మిర్చిధరలపై కేంద్రం స్పందన పెద్ద జోక్: హరీశ్ రావు
మిర్చి ధరలపై కేంద్రం స్పందించిన తీరు మిలీనియం జోక్ అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల టన్నుల మిర్చి పండితే, కేకవలం 33 వేల టన్నులే కొంటారా అని ఆయన ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలన్న సోయి కేంద్రానికి లేదని ఆయన అన్నారు. బీజేపీ నేతలు మార్కెట్లలో తిరుగుతూ క్వింటాలుకు రూ. 10 వేల ధర చెల్లించాలని అంటారని, కానీ కేంద్రం మాత్రం రూ. 5వేలకే కొంటామని చెబుతోందని హరీశ్ గుర్తుచేశారు.
వాస్తవానికి మంచి నాణ్యత ఉన్న మిర్చికి అంతకంటే ఎక్కువ ధరే వస్తోందని, కానీ అన్ని రకాలకు చెందినది ఉండటంతో ధర తగ్గుతోందని ఆయన తెలిపారు. మిర్చి కొనుగోళ్లపై స్పష్టత లేనిది తమకు కాదు.. బీజేపీకేనని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతర బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని, రైతులకు న్యాయం జరిగేందుకు కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని హరీశ్ రావు తెలిపారు.