేయాలి. 

వరిలో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులను తీర్చిదిద్దాలి. మొక్కజొన్నకు మంచి డిమాండ్‌ ఉన్నందున మంచి విత్తనాలు తయారుచేయాలి. ప్రతిరోజూ వంటలో వాడే చింతపండుకు కొరత ఉంది. అందువల్ల తెలంగాణలో విరివిగా చింతచెట్లు పెంచాలి. హరితహారం కింద కనీసం 5 కోట్ల మొక్కలను రైతులకు ఉచితంగా సరఫరా చేయాలి. పసుపు కొమ్ములను పసుపు పొడిగా, మిరపకాయలను కారం పొడిగా, కందులను పప్పుగా మార్చి అమ్మే పనిని మహిళా సంఘాల ద్వారా చేయించాలి. స్వచ్ఛమైన పల్లీనూనె, నువ్వుల నూనెలను తయారు చేయాలి. దీనివల్ల రైతులకు మంచిధర వస్తుంది. మహిళలకు ఉపాధి దొరుకుతుంది. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుంది. మేలురకమైన సాగు పద్ధతులను రైతులకు నేర్పడానికి వ్యవసాయ విస్తరణాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆగ్రానమీ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలో ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలి’ అని సీఎం సూచించారు.  

దిగుమతి కావొద్దు... 
‘‘మనం ప్రతిరోజూ కూరల్లో కొత్తిమీర, మెంతికూర, పుదీనా, జీలకర్ర వినియోగిస్తుంటాం. కానీ వాటిని మనం పండించం. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటాం. మామిడిపండ్లు, బత్తాయిలు, ఇతర పండ్లు తింటాం. వాటిని కూడా దిగుమతి చేసుకుంటాం. చివరికి కూరగాయలను కూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలున్నాయి. నగర జనాభా 50 శాతానికి చేరుకుంటోంది. అక్కడ నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలను ఆ పట్టణాల చుట్టుపక్కలున్న గ్రామాల్లో పండిచవచ్చు. కానీ పండించడం లేదు. గతంలో గ్రామాల్లో పండించే కూరగాయలను పట్టణాలకు తీసుకెళ్లి అమ్మేవారు. కానీ ప్రస్తుతం వేరే ప్రాంతాల నుంచి పట్టణాలకు దిగుమతి చేసుకుని, పట్టణాల నుంచి కూరగాయలను గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి పోవాలి. మనం తినే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను మనమే పండించుకోవాలి. 

ఒక్క బియ్యం బస్తా కూడా తెలంగాణకు దిగుమతి కావద్దు. మనమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవాలి. అంకాపూర్‌ రైతుల మాదిరిగా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్‌ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా పంటలకు మంచి ధర రాబట్టుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యకరం? ఏది కాదు? అనే విషయంలో కూడా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ‘మంచి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలి. ఆకుకూరలు, పండ్ల వాడకాన్ని పెంచాలి. తెలంగాణ సోనా రకం బియ్యం మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్ధాలను ప్రోత్సహించాలి. కొన్ని పండ్లను ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఆయా పండ్ల సాగుకు ఏ ప్రాంతం అనువైనదో గుర్తించి సాగు చేయించాలి’ అని సీఎం ఆదేశించారు. వ్యవసాయశాఖకు ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలు అనుబంధంగా ఉండాలని, ఇందుకోసం అధికార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని ఆయన సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement