పత్తి సాగు.. తగ్గేదే లే...! | Quintal cotton in the Adoni market at record level | Sakshi
Sakshi News home page

పత్తి సాగు.. తగ్గేదే లే...!

Published Sat, Jan 1 2022 5:47 AM | Last Updated on Sat, Jan 1 2022 3:21 PM

Quintal cotton in the Adoni market at record level - Sakshi

రికార్డ్‌ ధర దక్కించుకున్న పత్తి రైతు హుస్సేన్‌ను అభినందిస్తున్న యార్డు కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి

కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామానికి చెందిన రైతు హుస్సేన్‌ ఎకరం పొలంలో పత్తి సాగు చేయగా 6 క్వింటాళ్ల దిగుబడివచ్చింది. విక్రయించేందుకు శుక్రవారం ఆదోని మార్కెట్‌ యార్డుకు పత్తి తీసుకొచ్చారు. ఫైన్‌ క్వాలిటీ కావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడి క్వింటాల్‌ రూ.10,026 చొప్పున కొనుగోలు చేశారు. ఆరు క్వింటాళ్ల పత్తికి రూ.60,156 ఆదాయం వచ్చింది. పెట్టుబడి పోనూ నికరంగా రూ.35 వేలు మిగలడంతో హుస్సేన్‌ ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదని సంతోషంగా చెబుతున్నారు.

సాక్షి, అమరావతి: ఎక్కడా ‘తగ్గేదే లే’ అన్నట్టుగా పసిడితో తెల్ల బంగారం పోటీపడుతోంది. గత రెండేళ్లుగా కనీస మద్దతు ధరకు నోచుకోని పత్తి ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది.  ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్‌ 31న ఆదోని మార్కెట్‌యార్డుకు 688 మంది రైతులు 2,911 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా కనిష్టంగా రూ.7,290, గరిష్టంగా రూ.10,026 పలికి మోడల్‌ ధర రూ.8,650గా నమోదైంది. ఈ సీజన్‌లో దక్షిణాదిలో పత్తి మార్కెట్‌ యార్డుల్లో ఇదే అత్యధిక ధర. ఇదే ఊపు కొనసాగితే సంక్రాంతిలోగా రూ.11 వేల మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గతేడాదితో పోలిస్తే తగ్గిన విస్తీర్ణం..
గత ఖరీఫ్‌లో 13.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 16.55 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్‌ పొడుగు పింజ పత్తి రూ.6,025, మధ్యస్థ పత్తి రూ.5,726 చొప్పున నిర్ణయించారు. కనీస మద్దతు ధర లభించకపోవడంతో 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా పత్తి కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయగా సీజన్‌ ప్రారంభం నుంచి పత్తి ధర తారాజువ్వలా దూసుకెళ్తోంది. ప్రారంభంలోనే క్వింటాల్‌ రూ.6,100 పలికిన పత్తి ఆ తర్వాత ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు.

పత్తి రైతుకు సత్కారం
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని పత్తి యార్డుకు వస్తున్న పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదోని మార్కెట్‌ ద్వారా 4.20 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన పత్తికి మంచి ధర పలుకుతోంది. తాజాగా ఇక్కడ అత్యధిక ధర పొందిన రైతు హుస్సేన్‌ను మార్కెట్‌ యార్డు కార్యదర్శి బి.శ్రీకాంత్‌రెడ్డి సత్కరించారు.

లాట్‌కు 30 మంది పోటీ
నాణ్యమైన పత్తి కొనుగోలు కోసం వ్యాపారుల మధ్య పోటీ అనూహ్యంగా పెరిగింది. లాట్‌కు 30 మంది వరకు పోటీపడుతున్నారు. సంక్రాంతి లోగా ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
– బి.శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement