ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తక్షణమే ఈ కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ ఏడాదిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్న గోధుమ మద్దతు ధరను 2 శాతం అనగా 40 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దాని ప్రకారం ఈ ఏడాది క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధరను 2,015 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం. ప్రపంచంలో గోధుమ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అలానే బార్లీపై 35 రూపాయల ధర పెంచుతూ.. క్వింటాల్ బార్లీ మద్దతు ధర 1,635 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. అలానే చెరుకు రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. క్వింటాల్ చెరకుకు మద్దతు ధరను 290 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జౌళి రంగంలో ఐదేళ్లలో 10,683 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను నిర్ణయిస్తూ.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటుంది. దానిలో భాగంగానే ఈ ఏడాదికి గాను పలు పంటల మద్దతు ధరలను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్! )
అలానే ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం 400 రూపాయలు పెంచి.. క్వింటాల్ ధర 5,050 రూపాయలుగా ప్రకటించింది. కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసేందుకు నిర్ణయించే ధర. ప్రస్తుతానికి ఖరీఫ్, రబీ రెండు సీజన్‌లకు సంబంధించి ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: రైతుకు మద్దతు ధర అసాధ్యమా?
Comments
Please login to add a commentAdd a comment