‘ఖరీఫ్’కు మద్దతు పెంపు
వరికి క్వింటాలుకు రూ.80, పప్పుధాన్యాలకు రూ. 400 వరకు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 18 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపును ప్రకటించింది. వరి పంటకు క్వింటాలుకు రూ.80 లు, ఇతర పప్పు ధాన్యాల పంటలకు క్వింటాలుకు రూ. 400 వరకు కనీస మద్దతు ధర పెంపును ప్రకటించింది. ఈమేరకు మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ ఈ నెల 7 వ తేదీనే 14 రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపు నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ..మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పంటరుణాలను మాఫీ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్న దృష్ట్యా మద్దతు ధర పెంపు నిర్ణయాన్ని ప్రకటించలేదని కేంద్రం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కామన్ గ్రేడ్ రకం వరికి రూ. 1,550, ఏ గ్రేడ్ రకం వరికి రూ. 1,590 లు కనీస మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. ఇక పప్పు ధాన్యాలకు సంబంధించి క్వింటాలుకు రూ.5, 050 నుంచి రూ. 5,450కు పెంచింది. పెరిగిన కనీస మద్దతు ప్రకారం పెసర పప్పు క్వింటాలుకు రూ.5,225 నుంచి రూ. 5,575కు పెరిగింది. గత ఏడాది మినప్పప్పు క్వింటాలుకు రూ.5000 ఉండగా తాజాగా కనీస మద్దతు ధర పెంపుతో క్వింటా మినపప్పు రూ. 5,400లకు పెరిగింది. కనీస మద్దతు ధరను పెంచిన పంటలలో పత్తి, సోయాబీన్, వేరుశెనగ, నువ్వులు, సజ్జలు, రాగి, జొన్న పంటలున్నాయి.