సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతోపాటు తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు పునఃప్రారంభించాలని రైతు సంఘాలు శనివారం నిర్ణయించాయి. ఈ నెల 29న(మంగళవారం) తదుపరి దశ చర్చలు మొదలు పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు అనుసరించాల్సిన పద్ధతులు, కనీస మద్దతు ధరపై(ఎంఎస్‌పీ) చట్టబద్ధతకు హామీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంటల కొనుగోలు, రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్‌కు సవరణలు.. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుంచి రైతులకు మినహాయింపు అంశాలను చర్చల ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు.
విద్యుత్ సవరణ బిల్లు–2020 ముసాయిదాలో మార్పులు చేయాలన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ వివేక్ అగర్వాల్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలు ప్రారంభిద్దామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం కోరినట్లుగానే తాము చర్చల తేదీని ఖరారు చేశామని, ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులోనే ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికైత్ చెప్పారు.
30న కేఎంపీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళనలో భాగంగా ఈ నెల 30వ తేదీన కూండ్లీ–మానేసర్–పాల్వాల్(కేఎంపీ) రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నేత దర్శన్ పాల్ చెప్పారు. ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్న రైతులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలను ఆహ్వానించారు. ట్రాక్టర్ ర్యాలీలో రైతు పెద్ద ఎత్తున పాల్గొనాలని మరో నాయకుడు రాజీందర్ సింగ్ కోరారు. కేఎంపీ రహదారిని దిగ్బంధించవద్దని రైతులను కోరే బదులు కొత్త సాగు చట్టాలను రద్దు చేయడమే మంచిదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు గత నెల రోజులుగా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్డీయేకు ఆర్‌ఎల్‌పీ గుడ్‌బై
కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నుంచి తాము విడిపోతున్నట్లు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) కన్వీనర్, నాగౌర్ ఎంపీ హనుమాన్ బెణివాల్ ప్రకటించారు. రైతులకు మద్దతుగా ఆర్‌ఎల్‌పీ కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. మరోవైపు రైతులకు మద్దతుగా మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా బీజేపీకి రాజీనామా చేశారు.
గాలిపటాలతో నిరసన
సామాజిక మాధ్యమాలు, లౌడ్ స్పీకర్లు, కరపత్రాల ద్వారా సాగు చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన యువత సింఘు సరిహద్దుల్లో ఓ సరికొత్త నిరసన చేపట్టారు. ‘రైతు లేనిదే ఆహారం లేదు’‘మేం రైతులం, ఉగ్రవాదులం కాదు’అని నినాదాలు రాసిన గాలిపటాలను ఢిల్లీలో ఎగురవేశారు. ఈ గాలిపటాలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నివాసాలపై ఎగిరినప్పుడు బహుశా మేం ఏమి కోరుకుంటున్నామో వాళ్ళకు అర్థం అవుతుందని ఓ యువకుడు వ్యాఖ్యానించారు. గాలిపటాలకు కట్టిన దారాలను కత్తిరిస్తామని, తద్వారా తమ ఉద్యమ నినాదం మరింత మంది ప్రజలకు చేరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఢిల్లీ దిశగా.. వడివడిగా
చండీగఢ్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్న రైతాంగానికి మద్దతు వెల్లువెత్తుతోంది. తోటి రైతుల పోరాటంలో పాలుపంచుకోవడానికి పంజాబ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాల్లో శనివారం ఢిల్లీకి బయలుదేరారు. వారంతా బృందాలుగా ముందుకు సాగుతున్నారు. నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కూడా వెంట తెచ్చుకుంటున్నారు. దట్టమైన పొగమంచు, తీవ్ర చలిని లెక్కచేయకుండా గమ్యం దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. కొత్త చట్టాల వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా పంజాబ్‌లోని సంగ్రూర్, అమృత్‌సర్, తార్న్‌తరణ్, గురుదాస్‌పూర్, భటిండా జిల్లాల నుంచి రైతులు ఢిల్లీవైపు బయలుదేరారని రైతు సంఘాల నేతలు తెలిపారు. అమృత్‌సర్–ఢిల్లీ జాతీయ రహదారిపై పంజాబ్ రైతుల వాహనాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఎక్కువ కాలం ఉండేలా వారు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతే తమకు విశ్రాంతి అని రైతు ఒకరు చెప్పారు. శనివారం హరియాణాలో పలు రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద టోల్ వసూలును రైతులు నిలిపివేయించారు.
(చదవండి: బీజేపీకి మిత్రపక్షం షాక్.. ఎన్డీయే నుంచి ఔట్)
Comments
Please login to add a commentAdd a comment