
ముంబై: ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో తొలిసారిగా 2018లో అత్యధికంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను ప్రకటించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఈ మొత్తం యూపీఏ ప్రభుత్వ హయాంలో 2008–09, 2012–13 ఆర్థిక సంవత్సరాల్లో ప్రకటించిన దానికంటే తక్కువేనని వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన ద్రవ్య విధాన నివేదిక(ఎంపీఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు పేర్కొంది. రైతుల పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ క్వింటాల్ వరిపై రూ.200, గోధుమపై రూ.105, మసూర్‌పై రూ.225 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, మద్దతుధర పెంపు కారణంగా ద్రవ్యోల్బణం 0.29 నుంచి 0.35 శాతం పెరిగే అవకాశముందని ఆర్బీఐ నివేదికలో తెలిపింది. బ్యారెల్ ముడిచమురు విలువ ఇప్పుడు ఒక్క డాలర్ పెరిగినా, భారత కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ) రూ.5,901 కోట్ల మేర పెరుగుతుందని వెల్లడించింది.